Delimitation : దక్షిణాది రాష్ట్రాలకు ‘డీలిమిటేషన్’ దడ .. ఎందుకు ?

‘‘ప్రస్తుత ఎంపీ స్థానాలకు 1971 నాటి జనగణన ప్రాతిపదిక. ఆ లెక్క ప్రకారం తెలంగాణకు 17, ఆంధ్రప్రదేశ్‌కు 25 లోక్‌సభ స్థానాలున్నాయి. 2026 నాటికి ఈ రెండు రాష్ట్రాలలో జనాభా సంఖ్య ఇప్పుడున్న దానికన్నా భారీగా తగ్గుతుంది.

మహిళా రిజర్వేషన్ బిల్లుకు మన దేశ పార్లమెంటు ఆమోదం లభించ ను లభించింది. కానీ దానికి ఒక ముఖ్యమైన అంశంతో మోడీ సర్కారు లంకె పెట్టింది. అదే లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) !! ఈ ప్రక్రియ జరగడానికి ఇంకో మూడేళ్లు పట్టొచ్చని అంచనా వేస్తున్నారు. అంటే 2026లో.. లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ కొలిక్కి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ తరుణంలో లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజన టాపిక్ పై మన దేశంలోని దక్షిణాది రాష్ట్రాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తాజా జనాభా లెక్కల ప్రకారం.. నియోజకవర్గాల పునర్విభజన చేస్తే తమకు అన్యాయం జరుగుతుందని, లోక్ సభ సీట్లు ఇంకా తగ్గిపోతాయని ఆవేదనను వెలిబుచ్చుతున్నాయి.

దక్షిణాది డిసిప్లయిన్ కు పర్యవసానం.. సీట్ల కోతలా ?

కుటుంబ నియంత్రణ కార్యక్రమాలు దేశంలో ఎక్కడైనా సక్సెస్ ఫుల్ గా అమలవుతున్నాయి అంటే అది.. దక్షిణాది లో !! ఈ పర్యవసానంగా దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా బాగా తగ్గింది. మరోవైపు ఉత్తరాదిలో యూపీ, మధ్యప్రదేశ్, బీహార్ లలో జనాభా విస్ఫోటనం జరిగింది. అక్కడ కుటుంబ నియంత్రణ కార్యక్రమాల అమలు పెద్దగా సక్సెస్ కాలేదు. ఈ వైఫల్యమే ఆ రాష్ట్రాలకు అడ్వాంటేజ్ గా మారి.. జనాభా ఎక్కువగా ఉన్నందున ఎక్కువ లోక్ సభ స్థానాలు దక్కబోతున్నాయి. తక్కువ జనాభాను మెయింటైన్ చేస్తున్నందుకు పర్యవసానంగా.. లోక్ సభ సీట్ల కోతను దక్షిణాది రాష్ట్రాలు ఎదుర్కోబోతున్నాయి. అందుకే లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనపై సౌత్ స్టేట్స్ ఇంతగా ఆందోళన చెందుతున్నాయి.

తెలుగు రాష్ట్రాలకు 8 సీట్లు గల్లంతు ?

జనాభా ప్రాతిపదికగా దేశంలోని లోక్ సభ నియోజకవర్గాలను ఒకవేళ విభజిస్తే.. దక్షిణాది రాష్ట్రాలకు లోక్‌సభ సీట్ల సంఖ్య తగ్గే ముప్పు ఉందంటూ వాషింగ్టన్ కేంద్రంగా పనిచేసే కార్నేజ్ ఎండోమెంట్ అనే సంస్థ ఓ నివేదికను విడుదల చేసింది. ‘‘ప్రస్తుత ఎంపీ స్థానాలకు 1971 నాటి జనగణన ప్రాతిపదిక. ఆ లెక్క ప్రకారం తెలంగాణకు 17, ఆంధ్రప్రదేశ్‌కు 25 లోక్‌సభ స్థానాలున్నాయి. 2026 నాటికి ఈ రెండు రాష్ట్రాలలో జనాభా సంఖ్య ఇప్పుడున్న దానికన్నా భారీగా తగ్గుతుంది. దీంతో రెండు రాష్ట్రాలు కలిసి కనీసం ఏడెనిమిది స్థానాలు కోల్పోతాయి’’ అని ఈ సంస్థ అంచనా వేసింది.మొత్తం దక్షిణాది రాష్ట్రాలపై ఇదేవిధమైన ఎఫెక్ట్ పడుతుందని ఆందోళన వ్యక్తమవుతోంది. 2026 డీలిమిటేషన్ తర్వాత బీహార్, ఉత్తరప్రదేశ్‌లకు మొత్తం 222 లోక్ సభ స్థానాలు దక్కుతాయని అంచనా వేస్తున్నారు. నాలుగు దక్షిణ భారత రాష్ట్రాలకు లోక్‌సభలో 165 సీట్లే ఉంటాయని అంటున్నారు. 888 మంది పార్లమెంటు సభ్యులకు సరిపోయేలా.. ఎంతో ముందుచూపుతో కొత్త పార్లమెంటు భవనాన్ని నిర్మించారు. లోక్ సభలో ప్రస్తుతం 545 స్థానాలు ఉన్నాయి. 2026 నాటికి లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజనపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దేశంలోని ప్రస్తుత జనాభా ఆధారంగా లోక్ సభ నియోజక వర్గాలను విభజించే ఛాన్స్ ఉంది. ఏ లెక్కన చూసుకున్నా.. రానున్న కొన్నేళ్లలో దేశంలోని పార్లమెంటులో లోక్ సభ సభ్యుల సంఖ్య పెరగడం ఖాయమని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.