Congress: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకూ స్పీడ్ పెంచుతోంది. ఎన్నికల హామీల్లో భాగంగా వరుసగా డిక్లరేషన్లు ప్రకటిస్తూ వెళ్తోంది. ఇప్పటికే మహిళా డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్, రైతు డిక్లరేషన్, ఎస్సీ.. ఎస్టీ డిక్లరేషన్ ప్రకటించిన కాంగ్రెస్.. ఇప్పుడు మైనార్టీ డిక్లరేషన్ ప్రకటించేందుకు రెడీ అయ్యింది. ఈ నెల 9న నిజామాబాద్‌లో నిర్వహించబోయే సభలో ఈ డిక్లరేషన్‌ను ప్రకటించబోతోంది. ఈ సభకు కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ హాజరు కానున్నట్టు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చెప్పారు.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మైనార్టీల సంక్షేమం గురించి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో ఈ సభలో వివరించబోతున్నారు. గత కొంత కాంలంగా ఓ పక్క చేరికలు, మరోపక్క హామీలతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఫుల్ స్పీడ్‌లో ఉంది. మేనిఫెస్టోలో భాగంగా ప్రకటించిన ఆరు హామీలను ప్రతీ గ్రామానికి తీసుకువెళ్లేందుకు కాంగ్రెస్ శ్రేణులు గ్రౌండ్ లెవెల్‌లో కష్టపడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో అధికారాన్ని చేజిక్కించుకునేందుకు ఉన్న అన్ని మార్గాలను అన్వేషిస్తున్నారు. ఖచ్చితంగా గెలుస్తారు అనుకునే అభ్యర్థులనే బరిలో దింపేందుకు హైకమాండ్ తీవ్ర కసరత్తు చేస్తోంది. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్‌లో ప్రతీ ఓటు కూడా చాలా కీలకంగా మారడంతో.. పార్టీతో కలిసి వచ్చేందుకు సిద్ధంగా ఉన్న ప్రతీ కార్యకర్తను, నాయకుడిని కలుపుకుని వెళ్తోంది.
ఇప్పటికే పూర్తి స్థాయిలో అభ్యర్థులను ప్రకటించిన బీఆర్‌ఎస్.. మేనిఫెస్టోను కూడా రిలీజ్ చేసింది. మరోసారి అధికారం చేపట్టే దిశగా ముందుకు వెళుతోంది. బీఆర్‌ఎస్ స్పీడ్‌ను కంట్రోల్ చేసేందుకు కాంగ్రెస్ అన్ని విధాలా వ్యూహాలు రచిస్తూ డిక్లరేషన్లతో దూసుకువెళ్తోంది. ఇప్పటికే కొన్ని డిక్లరేషన్లతో ప్రజల మన్ననలు గెలుచుకున్న కాంగ్రెస్.. ఇప్పుడు మైనార్టీ డిక్లరేషన్‌తో ముస్లీంలకు ఎలాంటి వరాలు ఆఫర్ చేస్తుందో చూడాలి.