Jupally Krishna Rao: జూపల్లికి కాంగ్రెస్ హ్యాండ్ ఇస్తుందా..? ఇద్దరిలో కొల్లాపూర్ టిక్కెట్ ఎవరికి..?

జూపల్లికి టిక్కెట్ ఇవ్వడాన్ని కొల్లాపూర్ కాంగ్రెస్ ఇంచార్జి జగదీశ్వర్ రావు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ జూపల్లికి టిక్కెట్ ఇచ్చినా సరే.. తను మాత్రం పోటీలో నిలుస్తానని చెబుతున్నారు. దీంతో ఇద్దరిలో ఎవరికి టిక్కెట్ ఇవ్వాలో తెలియని స్థితిలో కాంగ్రెస్ పెద్దలున్నారు.

  • Written By:
  • Publish Date - October 2, 2023 / 08:05 PM IST

Jupally Krishna Rao: నాగర్ కర్నూల్ జిల్లా, కొల్లాపూర్ టిక్కెట్‌ హామీతో కాంగ్రెస్‌లో చేరిన జూపల్లి కృష్ణారావుకు స్థానిక కాంగ్రెస్ ఇంఛార్జ్‌ నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. జూపల్లికి టిక్కెట్ ఇవ్వడాన్ని కొల్లాపూర్ కాంగ్రెస్ ఇంచార్జి జగదీశ్వర్ రావు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ జూపల్లికి టిక్కెట్ ఇచ్చినా సరే.. తను మాత్రం పోటీలో నిలుస్తానని చెబుతున్నారు. దీంతో ఇద్దరిలో ఎవరికి టిక్కెట్ ఇవ్వాలో తెలియని స్థితిలో కాంగ్రెస్ పెద్దలున్నారు.
జూపల్లి కృష్ణారావు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన సీనియర్ నేత. ప్రస్తుతం నాగర్ కర్నూల్ జిల్లాలోని కొల్లాపూర్ నుంచి గతంలో గెలుపొందారు. పలుసార్లు మంత్రిగా పని చేశారు. అయితే, 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అక్కడ గెలిచిన బీరం హర్షవర్దన్ రెడ్డి బీఆర్ఎస్‌లో చేరిపోయారు. దీంతో జూపల్లిని బీఆర్‌ఎస్ పట్టించుకోలేదు. దీంతో బీఆర్ఎస్‌పై అసంతృప్తితో ఉన్న జూపల్లి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ పార్టీకి ఆదరణ పెరుగుతుండటం, కొల్లాపూర్ టిక్కెట్ ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇవ్వడంతో గత ఆగష్టులోనే జూపల్లి కాంగ్రెస్‌లో చేరారు. కొల్లాపూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా జూపల్లి ప్రచారం చేసుకుంటున్నారు. అయితే, దీనిపై కొల్లాపూర్ కాంగ్రెస్ ఇంచార్జి జగదీశ్వర్ రావు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకాలం కాంగ్రెస్ పార్టీ కోసం పని చేసిన తనకు కాకుండా.. నెల క్రితం పార్టీలో చేరిన వారికి టిక్కెట్ ఇవ్వడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
పోటీ తప్పదంటున్న జగదీశ్వర్ రావు
జూపల్లి కాంగ్రెస్‌లో చేరినప్పటికీ.. పార్టీ టిక్కెట్ తనకే వస్తుందని జగదీశ్వర్ రావు అంటున్నారు. నియోజకవర్గ ప్రజల మద్దతు తనకే ఉందని, సర్వేలో కూడా ఈ విషయం స్పష్టమైందని ఆయన చెప్పుకొంటున్నారు. పార్టీలో ఎప్పటినుంచో కష్టపడ్డ తాను ఉండగా జూపల్లి కృష్ణారావుకు టికెట్ ఇవ్వడం సరికాదంటున్నారు. కొల్లాపూర్ సర్వేల్లో తానే గెలుస్తానని తేలిందన్నారు. కాంగ్రెస్ పెద్దల మద్దతు జూపల్లికి ఉన్నప్పటికీ, ప్రజల ఆశీర్వాదం మాత్రం తనకే ఉందన్నారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ తనకు టిక్కెట్ ఇవ్వకపోయినా.. కొల్లాపూర్ నుంచి పోటీ చేసి తీరుతానని హెచ్చరిస్తున్నారు. అందువల్ల తనకే టిక్కెట్ ఇవ్వాలని కాంగ్రెస్ పెద్దలను కోరుతున్నారు.
కాంగ్రెస్ ఏం చేస్తుంది..?
ఇప్పుడు జూపల్లి, జగదీశ్వర్ రావు అంశం కాంగ్రెస్ పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది. ఇద్దరిలో ఎవరికి టిక్కెట్ ఇవ్వాలనే విషయంలో సందిగ్ధత నెలకొంది. నిజానికి సర్వేల్లో జూపల్లిపై కొంత వ్యతిరేకత కనిపించిందంటున్నారు. అలాగని ఆయనకు టిక్కెట్ నిరాకరించడం సాధ్యమేనా అనే ప్రశ్న తలెత్తుతోంది. జూపల్లికి టిక్కెట్ ఇస్తే.. కాంగ్రెస్ నుంచి జగదీశ్వర్ బయటకు వెళ్తే పార్టీలో చీలిక రావడం ఖాయం. అందుకే ఈ విషయంలో ఎవరో ఒకరిని ఒప్పించి, మరొకరికి టిక్కెట్ ఇవ్వడం చేస్తుందేమో చూడాలి. లేదా సర్వే ఫలితం ఆధారంగా నిర్ణయం తీసుకుంటుందేమో మరికొద్ది రోజుల్లో తేలుతుంది.