T Congress: తెలంగాణలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రజలకు కాంగ్రెస్ పార్టీ హామీల జల్లు కురిపించింది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఈ 6 పథకాల్ని కచ్చితంగా అమలు చేస్తామని ప్రకటించింది. ఆరు గ్యారెంటీ పథకాలివి.
మహాలక్ష్మీ పథకం
ఇది మహిళలకు సంబంధించిన పథకం. దీని ద్వారా రాష్ట్రంలోని మహిళలకు ప్రతి నెలా రూ.2,500 అందజేస్తారు. అలాగే పేద మహిళలకు రూ.500కే వంట గ్యాస్ సిలిండర్ ఇస్తారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తారు.
రైతు భరోసా
రైతులకు సంబంధించిన ఈ పథకం ద్వారా ప్రతి ఏటా రైతులకు, కౌలు రైతులకు రూ.15 వేలు, వ్యవసాయ కూలీలు, భూమిలేని నిరుపేదలకు ఏడాదికి రూ.12 వేలు అందజేస్తారు. వరికి మద్దతు ధర కల్పించడంతోపాటు రూ.500 బోనస్‌గా అందిస్తారు.
ఇందిరమ్మ ఇండ్ల పథకం
ఈ పథకం ద్వారా ఇండ్లు లేని పేదవారికి ఇంటి స్థలంతోపాటు నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం అందజేస్తారు. ప్రత్యేకంగా తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇస్తారు.
గృహజ్యోతి పథకం
ఈ పథకం కింద పేదలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పిస్తారు
చేయూత పథకం
దీనిలో భాగంగా రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం కింద రూ.10 లక్షల వరకు ఆరోగ్య బీమా కల్పిస్తారు. అర్హులకు చేయూత కింద నెలకు రూ.4 వేల పింఛన్ అందజేస్తారు.
యువ వికాసం
ఈ పథకం కింద కళాశాల విద్యార్థులకు కోచింగ్ ఫీజు, ఉన్నత విద్య కోసం రూ.5 లక్షల వరకు ఆర్థిక సాయం అందిస్తారు.