Telangana BJP: బీజేపీలో కోవర్టులు.. ఇంతకీ వాళ్లెవరు..? కాంగ్రెస్‌లా తయారవుతున్న బీజేపీ!

కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ భారీగా పడిపోయింది. ఒకవేళ అక్కడ పార్టీ గెలిచుంటే పరిస్థితి వేరేలా ఉండేదేమో. కానీ, ఓడిపోవడంతో పార్టీ ఇమేజ్ దెబ్బతింది. పార్టీ శ్రేణులు నిరాశలో కూరుకుపోయాయి. దీంతో ఇప్పుడు తమ రాజకీయ భవిష్యత్ ఏంటా అని బీజేపీ నేతలు ఆలోచిస్తున్నారు.

  • Written By:
  • Publish Date - June 7, 2023 / 03:12 PM IST

Telangana BJP: నిన్నామొన్నటి వరకు ఒకరినొకరు తిట్టుకున్న తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఇప్పుడిప్పుడే చల్లబడుతున్నారు. పార్టీకి పెరుగుతున్న గ్రాఫ్ చూసో.. పక్క పార్టీలకు పోయే అవకాశం లేకో.. కలిసి పని చేసేందుకు డిసైడయ్యారు. దీంతో కాంగ్రెస్‌లో గొడవలు సద్దుమణిగినట్లే కనిపిస్తోంది. ఇదే సమయంలో బీజేపీ పరిస్థితి దిగజారుతోంది. అసలే పార్టీకి ప్రజల్లో ఆదరణ తగ్గుతూ వస్తోంటే.. నేతల మధ్య అంతర్గత విబేధాలు మరింత ఇబ్బంది పెడుతున్నాయి. దీంతో బీజేపీ కూడా మరో కాంగ్రెస్‌లా తయారవుతోందా అనే వాదన మొదలైంది.
కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ భారీగా పడిపోయింది. ఒకవేళ అక్కడ పార్టీ గెలిచుంటే పరిస్థితి వేరేలా ఉండేదేమో. కానీ, ఓడిపోవడంతో పార్టీ ఇమేజ్ దెబ్బతింది. పార్టీ శ్రేణులు నిరాశలో కూరుకుపోయాయి. నాయకులకూ పార్టీపై నమ్మకం సన్నగిల్లింది. దీంతో ఇప్పుడు తమ రాజకీయ భవిష్యత్ ఏంటా అని బీజేపీ నేతలు ఆలోచిస్తున్నారు. బీజేపీ సిద్ధాంతాలతో పని లేకుండా ఆ పార్టీలో చేరిన వాళ్లు పక్క పార్టీలవైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఈటల రాజేందర్, ఏలేటి మహేశ్వర్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ వంటి నేతలు కాంగ్రెస్‌లో చేరే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో పార్టీలో ఎప్పటి నుంచో ఉంటున్న నేతల మధ్య కూడా బేధాభిప్రాయాలు పెరిగిపోతున్నాయి. ఒకరినొకరు నిందించుకుంటున్నారు. దీంతో పార్టీలో అంతర్గత కలహాలు క్రమంగా బయటపడుతున్నాయి. పైగా పార్టీలో కోవర్టులు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ముఖ్యంగా సీఎం కేసీఆర్ కోసం కొందరు పనిచేస్తున్నారన్న వాదన తెరపైకి వచ్చింది. పార్టీలో ఉన్న వాళ్ల పరిస్థితే ఇలా ఉంటే.. త్వరలో బీజేపీలో చేరుదామని అనుకుంటున్న వాళ్లైతే ఆ పార్టీవైపే కన్నెత్తి చూడటం లేదు.
బీజేపీలో కోవర్టులు..!
ఇప్పుడు బీజేపీని కలవరపెడుతున్న మరో అంశం కోవర్టులు. బీజేపీలో కొందరు కోవర్టులు ఉన్నారని, సీఎం కేసీఆర్ కోసం పని చేస్తున్నారని ఎప్పటినుంచో అనుమానాలు ఉన్నాయి. తాజాగా బీజేపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ ఇదే ఆరోపణ చేశాడు. బీజేపీలో సీఎం కేసీఆర్ కోవర్టులు ఉన్నారని, పార్టీలో జరిగే అంతర్గత విషయాలు ఎప్పటికప్పుడు కేసీఆర్‌కు చేరవేస్తుంటారని ఆయన ఆరోపించారు. బీజేపీలో ఉంటూ, కేసీఆర్ నమ్మినబంటుగా.. ఆయన కోసం పనిచేస్తున్నారని, బీజేపీకి అన్యాయం చేస్తున్నారని నందీశ్వర్ గౌడ్ మండిపడ్డారు. కోవర్టుల వివరాలను అధిష్టానానికి అందించినట్లు, వారిపై పార్టీకి ఫిర్యాదు చేసినట్లు ఆయన చెప్పారు. త్వరలో మీడియా సమక్షంలో వాళ్ల పేర్లు బయటపెడతానని హెచ్చరించారు. ముఖ్యంగా బీజేపీకి చెందిన నలుగురు నేతలు గందరగోళ ప్రకటనలతో పార్టీ ఇమేజ్ దెబ్బతీస్తున్నారని ఆయన అన్నారు. అయితే, ఆ కోవర్టులు ఎవరూ అనే పార్టీ శ్రేణుల్లో
విజయశాంతి పార్టీ మారుతారా?
బీజేపీ సీనియర్ నేత విజయశాంతి కొంతకాలంగా బండి సంజయ్‌పై ఆగ్రహంతో ఉన్నారు. ఆమె సేవల్ని పార్టీ వినియోగించుకోవడం లేదని, తనకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఆమె అసంతృప్తితో ఉన్నారు. దీంతో విజయశాంతి త్వరలో పార్టీ మారుతారనే ప్రచారం మొదలైంది. దీనిపై ఆమె స్పందించినప్పటికీ ఈ విషయాన్ని పూర్తిగా ఖండించలేదు. దీంతో ఆమె పార్టీ మారే ప్రయత్నాల్లో ఉన్నారని స్పష్టమవుతోంది. ఈటలకు, బండి సంజయ్‌కు మధ్య పొసగడం లేదు. దీంతో ఆయన కూడా పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉంది. ఇలా కీలక నేతలంతా వరుసగా పార్టీలు మారే ఆలోచన చేస్తుండటం బీజేపీకి ఇబ్బందిగా మారనుంది.


