T BJP: ఫలిస్తున్న బీజేపీ ఆకర్ష్.. అసంతృప్తులకు గాలం.. కమలం గూటికి కాంగ్రెస్ నేతలు

బీజేపీ.. ఇతర పార్టీ నేతల్ని ఆకర్షించే పనిలో ఉంది. దీనిలో భాగంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు వరుసగా బీజేపీ గూటికి చేరుతున్నారు. సినీ నటి జయసుధ త్వరలోనే బీజేపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమవుతుండగా.. మరికొందరు కీలక నేతలు కూడా కాషాయ కండువా కప్పుకోబుతున్నారు.

  • Written By:
  • Publish Date - July 30, 2023 / 12:55 PM IST

T BJP: ఇటీవలి కాలంలో తెలంగాణలో బీజేపీ కాస్త వెనుకబడ్డట్లు కనిపించినప్పటికీ మళ్లీ పుంజుకునే పనిలో ఉంది. సొంత పార్టీ నేతల విషయంలో అనేక అనుమానాలు ఉన్నప్పటికీ.. ఇతర పార్టీ నేతల్ని ఆకర్షించే పనిలో ఉంది. దీనిలో భాగంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు వరుసగా బీజేపీ గూటికి చేరుతున్నారు. సినీ నటి జయసుధ త్వరలోనే బీజేపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమవుతుండగా.. మరికొందరు కీలక నేతలు కూడా కాషాయ కండువా కప్పుకోబుతున్నారు.

ఇప్పటికే మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్, రంగారెడ్డి జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డి, ఉమ్మడి మెదక్‌ జిల్లా దివంగత నేత బాగారెడ్ది తనయుడు, డీసీసీబీ మాజీ అధ్యక్షుడు జైపాల్‌రెడ్డి ఢిల్లీలో శనివారం బీజేపీలో చేరారు. రాష్ట్ర బీజేపీ ఎన్నికల ఇన్‌చార్జి ప్రకాశ్‌ జవదేకర్‌ సమక్షంలో, తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఎంపీ కే లక్ష్మణ్‌, ఈటల రాజేందర్‌, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్‌ చుగ్‌తో కలిసి వాళ్లంతా బీజేపీలో చేరారు. వీరిలో జైపాల్ రెడ్డి జహీరాబాద్‌ ఎంపీగా పోటీ చేయబోతున్నారు. వీరి చేరికల వల్ల మల్కాజ్‌గిరి, రంగారెడ్డి, మెదక్‌ జిల్లాల్లో తమ పార్టీ మరింత బలపడుతుందని కిషన్ రెడ్డి అన్నారు. ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన మంచిర్యాల జిల్లాకు చెందిన ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు సొత్కు సంజీవరావు, అమరాజుల శ్రీదేవి కాంగ్రెస్‌ పార్టీకి గుడ్‌బై చెప్పారు. వీరిద్దరూ ఆగస్టు 1న బీజేపీలో చేరబోతున్నారు. వీళ్లు ఢిల్లీలో అమిత్‌షా సమక్షంలో బీజేపీ కండువా కప్పుకోబోతున్నారు.

వీరితోపాటు సినీ నటి జయసుధ కూడా బీజేపీలో చేరబోతున్నారు. ఈ అంశంపై ఇప్పటికే బీజేపీ పెద్దలతో సంప్రదింపులు జరుగుతున్నాయి. కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన కిరణ్ కుమార్ రెడ్డి జయసుధను పార్టీలో చేర్చేుందుకు కృషి చేస్తున్నారు. జయసుధ సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు. గతంలోనూ జయసుధ ఇక్కడి నుంచే పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. పైగా ఆమె క్రిస్టియన్. దీంతో ఈ సామాజికవర్గం ఓట్లతో ఈసారి జయసుధ గెలిచే అవకాశాలున్నాయని బీజేపీ భావిస్తోంది. ప్రస్తుతం బీజేపీ ఇతర పార్టీలకు చెందిన అసంతృప్త నేతలకు గాలం వేస్తోంది. అధికార బీఆర్ఎస్‌తోపాటు కాంగ్రెస్ నేతలను కూడా తమ పార్టీలో చేర్చుకునేందుకు సిద్ధంగా ఉంది. పార్టీలో టిక్కెట్ల కోసం పోటీ తక్కువగానే ఉన్నందున ఇతర పార్టీల నేతలు చేరినా.. టిక్కెట్ల కేటాయింపు సమస్య కాదని బీజేపీ భావిస్తోంది. దీంతో ఆశావహులకు టిక్కెట్ హామీ ఇస్తూ తమ పార్టీలో చేర్చుకుంటోంది.