CPI-CPM: కేసీఆర్ తీరుపై కమ్యూనిస్టుల ఆగ్రహం.. ఇంతకీ వాళ్ల దారెటు..? కాంగ్రెస్‌తోనా..? సొంత బాటా..?

కేసీఆర్ 119 నియోజకవర్గాలకుగాను 115 స్థానాలకు అభ్యర్థుల్ని ఖరారు చేశారు. దీంతో కమ్యూనిస్టులతో పొత్తు లేదని తేలిపోయింది. ఇంతకాలం కేసీఆర్‌పై ఆశలు పెట్టుకున్న కమ్యూనిస్టులు కేసీఆర్ నిర్ణయంతో షాకయ్యారు. మంగళవారం సీపీఐ, సీపీఎంలకు చెందిన అగ్రనేతలు హైదరాబాద్‌లో సమావేశమయ్యారు.

  • Written By:
  • Publish Date - August 22, 2023 / 07:47 PM IST

CPI-CPM: మునుగోడు ఉప ఎన్నికలో తమతో పొత్తు పెట్టుకున్న సీఎం కేసీఆర్ తాజా అసెంబ్లీ ఎన్నికలపై కనీసం పరిగణనలోకి తీసుకోకపోవడంపై కమ్యూనిస్టులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ నిర్ణయం వల్ల తమకేం నష్టం లేదని, నష్టపోయేది కేసీఆరే అని వ్యాఖ్యానించారు. తెలంగాణలో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఎం, సీపీఐతో బీఆర్ఎస్ పొత్తు ఉంటుందని అంతా భావించారు. కమ్యూనిస్టులు కూడా ఇదే నమ్ముతూ వచ్చారు. అయితే, వారికి షాకిస్తూ.. కేసీఆర్ 119 నియోజకవర్గాలకుగాను 115 స్థానాలకు అభ్యర్థుల్ని ఖరారు చేశారు. దీంతో కమ్యూనిస్టులతో పొత్తు లేదని తేలిపోయింది.

ఇంతకాలం కేసీఆర్‌పై ఆశలు పెట్టుకున్న కమ్యూనిస్టులు కేసీఆర్ నిర్ణయంతో షాకయ్యారు. మంగళవారం సీపీఐ, సీపీఎంలకు చెందిన అగ్రనేతలు హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. సీపీఎం నేతలు తమ్మినేని వీరభద్రం, జూలకంటి రంగారెడ్డి, సీపీఐ నేతలు కూనంనేని సాంబశివరావు, చాడ వెంకట్ రెడ్డి సహా కీలక నేతలు హాజరయ్యారు. తమ రాజకీయ భవిష్యత్తుపై విడివిడిగా చర్చించారు. అనంతరం ఉమ్మడిగా కలిసి చర్చించారు. ఈ సందర్భంగా ఉమ్మడి ప్రకటన చేశారు. కేసీఆర్ తీరుపై విమర్శలు గుప్పించారు. కేసీఆర్ మిత్రధర్మం పాటించలేదన్నారు. కేసీఆర్‌కు బీజేపీతో మితృత్వం కుదిరిందని, అందుకే తమను విస్మరించారన్నారు. మునుగోడులో తమ మద్దతు లేకపోతే.. బీఆర్ఎస్ ఓడిపోయేదని, ఆ సమయంలో భవిష్యత్తులో కూడా కమ్యూనిస్టులతో కలిసి పనిచేస్తామని కేసీఆర్ చెప్పినట్లు కమ్యూనిస్టు నేతలు గుర్తు చేశారు. తము, కేసీఆర్‌కు మధ్య సీట్ల పంచాయితీ లేదని, రాజకీయ విధానాలతోనే సమస్య అన్నారు. ఈ విషయంపై కేసీఆర్ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో బీఆర్ఎస్‌‌ను ఓడించడమే తమ ధ్యేయమని చెప్పారు.
కలిసి పోటీ చేస్తారా..? కాంగ్రెస్‌తోనా..?
సిద్ధాంత రీత్యా కమ్యూనిస్టు పార్టీలు బీజేపీతో ఎట్టి పరిస్థితుల్లోనూ కలవవు. వారికి ప్రస్తుతం తెలంగాణలో ఉన్న ఏకైక ఆప్షన్ కాంగ్రెస్ మాత్రమే. అయితే, ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటారా..? సీట్లు సర్దుబాటు చేసుకుంటారా..? అనే విషయంలో స్పష్టత లేదు. ఇప్పటికైతే ఈ విషయంలో ఇటు కమ్యూనిస్టులు.. అంటు కాంగ్రెస్.. మౌనంగానే ఉంటున్నాయి. మరోవైపు సీపీఐ, సీపీఎం కలిసి పోటీ చేసేందుకు సిద్ధమయ్యాయి. తమకు బలమున్న చోట, ప్రజాతంత్ర పార్టీలతో కలిసి పోటీ చేస్తామని రెండు పార్టీలు సంయుక్తంగా ప్రకటించాయి. త్వరలోనే సీట్లపై నిర్ణయం తీసుకుంటామన్నారు. ఏ సీట్లలో పోటీ చేయాలో చర్చించి, తేలుస్తామని చెప్పారు.