Mohammed Feroz Khan: ఎంఐఎంకు కంచుకోటగా ఉన్న నియోజకవర్గాల్లో నాంపల్లి ఒకటి. ఇక్కడ వరుసగా ఎంఐఎం అభ్యర్థులే గెలుస్తూ వస్తున్నారు. అయితే, ఈసారి మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి ఫిరోజ్ ఖాన్ నుంచి ఎంఐఎంకు గట్టి పోటీ తప్పేలా లేదు. ఫిరోజ్ ఖాన్ సీనియర్ పొలిటీషియన్. నాంపల్లి నుంచి 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఎంఐఎం అభ్యర్థి మహ్మద్ విరాసత్ రసూల్ ఖాన్ చేతిలో ఫిరోజ్ ఖాన్ 6,799 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఒక రకంగా అప్పుడు రసూల్ ఖాన్‌కు గట్టి పోటీ ఇచ్చినట్లే.
REVANTH REDDY: కేసీఆర్ బకాసురుడు.. పదేళ్లలో కేసీఆర్ కుటుంబమే బంగారు మయమైంది: రేవంత్ రెడ్డి
తర్వాతి కాలంలో ప్రజా రాజ్యం పార్టీ కాంగ్రెస్‌లో విలీనమైంది. దీంతో ఫిరోజ్ ఖాన్ కాంగ్రెస్ సభ్యుడయ్యారు. అయితే, 2014లో జరిగిన ఎన్నికల్లో ఎంఐఎం ఒత్తిడితో కాంగ్రెస్ పార్టీ ఫిరోజ్ ఖాన్‌కు టిక్కెట్ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఆయన టీడీపీలో చేరి, ఆ పార్టీ తరఫున బరిలోకి దిగి మరోసారి గట్టి పోటీ ఇచ్చారు. అనంతర పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్‌లో చేరారు. 2018లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి, మూడో సారి కూడా ఓడిపోయారు. తాజాగా మరోసారి కాంగ్రెస్ తరఫున నాంపల్లి నుంచి పోటీ చేయబోతున్నారు. అయితే, ఈ సారి ఫిరోజ్‌ఖాన్ గెలిచే అవకాశాలున్నాయి. దీనికి కారణం.. ఓటర్ల జాబితాలో మార్పులు. ఈ ఈ నియోజకవర్గంలో భారీగా బోగస్ ఓట్లు ఉన్నాయని ఫిరోజ్‌ఖాన్ ఈసీకి ఫిర్యాదు చేశారు. ఈసీ అధికారులు పట్టించుకోకపోవడంతో కోర్టును ఆశ్రయించారు. ఎన్నికల సంఘం.. ఓటర్ కార్డును ఆధార్‌తో లింక్ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడడంతో వేల సంఖ్యలో బోగస్ ఓట్లు తొలగిపోయాయి. దీంతో బోగస్ ఓట్ల బాధ తప్పింది.
అలాగే ఎంఐఎం తరఫున గెలిచిన స్థానిక సిట్టింగ్ ఎమ్మెల్యేపై వ్యతిరేకత ఉండటంతో పార్టీ అధిష్టానం ఈసారి అభ్యర్థిని మార్చింది. అలాగే ఓటమి భయంతో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ సైతం ఈ నియోజకవర్గంలో ప్రచారం మొదలు పెట్టారు. అయినప్పటికీ ఫిరోజ్‌ఖాన్‌పై సానుభూతి వ్యక్తమవ్వడం ఎంఐఎంను కలవరపెడుతోంది. మూడుసార్లు ఓడిపోయిన సానుభూతి ఫిరోజ్‌ఖాన్‌కు కలిసొచ్చే అవకాశం ఉంది. దీంతో కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్న ఫిరోజ్‌ఖాన్ ఈ సారి విజయం సాధిస్తారని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు.