CONGRESS MANIFESTO: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోని రిలీజ్ చేసింది. AICC అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే.. కాంగ్రెస్ ఆరు గ్యారంటీల కార్డును రిలీజ్ చేశారు. ముందు నుంచి చెబుతున్నట్టే మహాలక్ష్మి పథకం, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్ళు, యువ వికాసం, చేయూత పేరుతో గ్యారంటీలను ప్రకటించింది కాంగ్రెస్. అభయహస్తం పేరుతో కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదలైంది. తాము అధికారంలోకి వస్తే ఏమేమి పథకాలు అమలు చేస్తామో చెబుతూ ఆరు గ్యారంటీల కార్డును కూడా ప్రకటించారు.
ఇది చదవండి: Congress Manifesto: కేసీఆర్‌కు ఓటమి భయం పట్టుకుంది: మల్లికార్జున ఖర్గే
ఇప్పటిదాకా ముఖ్యమంత్రి కేసీఆర్.. ప్రగతి భవన్ లేదంటే ఫామ్ హౌస్‌కే పరిమితం అయ్యారనీ.. జనం కలవడానికి అవకాశం ఇవ్వట్లేదని కాంగ్రెస్ విమర్శిస్తోంది. అందుకే తాము అధికారంలోకి వస్తే.. సీఎం క్యాంపాఫీస్‌లో ప్రతి రోజూ ప్రజాదర్బార్ నిర్వహిస్తామంటోంది. తెలంగాణ తొలి, మలి ఉద్యమ అమరవీరుల కుటుంబాలకు 25 వేల గౌరవ పెన్షన్‌తో పాటు వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామంటోంది కాంగ్రెస్. తెలంగాణ ఉద్యమకారులపై కేసులు ఎత్తివేసి.. వాళ్ళకి 250 గజాల ఇళ్ళ స్థలాలు ఇస్తామని మేనిఫెస్టోలో ప్రకటించింది. అలాగే 50 యేళ్ళు దాటిన జానపద కళాకారులకు నెలకు రూ.3 వేల పెన్షన్ ఇవ్వనుంది. రైతులకు రూ.2 లక్షల దాకా రుణమాఫీ, రూ.3 లక్షల దాకా వడ్డీలేని రుణాలు, వ్యవసాయానికి 24 గంటల విద్యుత్, సమగ్ర పంటల బీమా పథకం ప్రకటించింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై విచారణ జరిపిస్తామని మేనిఫెస్టోలో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. యువత, నిరుద్యోగులకు కూడా కాంగ్రెస్ వరాలు ప్రకటించింది.
మెగా డీఎస్సీతో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేయడం, వార్షిక జాబ్ కేలండర్‌తో 2 లక్షల ఉద్యోగాల భర్తీ, ప్రతి విద్యార్థికి ఫ్రీ ఇంటర్నెట్ వైఫై సౌకర్యం కల్పించనుంది. ఆరోగ్యశ్రీ లిమిట్ 10 లక్షలకు పెంచుతామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో తెలిపింది. ధరణిని బంగాళాఖాతంలో కలుపుతామన్న కాంగ్రెస్ పార్టీ.. భూమాత పోర్టల్‌ను ప్రవేశపెడతామని మేనిఫెస్టోలో తెలిపింది. భూహక్కులు కోల్పోయిన రైతులందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చింది. ల్యాండ్ కమిషన్ ఏర్పాటు చేసి.. భూహక్కుల సమస్యలు పరిష్కరిస్తామంటోంది కాంగ్రెస్. బెల్ట్ షాపులను పూర్తిగా రద్దు చేస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. హిందూ, మైనార్టీ పేదల అమ్మాయిల పెళ్ళిళ్ళకు లక్ష రూపాయలతో పాటు 10 గ్రాముల బంగారం ఇస్తామంటోంది కాంగ్రెస్. అన్ని జిల్లా కేంద్రాల్లో ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఏర్పాటు, గల్ఫ్ సంక్షేమ బోర్డు ఏర్పాటు, మరణించిన గల్ఫ్ కార్మికుడి కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. హైదరాబాద్‌ను ముంపు బారి నుంచి రక్షించడం, కొత్త మెట్రో మార్గం లాంటి వరాలను కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో ప్రకటించింది.