Congress: తన గొయ్యి తానే తవ్వుకున్న రాహుల్‌..!

పరువు నష్టం కేసులో రాహుల్‌గాంధీపై అనర్హత వేటు పడింది. దీనిపై రాజకీయ యుద్ధం నడుస్తోంది. అది వేరే సంగతి. అయితే 2013లో రాహుల్‌ చేసిన ఓ ఓవరాక్షన్ ఇప్పుడు తన ఎంపీ పదవి పోయేలా చేసింది. ఇంతకీ 2013లో ఏం జరిగిందో తెలుసా..?

  • Written By:
  • Publish Date - March 24, 2023 / 06:30 PM IST

రాహుల్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది 2019లో.. దొంగల ఇంటిపేర్లన్నీ మోడీనే అంటూ కామెంట్ చేశారు. దీనిపై సూరత్‌ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించడంతో లోక్‌సభ సెక్రటేరియట్ వెంటనే స్పందించింది. అనర్హత వేటు వేసింది. నిజానికి చట్టం కూడా శిక్ష పడినప్పటి నుంచే అనర్హత వేటు పడుతుందని చెబుతోంది. నిజానికి ఈ చట్టానికి 2013లో ఓసారి సవరణ చేయాలని అప్పటి మన్మోహన్‌ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నించింది. కానీ దాన్ని రాహుల్‌ అడ్డుకున్నారు. ఆ రోజు ఆయన దూకుడే ఈ రోజు కొంపముంచిందని కాంగ్రెస్ నేతలు చెప్పుకుంటున్నారు.

2013లో ఏం జరిగింది..?
2013లో లిల్లీథామస్‌ వర్సెస్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 8(4)ను కొట్టేసింది. రెండేళ్లు, అంతకుమించి శిక్షపడి అనర్హత కత్తి వేలాడుతున్న ప్రజాప్రతినిధులకు అప్పీల్‌ చేసుకునే వెసులుబాటును ఈ సెక్షన్ కల్పించింది. మూడు నెలల పాటు అనర్హత వేటు పడకుండా ఇది అడ్డుకుంటుంది. ఒకవేళ పైకోర్టులు శిక్షను రద్దు చేసినా, స్టే విధించినా వారికి ఊరట దక్కుతుంది. అయితే ఈ సెక్షన్‌ను సుప్రీం దీన్ని తోసిపుచ్చింది. దీంతో అప్పటి మన్మోహన్ ప్రభుత్వం.. ముందు జాగ్రత్తపడాలని భావించింది. అనర్హత వేటు పడే అవకాశం ఉన్న ప్రజాప్రతినిధులకు కనీసం మూడు నెలల పాటు వెసులుబాటు ఇచ్చేలా ఆర్డినెన్స్ తీసుకురావాలని నిర్ణయించింది. దీనికి కేబినెట్ కూడా ఓకే అంది. అయితే దానిపై రాహుల్ మీడియా సాక్షిగా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

కాంగ్రెస్‌ నేత అజయ్‌మాకెన్‌ మాట్లాడుతున్న ప్రెస్‌కాన్ఫరెన్స్‌లోకి సడన్‌గా రాహుల్‌ ఎంట్రీ ఇచ్చారు. అప్పటిదాకా మాకెన్ ఆ ఆర్డినెన్స్‌ను సమర్ధిస్తూ మాట్లాడారు. వెంటనే మైక్‌తీసుకున్న రాహుల్‌ ఆర్డినెన్స్‌పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇదో చెత్త జీవో అన్నారు. అది తన వ్యక్తిగత అభిప్రాయం అంటూనే దాన్ని చించి పక్కన పడేయాలన్నారు. అనడమే కాదు చేశారు కూడా. రాహుల్‌ యూటర్న్‌తో మాకెన్‌ కూడా మాటమార్చాల్సి వచ్చింది. అప్పట్లో రాహుల్ తీరుపై తీవ్ర విమర్శలు కూడా వచ్చాయి. మన్మోహన్‌ను అవమానపరిచారంటూ ప్రతిపక్షాలు కూడా విమర్శలు గుప్పించాయి. కేంద్రం కూడా ఆ అర్డినెన్స్‌పై వెనక్కు తగ్గింది.

రాహుల్ నాటి దూకుడు నేడు ఆయన కొంపముంచింది. ఆ రోజు ఆయన చేసిన పని ఈ రోజు మెడకు చుట్టుకుంది. ఆ రోజు రాహుల్‌ ఆ ఆర్డినెన్స్‌ పాసయ్యేలా చేసి ఉంటే ఈ రోజు తక్షణమే అనర్హత వేటు పడేది కాదు. న్యాయపరమైన చర్యలు తీసుకునేందుకు సమయం దొరికేది. ఆ రోజు కాంగ్రెస్‌ పెద్దలు ముందు జాగ్రత్తతో వ్యవహరించినా రాహుల్‌.. మీడియా ముందు ఓవరాక్షన్ చేశారు. అదే ఇప్పుడు కొంప ముంచింది.