Nara Lokesh: ప్రజా సంక్షేమం గురించే చంద్రబాబు ఆలోచిస్తారని, అవినీతి ఆయన రక్తంలోనే లేదన్నారు నారా లోకేశ్. పాముకు తలలోనే విషం ఉంటే.. జగన్‌కు ఒళ్లంతా విషమే ఉంటుందని వ్యాఖ్యానించారు. రాజమండ్రిలో సోమవారం సాయంత్రం నారా లోకేశ్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వైసీపీ, జగన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. “ప్రతిక్షణం అభివృద్ధి గురించి ఆలోచించే వ్యక్తి చంద్రబాబు. బంద్‌ను విజయవంతం చేసిన కార్యకర్తలకు, మద్దతు తెలిపిన పార్టీలకు ధన్యవాదాలు. కోడి కత్తి కేసులో ఎంత అబద్ధం ఉందో.. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో కూడా అంతే అబద్ధం.
చంద్రబాబుపై అవినీతి మరక వేసే ప్రయత్నం చేస్తున్నారు. అవినీతి అనేది చంద్రబాబు రక్తంలోనే లేదు. దేశ రాజకీయాల్లో గుర్తింపు పొందిన వ్యక్తి ఆయన. బాబాయ్ హత్య కేసులో అవినాష్‌రెడ్డిని అరెస్ట్ చేయడానికి వస్తే.. కర్నూలులో పోలీసులను అడ్డుపెట్టి సైకో జగన్ అడ్డుకున్నాడు. జగన్ దృష్టిలో అధికారం అంటే కక్ష సాధింపులు. స్కిల్ డెవలప్‌మెంట్‌లో 42 సెంటర్లు ప్రారంభించి 2.13 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాం. స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టుకు అనుమతించింది అజయ్‌కల్లంరెడ్డి. కానీ వారిపై కేసులు పెట్టలేదు. వైసీపీ ప్రభుత్వం గత 2 ఏళ్లలో ఒక్క ఛార్జిషీట్ వేయలేకపోయింది. చంద్రబాబుకు డబ్బు ఎక్కడ నుంచి వచ్చిందో నిరూపించగలరా..? జగన్‌కు అధికారం అంటే ఏమిటో తెలియదు. చంద్రబాబు డబ్బులు తీసుకున్నట్లు ఎక్కాడా నిరూపితం కాలేదు. తప్పు జరగలేదు కాబట్టే నిరూపించలేకపోయారు. విపక్షాలపై జగన్ దొంగ కేసులు పెట్టడమే పనిగా పెట్టుకున్నారు. జగన్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. నా పోరాటం ఆగదు. ఎన్ని కేసులైనా పెట్టుకోండి.
నేను రాజమండ్రిలోనే ఉన్నా. ఎక్కడికీ పారిపోలేదు. నన్ను అరెస్టు చేయాలనుకుంటే వచ్చి చేసుకోండి. నేను వదిలి పెట్టను. ప్రజల్లోకి వెళ్తా. నేను ఈ ప్రభుత్వాన్ని వెంటాడతాను. పాముకు తలలోనే విషం ఉంటుంది. జగన్‌కు ఒళ్లంతా విషమే. నేను అన్నగా భావించే పవన్ కల్యాణ్ నాకు అండగా నిలబడతారు. నాకున్న కార్యకర్తలు, నాయకులు నాకు అండగా నిలబడతారు. జగన్‌పై 10 సీబీఐ, 7 ఈడీ కేసులు, 21 ఇతర కేసులున్నాయి. జగన్‌పై కేసులు పదేళ్లుగా ట్రయల్‌కు కూడా రావడం లేదు. వ్యవస్థలను ఎంతగా మేనేజ్ చేస్తున్నారో అర్థం అవుతోంది. దేశంలోనే కాదు.. ప్రపంచంలోనే అందరికీ తెలిసిన వ్యక్తి చంద్రబాబు. చంద్రబాబు అంటే ఓ బ్రాండ్ అని బిల్‌గేట్స్, క్లింటన్, ఫార్చూన్ సీఈవోలూ చెబుతారు. అలాంటి వ్యక్తిపై దొంగకేసు పెట్టి జైలుకు పంపింది సైకో జగన్ ప్రభుత్వం. పోలీసులకు చెడ్డ పేరు వచ్చేలా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. శాంతియుతంగా నిరసనలు చేస్తుంటే అడ్డుకుంటారా..? పోలీసులు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మా న్యాయ పోరాటం కొనసాగుతుంది” అని నారా లోకేశ్ వ్యాఖ్యానించారు.