చేరికలు నిల్..!
గతంలో బీజేపీ ఇమేజ్ పెరిగిన సమయంలో పార్టీలోకి నేతలంతా క్యూ కడతారని భావించారు. ఎవరిని చేర్చుకోవాలి అనే అంశాల్ని పరిశీలించేందుకు ఏకంగా చేరికల కమిటీని ఏర్పాటు చేశారు. ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టి, ఇతర నేతల్ని రప్పించేందుకు ప్రయత్నించారు. కానీ, ఇది పెద్దగా ఫలితాన్నివ్వలేదు. వేళ్ల మీద లెక్కపెట్టగలిగే నేతలు మాత్రమే పార్టీలో చేరారు. ఇతర నేతల్ని చేర్చుకునేందుకు చేసిన ప్రయత్నాలు సత్ఫలితాలివ్వలేదు. దీంతో ఆకరేషన్ ఆకర్ష్ ఫెయిలైంది. ఇక ఇప్పుడైతే ఎవరూ పెద్దగా పార్టీలో చేరే అవకాశమే లేదు. పార్టీలో ఉన్న వాళ్లు పోకుండా ఉంటే అదే గొప్ప అన్నట్లు తయారైంది బీజేపీ పరిస్థితి.
మరో కాంగ్రెస్ అవుతుందా?
తెలంగాణలో కాంగ్రెస్ నేతల మధ్య ఉన్న విబేధాల గురించి చెప్పక్కర్లేదు. ఒకరిపై ఒకరు బహిరంగంగానే విమర్శించుకుంటారు. ఇప్పుడు ఇదే పరిస్థితి తెలంగాణ బీజేపీలో కనిపిస్తోంది. పార్టీ నేతలు విమర్శలు చేసుకుంటున్నారు. అంతర్గత కలహాలతో పార్టీని దెబ్బతీస్తున్నారు. పార్టీ హైకమాండ్ ఈ విషయంపై దృష్టిపెట్టి నేతల మధ్య విబేధాల్ని పరిష‌్కరించి, పార్టీని చక్కదిద్దాల్సిన బాధ్యత ఉంది. లేకుంటే మరో కాంగ్రెస్ కాక తప్పదు.