Dharmapuri Arvind: బీజేపీ సీనియర్ నేత, నిజామాబాద్ ఎంపీకి పార్టీ రాష్ట్ర నాయకత్వం కీలక బాధ్యతలు అప్పగించనుంది. బీజేపీ సోషల్ మీడియా విభాగాన్ని నిర్వహించే బాధ్యతల్ని ధర్మపురి అర్వింద్‌కు అప్పగించేందుకు నాయకత్వం సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ మేరకు నూతన అధ్యక్షుడు కిషన్ రెడ్డి నుంచి ఆదేశాలు వెలువడే అవకాశం ఉంది.
బీజేపీలో సీనియర్ నాయకుడిగా ఉన్న అర్వింద్ కూడా గతంలో బండి సంజయ్‌పై అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం జరిగింది. అయితే, ఈ విషయాన్ని బాహాటంగా ప్రదర్శించింది చాలా తక్కువ. ఏదైతేనేం.. ప్రస్తుతం అధ్యక్ష బాధ్యతలు బండి నుంచి కిషన్ రెడ్డికి మారిపోయాయి. ఆయన కూడా కొత్త టీమ్‌ను ఎంపిక చేసుకుంటున్నారు. ఇప్పటికే ఈటలకు కీలక బాధ్యతల్ని అధిష్టానం అప్పగించింది. మరో ఇద్దరు నేతలు తమకు కూడా పార్టీ ప్రధాన బాధ్యతలు అప్పగిస్తుందా అని ఎదురు చూశారు. వారిలో ఒకరు రఘునందన్ రావు కాగా.. మరొకరు ధర్మపురి అర్వింద్.
తాజాగా అర్వింద్‌కు సోషల్ మీడియా బాధ్యతల్ని అప్పగించాలని కిషన్ రెడ్డి భావిస్తున్నట్లు సమాచారం. అర్వింద్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. ట్విట్టర్ ద్వారా కేటీఆర్, కేసీఆర్, కవిత సహా బీఆర్ఎస్‌పై ఘాటైన విమర్శలు చేస్తుంటారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను, పసుపు రైతుల సమస్యలను సోషల్ మీడియా ద్వారా అర్వింద్ ప్రజల్లోకి తీసుకెళ్లారు. సోషల్ మీడియాపై ఆయనకు అవగాహన ఉంది. అందుకే ఈ బాధ్యతల్ని అర్వింద్‌కు అప్పగించే ప్రయత్నం జరుగుతోంది. వీలైనంతవరకు అందరి సేవల్ని వినియోగించుకోవాలని పార్టీ భావిస్తోంది. ఈ బాధ్యతల వల్ల అర్వింద్ కూడా తన అసంతృప్తిని పక్కనబెట్టి పూర్తిస్థాయిలో పార్టీ కోసం పని చేస్తారని అధిష్టానం ఆలోచన. అలాగే సోషల్ మీడియా ద్వారా రాష్ట్రానికి కేంద్రం అందిస్తున్న సాయం, కేంద్ర పథకాల్ని కూడా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలనే ఆలోచనతో ఉంది.
కిషన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత బీజేపీ కాస్త నెమ్మదించినట్లు కనిపించినా.. తిరిగి దూకుడుగా వెళ్లేందుకు సిద్ధమవుతోంది. వంద రోజుల ప్లాన్ అమలు చేస్తోంది. రాబోయే వంద రోజులు వరుసగా ఏదో ఒక కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి వెళ్లాలని ప్రణాళికలు రెడీ చేసింది. దీనికి సోషల్ మీడియాను, మీడియాను విస్తృతంగా వాడుకునేందుకు సిద్దమైంది. ఇప్పటికే టీవీల్లో, యూట్యూబ్‌లో బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా బీజేపీ ప్రకటనలు రూపొందించి ప్రసారం చేస్తోంది. గతంలో చేపట్టిన సాలు దొర-సెలవు దొర ప్రచారాన్ని మరింత ఉధృతంగా చేపట్టాలని నిర్ణయించింది. కేసీఆర్ మాట తప్పిన హామీలను ప్రజల్లోకి తీసుకెళ్తోంది. త్వరలోనే పార్టీ తరఫున పెద్ద ఎత్తున కార్యక్రమాలకు బీజేపీ సిద్ధమవుతోంది.