Addanki Dayakar: అద్దంకి దయాకర్.. తెలంగాణ కాంగ్రెస్‌లో సీనియర్ నేత. రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు తలెత్తినా.. కాంగ్రెస్‌ని వదిలిపెట్టకుండా ఉన్నారు. బీఆర్ఎస్ సహా మిగతా పార్టీల్లో ఫ్రెండ్స్ సర్కిల్ ఉన్నా.. ఆ పార్టీల నుంచి ఆఫర్లు వచ్చినా వేటికీ లొంగలేదు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో భువనగిరి టిక్కెట్ ఆశించినా దక్కలేదు. నిన్న గాక మొన్న ఎమ్మెల్సీ టిక్కెట్ వచ్చినట్టే వచ్చి చేజారిపోయింది. అయినా నిరాశ చెందలేదు. పార్టీ అధిష్టానంపైనే ఆశలు పెట్టుకున్నారు అద్దంకి దయాకర్. ఇంకా మంచి పోస్టు.. ఇంకా పెద్దది ఏమైనా ఇస్తారేమో అని ఆశాభావం వ్యక్తం చేశారు.
PAWAN KALYAN: పవన్‌కు కన్నీళ్ళు తెప్పించాడు.. ఐర్లాండ్ నుంచి ఓడ కళాసి లెటర్..
వరుస త్యాగాలు చేస్తున్న అద్దంకి దయాకర్‌కు కాంగ్రెస్ అధిష్టానం ఏ పోస్ట్ ఇవ్వబోతోందన్న చర్చ పార్టీ శ్రేణులు, ఆయన అభిమానుల్లో నడుస్తోంది. పార్టీకి లాయల్‌గా ఉన్నవాళ్ళని ఎప్పుడూ వదులుకోదని.. ప్రస్తుతం ఎమ్మెల్సీలుగా నిలబెట్టిన ఇద్దరిని చూస్తే అది తెలుస్తుందని అంటున్నారు. బల్మూరి వెంకట్‌తో పాటు మహేష్ కుమార్ గౌడ్‌కు ఎమ్మెల్సీ దక్కింది. ఈ ఇద్దరూ ఎప్పటి నుంచో పార్టీకి విధేయులు. ఆ విధేయతే వాళ్ళను ఇప్పుడు ఎమ్మెల్సీలను చేస్తోంది. అలాగే అద్దంకి విధేయతకూ గుర్తింపు ఉంటుందని అంటున్నారు. దయాకర్‌కు పీసీసీ చీప్ అప్పగిస్తారని కొందరు అంటున్నారు. పార్టీ కూడా అలాంటి బెటర్ ఆఫర్ ఇవ్వాలని అనుకుంటోందని చెబుతున్నారు. అద్దంకికి పీసీసీ చీఫ్ కాకపోతే.. కేబినెట్ ర్యాంక్ కలిగిన నామినేటెడ్ పోస్టు ఇచ్చే ఛాన్సుంది. అది కాకుండా.. ఎస్సీ రిజర్వుడ్ స్థానమైన వరంగల్ ఎంపీ అభ్యర్థిగా ఆయన్ని నిలబెడతారని కూడా చెబుతున్నారు. అందుకే ఆ నియోజకవర్గంలో పరిచయం చేసేందుకు.. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అద్దంకిని రేవంత్ రెడ్డి వెంటబెట్టుకొని వెళ్ళారని అంటున్నారు.
రెండుసార్లు అవకాశాన్ని వదులుకున్న అద్దంకి దయాకర్‌కు పెద్ద పదవే వస్తుందని చెబుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి దావోస్ నుంచి వచ్చాక.. ఆయన పదవిపై స్పష్టత వస్తుందని సమాచారం. MLC నామినేషన్ దాఖలు చేయడానికి సరిగ్గా కొన్ని గంటల ముందు అద్దంకి టిక్కెట్‌ను మహేష్ కుమార్ గౌడ్‌కు కేటాయించడం ఆశ్చర్యంగా ఉంది. ఈ మార్పిడి వెనుక ఎవరి హస్తం ఉంది..? AICC పెద్దలను ఎవరు ప్రభావిత చేశారు..? అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఎమ్మెల్సీ నామినేషన్‌కు అన్ని పత్రాలు రెడీ చేసుకోవాలని చెప్పి.. చివరి నిమిషంలో అధిష్టానం పెద్దలు మనసు మార్చుకోవడం వెనుక ఎవరో ఉన్నట్టు అర్థమవుతోంది. అయితే గతంలో కోమటిరెడ్డి బ్రదర్స్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు అద్దంకి. ఆ తర్వాత క్షమాపణలు చెప్పారు కూడా. అంతకుమించి ఆయన పెద్దగా ఎవరితోనూ గొడవపడిన సందర్భాలు లేవంటున్నారు. ఇంతకంటే మంచి అవకాశం ఇవ్వాలనే అద్దంకిని ప్రస్తుతానికి పక్కనబెట్టినట్టు తెలుస్తోంది.