YS SHARMILA: వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వ్యవహారం తెలంగాణ కాంగ్రెస్‌లో అనవసర చర్చకు దారితీస్తోంది. ఇప్పటివరకు కీలక నేతలు చాలా మంది కాంగ్రెస్‌లో చేరినా ఎలాంటి సమస్యలు ఎదురుకాలేదు. కానీ, షర్మిల చేరికపై కాంగ్రెస్‌లోనే భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఒక వర్గం షర్మిల చేరికను సమర్ధిస్తుంటే, మరోవర్గం వ్యతిరేకిస్తోంది. మరోవైపు షర్మిల తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసేందుకు రెడీ అవుతోంది. ఈ పాటికే కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీని కలిసింది. అయితే, షర్మిల అడుగుతున్న సీటు విషయంలోనే సమస్య వచ్చిపడింది.
వైఎస్సార్టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన తర్వాత షర్మిల ఖమ్మం జిల్లా పాలేరు నుంచి పోటీ చేయాలని భావిస్తోంది. ఇదే సీటు నుంచి కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, స్థానిక నేత రేణుకా చౌదరి టిక్కెట్ ఆశిస్తున్నారు. షర్మిలకు పాలేరు టిక్కెట్ ఎలా కేటాయిస్తారు అంటూ ఆమె కాంగ్రెస్‌ను ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరి సీటు పొందాలంటే అర్హత ఉండాలని, షర్మిల స్థానిక నాయకురాలు కాదని రేణుకా చౌదరి వాదిస్తున్నారు. షర్మిలకు టిక్కెట్ విషయంలో అధిష్టానం ఎలాంటి హామీ ఇవ్వలేదని రేణుక అంటున్నారు. ఇదే పాలేరు నియోజకవర్గం నుంచి సీనియర్ నేత తుమ్మల నాగేశ్వర రావు కూడా టిక్కెట్ ఆశిస్తున్నారు. ఆయన స్థానికుడు కావడం, రాజకీయ అనుభవం ఉండటం, ఆర్థికంగా బలంగా ఉండటం వంటి కారణాలతో తుమ్మలకు దాదాపు సీటు ఖాయం అయినట్లు తెలుస్తోంది. త్వరలోనే కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, రాహుల్ సమక్షంలో తుమ్మల కాంగ్రెస్‌లో చేరుతారు. ఇదే జరిగితే, షర్మిలకు పాలేరు టిక్కెట్ దక్కే అవకాశం లేదు.
షర్మిల దారెటు..?
పాలేరు టిక్కెట్ దక్కకపోతే షర్మిల ఏం చేస్తుంది అనేదానిపై ఆసక్తి నెలకొంది. షర్మిలను ఏపీకి పంపి, కాంగ్రెస్ బాధ్యతలు అప్పగించాలని హైకమాండ్ భావిస్తోంది. దీనికి షర్మిల అంగీకరించడం లేదు. ఆమె తెలంగాణ నుంచే పోటీ చేయాలని భావిస్తోంది. తెలంగాణలోని రేవంత్ వర్గం కూడా షర్మిల కాంగ్రెస్‌లో చేరడాన్ని సమర్ధించడం లేదు. అందుకే ఆమెను ఏపీకే పంపించాలని సూచిస్తున్నారు. షర్మిల వల్ల తెలంగాణ కాంగ్రెస్‌కు ఎలాంటి ప్రయోజనం ఉండకపోగా, నష్టమే ఉంటుందని రేవంత్ వర్గం వాదిస్తోంది. ఇంకొందరు మాత్రం వైఎస్ కూతురుగా, షర్మిలకు ఆదరణ దక్కుతుందంటున్నారు. పాలేరు టిక్కెట్‌పై వర్గ పోరును, తెలంగాణ కాంగ్రెస్ నేతల సూచనను హైకమాండ్ పరిగణనలోకి తీసుకుంటే.. షర్మిలకు పాలేరు టిక్కెట్ ఇచ్చే అవకాశం లేదు. ఆమె ఇంకెక్కడినుంచైనా పోటీ చేయాలి. ఇతర చోట్ల ఆమెకు పెద్దగా గెలుపు అవకాశాలు లేవు. ఈ నేపథ్యంలో షర్మిలకు కాంగ్రెస్ హ్యాండ్ ఇస్తుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
రాజకీయంగా సమాధే..!
రాబోయే ఎన్నికల్లో పోటీ చేసి తన అస్తిత్వాన్ని నిలుపుకోకపోతే షర్మిలకు ఇబ్బంది తప్పదు. ఒకవేళ తెలంగాణలో పోటీ చేయలేకపోయినా.. కనీసం ఏపీలో అయినా పోటీ చేసి, గెలిచి తీరాలి. అప్పుడే షర్మిలకు రాజకీయ భవిష్యత్. లేదంటే పార్టీ విలీనం తర్వాత, పోటీ కూడా చేయలేకపోవడమంటే షర్మిలకు పెద్ద అవమానంగానే భావించాలి. అయితే, షర్మిల సేవల్ని ఏపీలో వాడుకుని లబ్ధి పొందాలని కాంగ్రెస్ భావిస్తోంది. అందువల్ల షర్మిలకు ఏపీలో మంచి ప్రాధాన్యం దక్కే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో షర్మిల, కాంగ్రెస్ ఎలాంటి నిర్ణయానికొస్తారో చూడాలి.