KHAMMAM MP: తెలంగాణలో ఖమ్మం పార్లమెంట్ హాట్ సీట్‌గా మారింది. ఆ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలన్నీ కాంగ్రెస్ గెలుచుకుంది. దాంతో అక్కడ నిలబడితే ఈజీగా గెలిచి.. పార్లమెంట్‌లో అధ్యక్షా అనే ఛాన్స్ వస్తుందని ఆశపడుతున్నారు. అందుకే కాంగ్రెస్‌లో ఈ టిక్కెట్ కోసం పోటాపోటీ నడుస్తోంది. మొన్నటిదాకా మాజీ ఎంపీ రేణుకా చౌదరి బరిలో ఉన్నారు. కాంగ్రెస్ అధిష్టానం ఆమెకు రాజ్యసభ టిక్కెట్ ఇవ్వడంతో.. ఇప్పుడా రేస్ నుంచి రేణుక తప్పుకున్నారు. ఇక మిగిలింది ముగ్గురు మంత్రుల కుటుంబసభ్యులు. వాళ్ళల్లో కాంగ్రెస్ అధిష్టానం ఎవరికి టిక్కెట్ ఇస్తుంది అన్నది సస్పెన్స్‌గా మారింది.
CAG Report: కాళేశ్వరంలో దోపిడీ నిజమే.. బీఆర్ఎస్ సర్కార్‌ని ఉతికారేసిన కాగ్
ఖమ్మం సీటు కోసం చాలా మంది రేసులో ఉన్నారని తెలిసే సోనియాగాంధీని పోటీ చేయాలని కోరారు సీఎం రేవంత్ రెడ్డి. కానీ ఆమె రాజస్థాన్ నుంచి పెద్దల సభకు నామినేషన్ వేశారు. ఫైర్ బ్రాండ్‌గా పిలిచే రేణుకా చౌదరికి కూడా రాజ్యసభ టిక్కెట్ వచ్చేసింది. దాంతో ఇప్పుడు ఖమ్మం ఎంపీ సీటు కోసం పోటీ పడుతోంది ముగ్గురు మంత్రుల కుటుంబ సభ్యులే. వీళ్ళల్లో ఎవరికి టిక్కెట్ ఇస్తారా అని కాంగ్రెస్ కార్యకర్తలు టెన్షన్‌తో చూస్తున్నారు. తెలంగాణలో అధికారం దక్కించుకున్న కాంగ్రెస్ ఖాతాలో ఖమ్మం జిల్లా నుంచి 9 స్థానాలు చేరాయి. అందుకే పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఈ జిల్లాలో సత్తా చాటాలని భావిస్తున్నారు ఆ పార్టీ నేతలు. ఖమ్మం పార్లమెంటు పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ స్థానాలు కూడా కాంగ్రెస్‌కే దక్కాయి. గతంలోనూ, ఇప్పుడూ.. కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న ఖమ్మం ఎంపి సీటు కోసం ఆ పార్టీకి చెందిన ప్రముఖులు పోటీ పడుతున్నారు. అధిష్ఠానం పెద్దల దగ్గర తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ రాజస్థాన్ నుంచి ఎంపీగా వెళ్తుండటంతో.. ఇక్కడి ఆశావాహులకు లైన్ క్లియర్ అయింది. ఈ టిక్కెట్ కోసం ఇప్పుడు ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రుల కుటుంబ సభ్యుల మధ్య పోటీ నడుస్తోంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య మల్లు నందిని అప్లయ్ చేశారు.
ఖమ్మం నుంచి గాంధీభవన్ వరకు అనుచరులతో కలిసి భారీగా కార్ల ర్యాలీ కూడా తీశారు. ఇంకా జిల్లా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు.. పొంగులేటి ప్రసాద్ రెడ్డి కూడా టిక్కెట్ అడుగుతున్నారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దీపాదాస్ మున్షీతో మంత్రి పొంగులేటి చర్చలు కూడా జరిపారు. ఈ నెల 18న ప్రసాదరెడ్డి కుమారుడి రిసెప్షన్ పేరుతో భారీ బల ప్రదర్శనకు పొంగులేటి సిద్ధమైనట్టు తెలుస్తోంది. ప్రసాదరెడ్డి కుమారుడి రిసెప్షన్‌ను ప్రెస్టేజ్‌గా తీసుకొని స్వగ్రామం అయిన ఖమ్మం జిల్లా కల్లూరులో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. మంత్రి పొంగులేటి గతంలోనూ తన కొడుకు, కుమార్తె పెళ్ళిళ్ళ సందర్భంగా ఖమ్మంలో ఇలాగే గ్రాండ్ రిసెప్షన్‌లు ఏర్పాటు చేసి BRSకు తన వ్యక్తిగత బలం ఏంటో చూపించారు. ఇంకా ఖమ్మం ఎంపీ టిక్కెట్ రేసులో మిగిలింది మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కొడుకు యుగంధర్. ఇప్పటి దాకా తుమ్మల గెలుపు కోసం వెనక ఉండి పనిచేశాడు యుగంధర్. ఇప్పుడు ఖమ్మం ఎంపీ టికెట్ ఇస్తే ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని భావిస్తున్నారు. ఖమ్మంకు చెందిన పారిశ్రామికవేత్త రాజేంద్రప్రసాద్ కూడా టికెట్ కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారు. మంత్రులు, ప్రముఖులు ఖమ్మం టిక్కెట్ రేసులో ఉండటంతో హాట్ సీట్‌గా మారింది. ఈ సీటు విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ఎవరికి రికమండ్ చేస్తారు. కాంగ్రెస్ అధిష్టానం ఎవరికి టిక్కెట్ ఇస్తుంది అన్నది సస్పెన్స్‌గా మారింది.