Congress: రాహుల్‌కు ఆయుధం అందించిన బీజేపీ కమలం పార్టీ ఘోరమైన తప్పు చేసిందా ?

అవకాశం విలువ.. రాజకీయానికి తెలిసినంత మరెవరికీ తెలియదు ! అవకాశం అందలం ఎక్కిస్తుంది. అదే అవకాశం ప్రత్యర్థి మీద ఆయుధంగా మారుతోంది. చిన్న తప్పు.. అవతలి వ్యక్తికి ఆయుధంగా మారి.. మనల్నే కమ్మేయడానికి ఎక్కువ సమయం పట్టదు.

  • Written By:
  • Publish Date - March 29, 2023 / 08:30 PM IST

రాహుల్ అనర్హత వేటుతో ఇప్పుడు రాజకీయం మాట్లాడుకుంటోంది ఇదే ! లోక్‌సభలో రాహుల్‌పై అనర్హత వేటు.. దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీస్తోంది. అనర్హత వేటు పడడం.. రాహుల్ ప్రెస్‌మీట్ పెట్టి తన మార్క్‌ డైలాగులు వదలడం, ఆ తర్వాత ట్విట్టర్‌లో డిస్‌క్వాలిఫైడ్ ఎంపీ అంటూ ట్యాగ్‌ తగిలించుకోవడం.. ఇలా రాజకీయంగా రాహుల్‌ చేతికి ఆయుధం దొరికినట్లు అయింది. ముఖ్యంగా విపక్షాలన్నీ ఏకం అయ్యేందుకు ఒక మార్గం దొరికింది. నిజానికి బీజేపీ వర్సెస్ మిగతా పార్టీలు అన్నట్లుగా దేశ రాజకీయం కనిపిస్తోంది.

దీంతో కాంగ్రెస్‌తో సహా ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకం కావాలని.. అప్పుడే బీజేపీని ఓడించడం సాధ్యం అవుతుందన్న ఆలోచనలు కనిపించాయ్. ఐతే ప్రతీసారి అది మాటగానే మిగిలిపోగా.. రాహుల్ అనర్హత వేటు తర్వాత ఆచరణలోకి వస్తోంది. సింపథీతో కొందరు.. సీరియస్‌గా మరికొందరు.. రాహుల్ ఇష్యూతో.. విపక్షాలన్నీ ఒక్కతాటి మీదకు వస్తున్నాయ్. కాంగ్రెస్‌ను, రాహుల్‌ నాయకత్వాన్ని వ్యతిరేకించే బెంగాల్‌ సీఎం దీదీ కూడా ఇప్పుడు సపోర్టుగా నిలుస్తున్నారు. ఢిల్లీ సీఎం కేజ్రివాల్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సహా అన్ని పార్టీలూ, అందరు నాయకులు ఈ అనర్హతను ఖండిస్తున్నారు. కాంగ్రెస్ అనుకూల, వ్యతిరేక విపక్షాలు అన్నిటినీ ఏకం చేసింది ఈ పరిణామం.

నిజానికి సూరత్ తీర్పు తర్వాత.. అది బీజేపీకి ఆయుధంగా మారాలి. కట్‌ చేస్తే అది కాంగ్రెస్‌కు ఆయుధంగా మారిన పరిస్థితి. సూరత్‌ కోర్టు తీర్పు ఇచ్చింది.. ఈలోపే లోక్‌సభ ఆఫీస్‌ తొందరపడిందా అనే చర్చ జరుగుతోంది. స్పీకర్ మీద ఇప్పుడు విపక్షాలన్నీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు రెడీ అవుతున్నాయంటే.. వారిలో ఐక్యత అర్థం చేసుకోవచ్చు. లోక్‌సభలో కమలం పార్టీకి క్లియర్ మెజారిటీ ఉంది.. ఐతే స్పీకర్ మీద అవిశ్వాస తీర్మానం అంటే.. అత్యంత అవమానకరమైన సందర్భం అది ! పరువునష్టం కేసుల్లో శిక్షలు పడటం చాలా అరుదు. శిక్షపడినా, పైన కోర్టుల్లో వెసులుబాటు ఉంటుంది. అది బీజేపీకి తెలియదని ఎలా అనుకుంటామనే ప్రశ్నలు వినిపిస్తున్నాయ్. ఏమైనా కమలం పార్టీ చేసిన తప్పు.. ఇప్పుడు ప్రతిపక్షాల ఐక్యతకు కారణం అవుతోంది.

ఇది ఒకరకంగా బీజేపీ చేసిన వ్యూహాత్మిక తప్పిదం అన్నది క్లియర్‌. పొత్తు కట్టిన చేసేదేమీ లేదు అని కమలం పార్టీ నేతలు బిల్డప్ ఇస్తే.. వాళ్ల పతనాన్ని వాళ్లే రాసుకున్నట్లు ! రాజకీయం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఇవాళ పడిన వాళ్లు రేపు లేస్తారు.. రేపు లేచిన వాళ్లు ఆ తర్వాత పడిపోతారు. గతంలో బీజేపీ, కాంగ్రెస్ విషయంలో జరిగింది అదే ! ఏమైనా అనర్హత వేటుతో బీజేపీ సెల్ఫ్ గోల్ వేసుకుంది అన్నది నిజం.. రాహుల్‌కు ఆయుధం అందించింద అన్నది నిజం.. కాంగ్రెస్‌కు లాభం చేసిందన్నది నిజం.