Gruha Lakshmi scheme: కర్ణాటకలో గృహలక్ష్మి పథకం అమలు.. ఎన్నికల హామీని నిలబెట్టుకున్నామన్న రాహుల్..!

కర్ణాటకలో కాంగ్రెస్ తొలిసారిగా ప్రవేశపెట్టిన పథకం ఇది. ఈ పథకం ద్వారా 1.1 కోట్ల మంది మహిళలకు లబ్ధి కలుగుతుంది. ఈ పథకం అమలు కోసం కర్ణాటక ప్రభుత్వం ఏటా రూ.32 వేల కోట్లు ఖర్చు చేయనుంది. ఇది మహిళలకు ఉద్దేశించిన పథకం.

  • Written By:
  • Publish Date - August 30, 2023 / 03:29 PM IST

Gruha Lakshmi scheme: కర్ణాటకలో ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రధాన హామీల్ని నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. తాజాగా గృహలక్ష్మి పథకాన్ని ప్రారంభించింది. బుధవారం నుంచి ఈ పథకాన్ని అమలు చేయబోతుంది. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ కలిసి ఈ పథకాన్ని ప్రారంభించారు. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కారణమైన వాటిలో గృహలక్ష్మి పథకం కీలకమైంది.
ఏంటీ పథకం
కర్ణాటకలో కాంగ్రెస్ తొలిసారిగా ప్రవేశపెట్టిన పథకం ఇది. ఈ పథకం ద్వారా 1.1 కోట్ల మంది మహిళలకు లబ్ధి కలుగుతుంది. ఈ పథకం అమలు కోసం కర్ణాటక ప్రభుత్వం ఏటా రూ.32 వేల కోట్లు ఖర్చు చేయనుంది. ఇది మహిళలకు ఉద్దేశించిన పథకం. ఇంటి పెద్ద అయినా మహిళలకు ఆర్థిక బలం చేకూర్చేదే గృహలక్ష్మి పథకం. దీని ద్వారా అంత్యోదయ కార్డు, బిపిఎల్ కార్డు, ఏపీఎల్ కార్డు కలిగి ఉండి, కుటుంబ పెద్దగా ఉన్న మహిళకు నెలకు రూ.2000 అందిస్తారు. ఒక కుటుంబంలో ఒక మహిళకు మాత్రమే ఈ పథంక వర్తిస్తుంది. మహిళ ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నా, లేదా ఇతర వ్యాపారం చేస్తూ మహిళ లేదా ఆమె భర్త ఆదాయపు పన్ను చెల్లిస్తున్నా, జీఎస్టీ రిటర్న్స్ దాఖలు చేస్తున్నా ఈ పథకం వర్తించదు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న పేద కుటుంబాల మహిళలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. ఆన్‌లైన్‌లో లేదా ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆధార్ కార్డు, పాన్ కార్డు, మొబైల్ నెంబర్ లింకై ఉండాలి. అంత్యోదయ కార్డు లేదా బీపీఎల్ కార్డు కలిగి ఉండాలి.
కీలక హామీల అమలు
కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన హామీల వల్లే ఆ పార్టీ కాంగ్రెస్‌లో అధికారంలోకి రాగలిగింది. ‘శక్తి’, ‘గృహజ్యోతి’, ‘అన్నభాగ్య’, ‘గృహలక్ష్మి’, ‘యువ నిధి’ వంటి పథకాల్ని కాంగ్రెస్ ప్రకటించింది. ప్రధానంగా ఈ ఐదు హామీలిచ్చింది. వీటిలో ‘శక్తి’, ‘గృహజ్యోతి’, ‘అన్నభాగ్య’ పథకాల్ని ఇప్పటికే అమలు చేస్తోంది. తాజాగా ‘గృహలక్ష్మి’ని ప్రారంభించింది. మిగిలింది ‘యువ నిధి’ ఒక్కటే. దీన్ని కూడా త్వరలోనే అమలు చేసేందుకు ప్రయత్నిస్తామని కాంగ్రెస్ చెప్పింది. ‘యువ నిధి’ పథకం కింద రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి ఇవ్వబోతుంది. ఇది కూడా అమలు చేస్తే కాంగ్రెస్ ఎన్నికల హామీని నిలబెట్టుకున్నట్లు అవుతుంది.
ఇతర పార్టీల విమర్శలు
కాంగ్రెస్ అమలు చేస్తున్న ఉచిత పథకాలపై బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. ఈ పథకాల్ని కాంగ్రెస్ సరిగ్గా అమలు చేయడం లేదని, ఎన్నికల హామీని తుంగలో తొక్కిందని విమర్శించింది. తెలంగాణలో బీఆర్ఎస్ కూడా ఇదే తరహా విమర్శలు చేస్తోంది. కర్ణాటకలో ప్రజలకు ఇచ్చిన హామీల్ని కాంగ్రెస్ నిలబెట్టుకోవడం లేదని బీఆర్ఎస్ అంటోంది. అయితే, కాంగ్రెస్ మాత్రం హామీల అమలుకు ప్రయత్నిస్తోంది. ఇదే తరహా హామీల్ని తెలంగాణలోనూ అమలు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది.