INDIA : ‘ఇండియా’ స్కెచ్ తో పొలిటికల్ హీట్..

ఇంకా సమయం ఇస్తే ఇండియా కూటమి పూర్తిస్థాయిలో బలోపేతం అయ్యే అవకాశాలు ఉంటాయని భావిస్తున్న బీజేపీ సర్కారు.. సాధ్యమైనంత త్వరగా ఎన్నికలకు వెళ్లాలని ప్లాన్. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరాం అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యం ..

కాంగ్రెస్ సారథ్యంలోని ‘ఇండియా’ కూటమి వేగంగా పావులు కదుపుతోంది. ఎన్నికలు సమీపిస్తున్నందున ఈనెలాఖరులోగా కూటమిలోని 28 పార్టీల మధ్య సీట్ల సర్దుబాటును కొలిక్కి తెచ్చే దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. దీంతో పొలిటికల్ హీట్ పెరిగింది. ఈ ప్రభావం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వంపై స్పష్టంగా కనిపిస్తోంది. ఇండియా కూటమిలోని 28 పార్టీలకు అవి ప్రాతినిధ్యం వహించే రాష్ట్రాల్లో ఎన్నో కొన్ని అసెంబ్లీ సీట్లో, లోక్ సభ సీట్లో ఉన్నాయి. వాటి నాయకులకు ఆ రాష్ట్రాల్లో గట్టి ఫాలోయింగ్, పెద్ద ఎత్తున ఓటు బ్యాంకు ఉన్నాయి. కానీ ఎన్డీయే కూటమిలో జనసేన లాంటి ఒక్క అసెంబ్లీ సీటు కూడా లేని పార్టీలు చాలా ఉన్నాయి. ఈ సమీకరణాలు ఎన్డీయే కు అతిపెద్ద మైనస్ పాయింట్ గా మారబోతున్నాయి. ‘ఇండియా’ కూటమిలో ఇమిడేందుకు విపక్ష పార్టీలు మొగ్గుచూపవని, బీజేపీ జాతీయ నాయకత్వం భావించినప్పటికీ పరిస్థితి తలకిందులైంది. పార్టీలన్నీ రాజీ మంత్రాన్ని, ఐక్యమత్య సూత్రాన్ని జపిస్తుండటం మోడీ అండ్ టీమ్ కు షాక్ ఇస్తోంది.

ఇండియా కూటమి తొలి విజయం..
తాజాగా శుక్రవారం ముంబై వేదికగా జరిగిన ఇండియా కూటమి సమావేశం కూడా సక్సెస్ అయిందనే చెప్పొచ్చు. సీట్ల సర్దుబాటు ఏకాభిప్రాయాన్ని సాధించడం ఆ కూటమి సాధించిన తొలి విజయం. ఇక 14 మంది నేతలతో సమన్వయ కమిటీని ప్రకటించడం అనేది కూటమిని నిర్మాణాత్మకంగా బలోపేతం చేసే దిశగా పడిన పెద్ద ముందడుగు.

సమయం వద్దు అంటున్న కింగ్ మేకర్..

మరోవైపు ఎన్డీయే కూటమిలో కింగ్ మేకర్ గా బీజేపీ మాత్రమే ఉంది. చరిష్మా కలిగిన లీడర్ గా ప్రధాని మోడీ ఒక్కరే ఉన్నారు. ఒక్క బీజేపీకే గణనీయంగా 300కు పైగా లోక్ సభ స్థానాలు ఉన్నాయి. ఆ కూటమిలోని మిగితా పార్టీలన్నీ కలిసి కనీసం 50 లోక్ సభ సీట్లను కూడా గెలవలేకపోయాయి. ఇంకా సమయం ఇస్తే ఇండియా కూటమి పూర్తిస్థాయిలో బలోపేతం అయ్యే అవకాశాలు ఉంటాయని భావిస్తున్న బీజేపీ సర్కారు.. సాధ్యమైనంత త్వరగా ఎన్నికలకు వెళ్లాలని ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగా రాబోయే ఐదు రాష్ట్రాల(తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరాం) అసెంబ్లీ పోల్స్ టైంలోనే సార్వత్రిక ఎన్నికలను నిర్వహించాలని యోచిస్తోంది. అందుకే ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’ బిల్లును సెప్టెంబరు 18 నుంచి 22 వరకు జరగనున్న స్పెషల్ పార్లమెంటు సెషన్ లో ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఇండియా కూటమి కూడా అందుకు సమాయత్తం అవుతోంది. ఓ వైపు సీట్ల సర్దుబాటు ప్రక్రియను నిర్వహిస్తూనే.. మరోవైపు దేశవ్యాప్తంగా ఉమ్మడి బహిరంగ సభలు, ర్యాలీలు, ప్రచార కార్యక్రమాలను నిర్వహించేందుకు రెడీ అవుతోంది. దక్షిణాదిలో ఇండియా కూటమికి లైన్ క్లియర్ గా ఉంది. అయోధ్య రామాలయం, నరేంద్ర మోడీ చరిష్మా, సరిహద్దు ఉద్రిక్తతల వల్ల ఉత్తరాదిలో బీజేపీకి అనుకూల పవనాలు వీచే అవకాశాలు ఉన్నాయి. వంటగ్యాస్ ధరల పెరుగుదల అంశం కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వాన్ని కూల్చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చింది. ఈనేపథ్యంలో తాజాగా వంట గ్యాస్ ధరలను కేంద్ర సర్కారు తగ్గించేసింది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మహిళా సంక్షేమ పథకాల కోసం, ఎస్సీ, ఎస్టీల సంక్షేమం కోసం కొత్తకొత్త స్కీమ్స్ ప్రకటిస్తున్నారు. ఈ ప్రకటనలన్నీ ఎన్నికల వేళ ప్రజలను మభ్యపెట్టేందుకు చేస్తున్నవే అని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇండియా కూటమి పార్టీల నుంచి పోటీ పెరిగిన రీత్యా ప్రజలను ఆకట్టుకునేందుకు సంక్షేమ పథకాలు మినహా మరో మార్గం బీజేపీకి కనిపించడం లేదని అంటున్నారు.

జేడీఎస్, టీడీపీ, శిరోమణి అకాళీదళ్ సహా వివిధ పార్టీలు మళ్లీ బీజేపీ వైపు చూస్తున్నప్పటికీ.. ఈ పార్టీలు ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రాల్లో ఇండియా కూటమికి అనుకూలంగా ఉండే రాజకీయ పక్షాలు జోరు మీద ఉన్నాయి. జేడీఎస్, టీడీపీ, శిరోమణి అకాళీదళ్ పార్టీలు బీజేపీతో చేతులు కలిపితే..వాటి ప్రత్యర్ధి పార్టీలు ఇండియా కూటమి వైపు చూసే అవకాశాలు ఉంటాయి. మరోవైపు 4 రాష్ట్రాల్లో అకస్మాత్తుగా రాష్ట్ర పార్టీ అధ్యక్షులను మార్చేయడం బీజేపీకి మైనస్ పాయింట్ గా మారే ఛాన్స్ ఉంది. కొత్తవారికి పార్టీ సమీకరణాలపై, స్థానిక నాయకుల బలాబలాలపై అవగాహన కుదిరే సరికే ఎన్నికల సమయం గడిచిపోయే అవకాశం ఉంది.