Ma Nammakam Nuvve Jagan: ఇదేం క్యాంపెయిన్ జగనూ..? విడ్డూరంగా లేదూ..?

మా నమ్మకం నువ్వే జగన్ అనే క్యాంపెయిన్ సూపర్ సక్సెస్ అని ఐప్యాక్ టీం బీభత్సంగా ప్రచారం చేసుకుంటోంది. రెండు రోజుల్లోని 15 లక్షలకు పైగా ఇళ్లకు స్టిక్కర్లు అతికించినట్లు చెప్తోంది. వాస్తవాలు చెప్పకుండా ఇలాంటి తప్పుడు నివేదికలు ఇవ్వడం వల్లే ఇటీవల వైసీపీ గ్రాఫ్ దిగజారుతోంది.

  • Written By:
  • Publish Date - April 11, 2023 / 12:59 PM IST

నాయకులపై ఆదరాభిమానాలు ఒక్కరోజులో రావు. అందుకు కొన్నేళ్లు పడుతుంది. వాళ్లు చేసే కార్యక్రమాలు, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం, ప్రజలకు చేసే మంచి పనులు.. లాంటివన్నీ ఒక నేత భవిష్యత్తును నిర్దేశిస్తాయి. మంచి పనులు చేస్తే పది కాలాలపాటు జనం గుర్తు పెట్టుకుంటారు. లేకుంటే తర్వాత ఎన్నికల్లోనే ఇంటికి పంపించేస్తారు. ఒక నేతను వెనకేసుకు రావడానికి ఇవే కొలమానాలు. మంచి నేతకు ప్రచారం అక్కర్లేదు. తన వెంట నడవాలనే పిలుపు అవసరం లేదు. నేత పిలవకపోయినా వెంట ప్రజలే పరుగులు తీస్తారు.

కానీ ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి ఇందుకు విరుద్ధంగా సాగుతోంది. మీరంతా నా జపమే చేయాలంటూ ఓ నేత తన మందీమార్బలాన్ని ఇంటింటికీ పంపిస్తున్నారు. తన నామస్మరణ చేయాలని ఆదేశిస్తున్నారు. నేతలతో పాటు ప్రజలంతా తనపైనే నమ్మకం పెట్టుకోవాలని చెప్తున్నారు. ఆయనే వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మా నమ్మకం నువ్వే జగన్ అనే పేరుతో క్యాంపెయిన్ ప్రారంభించింది వైసీపీ. అంటే తనమీదే జనం నమ్మకం అని తానే ప్రచారం చేసుకోవడమన్నమాట. ఇది జనం నుంచి రావాల్సిన స్లోగన్. అలా కాకుండా తానే తనకు అనుకూలంగా ఓ స్లోగన్ డిజైన్ చేసి జనం దగ్గరికి తీసుకెళ్లడం ఏదైతే ఉందో అది నభూతో నభవిష్యత్.

మా నమ్మకం నువ్వే జగన్ అని స్టిక్కర్లు పెట్టుకుని ఇంటింటికీ వెళ్తున్న నేతలకు కొన్నిచోట్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆ స్టిక్కర్లను తమ ఇంటికి అతికించడాన్ని కొందరు వ్యతిరేకిస్తున్నారు. జగన్ పైనే మా నమ్మకం అని చెప్పేందుకు ససేమిరా అంటున్నారు. అలా చెప్పాలని తమను బలవంతం చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. దీంతో వైసీపీ నేతలు ఖంగు తింటున్నారు. ప్రజలకు మేలు జరిగితే వాళ్లు ఓటు వేస్తారు. ఆదరిస్తారు. ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ది పొందినంత మాత్రాన ఆ నేతే తమకు దిక్కు అని చెప్పాల్సిన అవసరం ఏంటనేది జనం ప్రశ్న.

మా నమ్మకం నువ్వే జగన్ అనే క్యాంపెయిన్ సూపర్ సక్సెస్ అని ఐప్యాక్ టీం బీభత్సంగా ప్రచారం చేసుకుంటోంది. రెండు రోజుల్లోని 15 లక్షలకు పైగా ఇళ్లకు స్టిక్కర్లు అతికించినట్లు చెప్తోంది. వాస్తవాలు చెప్పకుండా ఇలాంటి తప్పుడు నివేదికలు ఇవ్వడం వల్లే ఇటీవల వైసీపీ గ్రాఫ్ దిగజారుతోంది. మా నమ్మకం నువ్వే జగన్ అనే క్యాంపెయిన్ పేరుపైనే అనేక విమర్శలు వస్తున్నాయి. జనం నుంచి రావాల్సిన నినాదాన్ని పార్టీనే సృష్టించి దాన్ని జనంపైన రుద్దడం విడ్డూరంగా ఉంది.