Jagga Reddy: జగ్గారెడ్డి కారువైపు చూస్తున్నారా..? ముందుగానే మొదలైన వ్యతిరేకత..!

జగ్గారెడ్డి బీఆర్ఎస్‌లో చేరాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన కొంతకాలంగా బీఆర్ఎస్ నేతలతో టచ్‌లో ఉన్నారు. త్వరలోనే కాంగ్రెస్‌ను వీడి, బీఆర్ఎస్‌లో చేరబోతున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే, పార్టీ మారే అంశంపై జగ్గారెడ్డి ఇంకా స్పందించలేదు.

  • Written By:
  • Updated On - August 18, 2023 / 01:30 PM IST

Jagga Reddy: కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీపై, అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై అసంతృప్తితో ఉన్న సీనియర్ నేత జగ్గారెడ్డి బీఆర్ఎస్‌లో చేరాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన కొంతకాలంగా బీఆర్ఎస్ నేతలతో టచ్‌లో ఉన్నారు. త్వరలోనే కాంగ్రెస్‌ను వీడి, బీఆర్ఎస్‌లో చేరబోతున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
అయితే, పార్టీ మారే అంశంపై జగ్గారెడ్డి ఇంకా స్పందించలేదు. చాలా రోజులుగా ఈ ప్రచారం జరుగుతున్నప్పటికీ ఆయన దీన్ని ఖండించలేదు. గతంలోలాగా బీఆర్ఎస్‌పై విమర్శలు చేయడం లేదు. పైగా.. ఇటీవల రేవంత్ రెడ్డిపైనే అసంతృప్తి వ్యక్తం చేశారు. కొంతకాలం నుంచి కాంగ్రెస్ కార్యక్రమాలకు కూడా దూరంగానే ఉంటూ వస్తున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి కేటీఆర్‌ను జగ్గారెడ్డి కలిశారు. ఆయనతోపాటు టీఎన్‌జీవో రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్‌ కూడా కేటీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా కేటీఆర్ సరదాగా మాట్లాడుతూ.. జగ్గారెడ్డిని గెలిపిస్తావా అని రాజేందర్‌ను అడిగారు. దీంతో రాజేందర్ బదులిస్తూ.. సగ్గారెడ్డిలో గెలిపించి బీఆర్ఎస్‌లోకి తీసుకొస్తానని చెప్పారు. తాజా పరిణామాలు చూస్తుంటే ఇది నిజమయ్యేలానే ఉంది. కాకపోతే.. ముందుగానే జగ్గారెడ్డి బీఆర్ఎస్‌లో చేరి పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు జగ్గారెడ్డి బీఆర్ఎస్‌లో చేరుతుండటంపై ఆ పార్టీ వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.
వ్యతిరేకిస్తున్న చింతా ప్రభాకర్ వర్గం..
జగ్గారెడ్డి కాంగ్రెస్‌‌లో ఉంటే.. సంగారెడ్డి నియోజకవర్గంలో బీఆర్ఎస్ తరఫున మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పని చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ టిక్కెట్ తనకే కావాలని ఆశిస్తున్నారు. ఇలాంటి సమయంలో జగ్గారెడ్డి బీఆర్ఎస్‌లో చేరితే, తనకు అన్యాయం జరుగుతుందని ప్రభాకర్ అంటున్నారు. జగ్గారెడ్డి రాకను ఆయన, తన వర్గం వ్యతిరేకిస్తోంది. తెలంగాణ ఉద్యమ ద్రోహి అయిన జగ్గారెడ్డిని బీఆర్ఎస్‌లో చేర్చుకోవద్దని ఆయన అధిష్టానాన్ని కోరుతున్నారు. తాజాగా చింతా ప్రభాకర్ వర్గీయులు మంత్రి హరీష్ రావును కలిసి జగ్గారెడ్డిని చేర్చుకోవద్దని కోరారు. గత ఎన్నికల్లో ఓడిపోయనప్పటికీ, బీఆర్ఎస్ కోసం చింతా పని చేశారని, తిరిగి ఆయనకే టిక్కెట్ ఇవ్వాలని కోరుతున్నారు. చింతా ప్రజల సమస్యలు పరిష్కరిస్తూ, ప్రజలకు దగ్గరయ్యారని, ఆయనకు టిక్కెట్ ఇస్తే గెలిపించుకుంటామని బీఆర్ఎస్ నేతలు హరీష్ రావును కోరారు. ఇంతకాలం నియోజకవర్గ ప్రజలను పట్టించుకోని జగ్గారెడ్డిని బీఆర్ఎస్‌లో చేర్చుకుంటే పార్టీకి నష్టం జరుగుతుందని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో జగ్గారెడ్డి బీఆర్ఎస్‌లో చేరుతారా..? ఆయనను అధిష్టానం చేర్చుకుంటుందా..? లేక ఆయన కాంగ్రెస్‌లోనే కొనసాగుతారా..? అన్నది వేచి చూడాలి.