T CONGRESS: కాంగ్రెస్ ఇంతే.. కాంగ్రెస్‌లో ఇంతే.. అనే ఓ మాట ఉంది. ఆ పార్టీలో శత్రువులు వేరే ఎక్కడో ఉండరు. గాంధీభవన్‌లోనే చక్కర్లు కొడుతుంటారు. వాళ్లు చాలు కాంగ్రెస్‌ను ఓ పది అడుగులు వెనక్కి లాగడానికి అనే చర్చ ఉంది. అలాంటిది ఇప్పుడు సీన్ మారినట్లు కనిపించింది. హస్తం పార్టీ నేతలంతా.. అధికారం కోసం పట్టు మీద కనిపిస్తున్నారు. గ్యాంగ్ వార్ తగ్గింది. సీనియర్లు, జూనియర్లు కలిసిపోతున్నారు. గ్రూపులు ఉన్నా.. అందరూ సైలెంట్‌గానే ఉన్నారు. కానీ, ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. పార్టీలో లుకలుకలు మళ్లీ మొదలైనట్లు కనిపిస్తున్నాయ్.
గ్రూప్ వార్ కారణంగానే కాంగ్రెస్‌కు ఈ పరిస్థితి వచ్చింది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా, తెచ్చిన పార్టీగా క్రెడిట్ సాధించడంలో ఘోరంగా విఫలం అయింది. ఎంతోమంది సీనియర్ నాయకులు ఉన్నా.. వారికి విజయం సాధించే సత్తా ఉన్నా.. వారి మధ్య జరిగే గొడవలే వాళ్ల ఓటమికి కారణాలు అవుతున్నాయన్నది బహిరంగ రహస్యం. అలాంటి కాంగ్రెస్‌లో.. తెలంగాణకు రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షులు అయిన తర్వాత కాస్త ఊపు వచ్చింది. ఈసారి బీఆర్ఎస్‌కు ప్రధాన పోటీ ఇచ్చేది కాంగ్రెస్సే అనే స్థాయికి చేరింది. ఇలాంటి పరిస్థితుల్లోనే ప్రస్తుతం టీకాంగ్‌లో ఉన్న కొంతమంది పెద్దలకు, రేవంత్ రెడ్డికి అసలు పడటం లేదు. దీంతో వాళ్లు లోలోపల చర్చించుకునే కొన్ని విషయాలను బహిరంగంగానే మీడియా ముందు బయట పెట్టేసుకుంటున్నారు. ఐతే లేటెస్ట్‌గా కాంగ్రెస్ సీనియర్ నేత మనోహర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయ్. మహేశ్వరం టిక్కెట్ కోసం రేవంత్ రెడ్డి 10 కోట్ల రూపాయలు తీసుకున్నారని.. అంతేకాకుండా 5 ఎకరాల భూమి రాయించుకున్నారని మీడియా ముందు ఆరోపించారు.
ఈ విషయాలను మొత్తం సాక్ష్యాలతో సహా బయటపెడతామని సవాల్ విసిరారు. బడంగ్‌పేట మేయర్ పారిజాత నర్సింహారెడ్డి దగ్గర 10కోట్ల రూపాయలు.. 5 ఎకరాల భూమి రాయించుకున్నారు అంటూ షాకింగ్ విషయాలు బయట పెట్టారు. ఇదే విషయాన్ని పార్టీ సీనియర్ నేత వీహెచ్ కూడా చెప్పారని.. టైం వచ్చినప్పుడు అన్ని సాక్ష్యాలతో బయటపెడతానని అన్నారు. ఆయన చేసిన కామెంట్స్ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. దీనిపై కాంగ్రెస్ అధిష్టానం, రేవంత్ ఎలా రియాక్ట్ అవుతారన్నది హాట్‌టాపిక్ అవుతోంది.