CONGRESS VS BRS: రాజకీయాల్లో అధికారమే పరమావధి. అధికారంలో ఉన్న పార్టీలోకే నేతలు వెళ్తారు. దీనికి ఎవరూ అతీతం కాదు. ఇప్పుడు తెలంగాణలో అదే జరుగుతున్నట్లు కనిపిస్తోంది. అధికార కాంగ్రెస్‌లోకి బీఆర్ఎస్ నేతలు వరుసగా క్యూ కడుతున్నారు. మొన్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రాజయ్య కాంగ్రెస్‌లో చేరగా, ఇప్పుడు పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ వెంకటేశ్ నేత కూడా కాంగ్రెస్ కండువా కప్పుకొన్నారు. త్వరలో బీఆర్ఎస్‌కు చెందిన స్వామిగౌడ్, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, మాజీ మంత్రి మహేందర్ రెడ్డి కూడా కాంగ్రెస్‌లో చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన నేతలతోపాటు ఆ పార్టీకి చెందిన పలువురు సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది.
REVANTH REDDY VS KCR: దక్షిణ తెలంగాణకు బీఆర్ఎస్ అన్యాయం అసెంబ్లీలో ఎదురుదాడికి కాంగ్రెస్ ప్లాన్
కీలక నేతలు రహస్యంగా కాంగ్రెస్ పార్టీతో సంప్రదింపులు జరుపుతున్నారు. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే రాబోయే రోజుల్లో బీఆర్ఎస్‌కు భారీ షాకులు తప్పేలా లేవు. ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుందని బీఆర్ఎస్ సహా వివిధ పార్టీల నేతలు చెబుతుంటే.. కాంగ్రెస్ మాత్రం బీఆర్ఎస్‌ను దెబ్బతీసే పనిలో ఉంది. కాంగ్రెస్ కూలడం సంగతి పక్కనబెట్టి.. సొంత పార్టీ నేతల్ని కాపాడుకోవడంపైనే కేసీఆర్ దృష్టి సారించాల్సిన పరిస్థితులు రావొచ్చు. నిజానికి ఇలా అధికార పార్టీలోకి ఇతర పార్టీల నేతలు రావడం కొత్త విషయం కాదు. గతంలో నేతలు నైతిక విలువలకు కట్టుబడి, గెలిచిన పార్టీలోనే ఉండేవాళ్లు. ఒకరిద్దరు మాత్రమే పార్టీలు మారేవాళ్లు. కానీ, ఈ ట్రెండ్ మార్చింది కేసీఆర్. తన ప్రభుత్వం అధికారంలో ఉన్న రెండుసార్లు ఇతర పార్టీల నేతల్ని వరుసగా బీఆర్ఎస్‌లో చేర్చుకున్నారు. టీడీపీ, కాంగ్రెస్, వైసీపీ సహా అన్ని పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు బీఆర్ఎస్‌లో చేరిపోయారు. ఇది తప్పే కాదన్నట్లు కేసీఆర్, కేటీఆర్ ప్రకటనలుండేవి. అభివృద్ధి కోసం, తమ పార్టీ విధానాలు నచ్చి అందరూ బీఆర్ఎస్‌లో చేరుతున్నట్లు చెప్పుకొనేవాళ్లు. చివరికి టీడీపీని పూర్తిగా బీఆర్ఎస్‌లో విలీనం చేశారు. దీంతో ఆ పార్టీ తెలంగాణలో ఉనికే కోల్పోయింది. ఏ పార్టీలో గెలిచినా.. బీఆర్ఎస్‌వైపే నిలిచారు. ఈ కారణంగా ప్రతిపక్షాలు బలహీనమైపోయాయి.
ఇప్పుడు ఇదే ట్రెండ్ సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ కొనసాగించేలా ఉంది. ఇప్పటికే జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, మెదక్ జిల్లా నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ వంటి నేతలు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. వీళ్లంతా పార్టీ మారేందుకే రేవంత్‌ను కలిశారనే ప్రచారం జరుగుతోంది. కానీ, ఈ విషయాన్ని వీళ్లు ఖండించారు. కానీ, ఇప్పటికిప్పుడు కాకపోయినా.. భవిష్యత్తులో అయినా వీళ్లంతా కాంగ్రెస్‌లో చేరడం ఖాయమని రాజకీయ వర్గాలు అంటున్నాయి. మరోవైపు 30 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఒకవేళ నిజంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరినా.. బీఆర్ఎస్‌కు ప్రశ్నించే నైతిక అర్హత లేదనేది కాంగ్రెస్ చెబుతున్న మాట. ఎందుకంటే గతంలో కేసీఆర్ చేసింది అదే కదా. ఏదేమైనా బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్‌లో చేరుతుండటంతో.. బీఆర్ఎస్ బలహీనపడుతున్న మాట వాస్తవం.