T CONGRESS: మరో మూడు నెలల్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. అధికార బీఆర్ఎస్‌తో కాంగ్రెస్, బీజేపీ ప్రధానంగా పోటీ పడబోతున్నాయి. అయితే, ప్రస్తుత ట్రెండ్ చూస్తుంటే ఈ ఎన్నికలు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్‌గానే మారే అవకాశాలున్నాయి. మొన్నటిదాకా ఊపు మీద కనిపించిన బీజేపీ.. ఇప్పుడు చతికిలపడింది. దీంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే ప్రధాన పోటీ ఉండబోతుంది. ప్రస్తుతం ఉన్న సర్వేల ప్రకారం.. కాంగ్రెస్ పార్టీకి మంచి ఆదరణ దక్కే ఛాన్స్ ఉంది. కాంగ్రెస్ మెరుగైన సీట్లు గెలుచుకునే అవకాశం ఉన్నట్లు సర్వేలు చెబుతుంటే.. ఇంకొంచెం కృషి చేస్తే అధికారం దక్కొచ్చన్నది ఆ పార్టీ నేతల అభిప్రాయం.
సర్వేల్లో ఏం తేలిందంటే..
కాంగ్రెస్ పార్టీ గతంతో పోలిస్తే పుంజుకున్న సంగతి తెలిసిందే. ఇదే హవా ఎన్నికల వరకు కూడా కొనసాగితే సులభంగా 40కిపైగా సీట్లు ఖాయమని కాంగ్రెస్ అంతర్గత సర్వేల్లో తేలింది. అయితే, అధికారంలోకి రావాలంటే 60 స్థానాలు కావాలి. అందుకే ఈ అంశంపైనే కాంగ్రెస్ ప్రధానంగా దృష్టి సారించింది. కొంచెం కష్టపడితే 60 కాదు.. 65 సీట్లు సాధించవచ్చని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ అంశంపై కాంగ్రెస్ అంతర్గతంగా చర్చిస్తోంది. మెజారిటీ సీట్లు సాధించి, అధికారం దక్కించుకోవాలని కాంగ్రెస్ లక్ష్యంగా నిర్ణయించుకుంది. దీనికోసం ఈ నెల 16న సీడబ్ల్యూసీ సమావేశం నిర్వహించబోతుంది. పార్టీని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలి.. ప్రభుత్వంపై ఎలా పోరాడాలి.. ప్రభుత్వ వైఫల్యాల్ని ఎలా ప్రజలకు వివరించాలి.. వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చించబోతుంది. అంతేకాదు.. అభ్యర్థుల ప్రకటన తర్వాత ప్రచారంతో హోరెత్తించాలని కాంగ్రెస్ డిసైడైంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్ర స్థాయిలో ప్రచారం చేయబోతుంది. ఇవన్నీ పార్టీకి కలిసొస్తాయని కాంగ్రెస్ నమ్ముతోంది.
వలస నేతలతో ప్రయోజనం
కాంగ్రెస్ పార్టీలోకి ప్రస్తుతం ఇతర పార్టీల నేతలు క్యూ కడుతున్నారు. బీఆర్‌ఎస్‌కు చెందిన కీలక నేత తుమ్మల నాగేశ్వర రావు ఈ నెలలోనే పార్టీలో చేరబోతున్నారు. వైఎస్ షర్మిల చేరిక కూడా ఖాయమైంది. గతంలో కాంగ్రెస్‌లో కొనసాగిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ప్రస్తుతం కాంగ్రెస్ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. మరికొందరు నేతలు కూడా కాంగ్రెస్‌లో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇదే సమయంలో పార్టీ పథకాలు కూడా కాంగ్రెస్‌కు కలిసొచ్చే అవకాశం ఉంది. బీసీలకు అధిక సీట్లు కేటాయించడం కూడా ఆ పార్టీపై సానుకూలత పెంచుతుందని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న సానుకూల వాతావరణాన్ని మరింత పెంచుకోవడం ద్వారా ఎన్నికల్లో గెలవాలని కాంగ్రెస్ ప్రణాళికలు సిద్దం చేస్తోంది. సరైన ప్రణాళికతో పూర్తిస్థాయి ఎన్నికల బరిలోకి త్వరలోనే దిగనుంది.