Devineni Uma: టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారా..? ప్రస్తుతం ఆయనతో కాంగ్రెస్ నేతలు చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. దేవినేని ఉమ.. టీడీపీలో సీనియర్ నేత. మంత్రిగానూ పని చేశారు. ఆయన తాజా ఎన్నికల్లో మైలవరం టిక్కెట్ ఆశించారు. కానీ, ఆ టిక్కెట్‌ను టీడీపీ.. వసంత కృష్ణ ప్రసాద్‌కు కేటాయించింది. ఆయన అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే. గత ఎన్నికల్లో మైలవరలో దేవినేని ఉమ (టీడీపీ)ని ఓడించి వసంత కృష్ణ ప్రసాద్ (వైసీపీ) ఎమ్మెల్యేగా గెలిచారు.
MLC KAVITHA JAIL: తిహార్ జైలుకు కవిత.. ఏప్రిల్ 1న బెయిల్‌పై నిర్ణయం
దేవినేని ఓడిపోయినప్పటికీ నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని ఉన్నారు. అధికార వైసీపతోపాటు, స్థానిక ఎమ్మెల్యే వసంతపై నిత్యం విమర్శలు చేస్తూ ఉండేవారు. ఛాన్స్ దొరికినప్పుడల్లా టీడీపీపై, చంద్రబాబుపై అభిమానాన్ని చాటుకున్నారు. జగన్ పాలనపై విమర్శలు గుప్పించారు. ఇలాంటి పరిస్థితుల్లో మైలవరం టిక్కెట్ తనకే వస్తుందని ఆశించారు. అయితే, ఇటీవల అనూహ్యంగా వసంత.. టీడీపీలో చేరిపోయారు. దీంతో టీడీపీ.. ఆ టిక్కెట్‌ను వసంతకే కేటాయించింది. దీనిపై దేవినేని ఆగ్రహంగా ఉన్నారు. తన రాజకీయ భవిష్యత్ ఏంటో తెలియని డైలమాలో ఉన్నారు దేవినేని. దీంతో ఈ అవకాశాన్ని వాడుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. వైఎస్ షర్మిల ఆధ్వర్యంలో ఇటీవల కాస్త దూకుడుగా వెళ్తున్న కాంగ్రెస్.. ఇతర పార్టీల్లో టిక్కెట్ దక్కని అసంతృప్త నేతలపై గురిపెట్టింది. ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేల్ని చేర్చుకుంది. ఇదే వరుసలో టీడీపీపై అసంతృప్తిగా ఉన్న దేవినేనిపై దృష్టి పెట్టింది.
ఆయనను కాంగ్రెస్‌లోకి రప్పించాలని ప్రయత్నిస్తోంది. షర్మిల ఆదేశాల మేరకు దేవినేనితో సన్నిహితంగా ఉండే ఒక కాంగ్రెస్ నాయకుడు.. ఆయనతో చర్చలు జరుపుతున్నారు. అవసరమైతే కృష్ణా జిల్లా కాంగ్రెస్ బాధ్యతలు ఆయనకు అప్పగించేందుకు కూడా కాంగ్రెస్ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే మైలవరం టిక్కెట్ కూడా ఆఫర్ చేసింది. మరి ఈ ప్రతిపాదనపై దేవినేని ఎలా స్పందిస్తారు..? ఆయన కాంగ్రెస్‌లో చేరుతారా.. లేదా.. అనేది కొద్ది రోజుల్లో తేలుతుంది.