హర్యానాలో కాంగ్రెస్ ను ఓడించిన కాంగ్రెస్

హర్యానాలో కాంగ్రెస్‌ను కాంగ్రెస్సే ఓడించిందా...? చేతికి అంది వచ్చిన అవకాశాన్ని హస్తం ఎందుకు చేజార్చుకుంది...? అతివిశ్వాసమే కాంగ్రెస్‌ను ముంచిందా...? కాంగ్రెస్ నేతల తీరు ఇలాగే ఉంటే రాహుల్‌ ప్రధాని కావాలన్న ఆశ ఆకాంక్ష ఫలిస్తుందా...? ఇలాగైతే బీజేపీని ఎదుర్కోవడం కాంగ్రెస్ వల్లవుతుందా....?

  • Written By:
  • Publish Date - October 10, 2024 / 10:07 AM IST

హర్యానాలో కాంగ్రెస్‌ను కాంగ్రెస్సే ఓడించిందా…? చేతికి అంది వచ్చిన అవకాశాన్ని హస్తం ఎందుకు చేజార్చుకుంది…? అతివిశ్వాసమే కాంగ్రెస్‌ను ముంచిందా…? కాంగ్రెస్ నేతల తీరు ఇలాగే ఉంటే రాహుల్‌ ప్రధాని కావాలన్న ఆశ ఆకాంక్ష ఫలిస్తుందా…? ఇలాగైతే బీజేపీని ఎదుర్కోవడం కాంగ్రెస్ వల్లవుతుందా….?

ఓ రాజకీయ పార్టీ ఎలా వ్యవహరించకూడదో అలా వ్యవహరించింది కాంగ్రెస్. వందేళ్లకు పైబడిన చరిత్ర కలిగిన కాంగ్రెస్‌ చేజేతులా హర్యానాలో అధికారం చేజార్చుకుంది. హర్యానా ఫలితాలు కాంగ్రెస్‌కు గట్టి షాకే ఇచ్చాయి. అధికారం గ్యారెంటీ అని భావించిన చోట బొక్కబోర్లా పడటం మింగుడు పడటం లేదు. ఏ ఎగ్జిట్‌పోల్‌ కూడా బీజేపీ విజయాన్ని ఊహించలేదు. అందరు సెఫాలజిస్టులు కాంగ్రెస్‌ గెలుపు ఖాయమని జోస్యాలు చెప్పారు. బీజేపీకి అధికారం దరిదాపుల్లోకి కూడా రాదని కుండబద్దలు కొట్టారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీజేపీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని లెక్కగట్టారు అంతా. ఎన్నికలకు చాలారోజుల ముందు నుంచే కాంగ్రెస్ గెలుపు ఖాయమైందని లెక్కలేశారు. ఇప్పుడు ఈ ఫలితాలు చూసి ఎక్కడ తప్పు జరిగిందో అర్థంకాక తలపట్టుకుంటున్నారు. కాంగ్రెస్‌ రొటీన్‌గానే ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేస్తోంది.

కాంగ్రెస్‌ ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా హర్యానాలో ఓటమి హస్తం స్వయంకృతాపరాథమే. కాంగ్రెస్‌ అతివిశ్వాసమే ఆ పార్టీని నిలువునా యమునలో ముంచింది. గెలుపు ధీమాతో కాంగ్రెస్‌తో కుందేలులా నిద్రపోతే బీజేపీ మాత్రం తాబేలులా రేసు ముగించింది. హర్యానాలో బీజేపీపై వ్యతిరేకత బలంగా ఉంది. అగ్నివీర్‌పై యువత వ్యతిరేకత, రెజర్ల విషయంలో కేంద్ర కఠిన వైఖరి ఆ పార్టీకి మైనస్‌గా మారిపోయాయి. రైతు ఉద్యమం కూడా ఆ పార్టీని కంగారుపెట్టింది. కానీ బీజేపీ మైనస్‌లను కాంగ్రెస్ ప్లస్‌గా మార్చుకోలేకపోయింది. ప్రజలు తమంత తామే ఓట్లేస్తారన్నట్లు పోల్‌ మేనేజ్‌మెంట్‌పై ఫోకస్ పెట్టలేదు. సీట్ల పంపిణీలో కూడా గెలుపోటముల్ని పరిగణలోకి తీసుకోలేదు. హుడా వర్గం, సూర్జేవాలా, షెల్జా ఎవరి వర్గాలకు వారు టికెట్లు ఇప్పించుకున్నారు తప్ప గెలుపు గుర్రాలపై ఫోకస్ పెట్టలేదు. బీజేపీ మాత్రం చాలామందిని మార్చింది. ఇక ఎన్నికలు కూడా కాకముందే కాంగ్రెస్‌ నేతలు సీఎం సీటుపై కర్చీఫ్ వేసి కన్ఫ్యూజన్ క్రియేట్ చేశారు.

కాంగ్రెస్ అసలు ఎన్నికల వ్యూహాలపై ఫోకస్ పెట్టలేదు. కానీ బీజేపీ తెలివిగా కాంగ్రెస్ కొంపముంచింది. ఎన్నికల వ్యూహాన్ని ఎంత పకడ్బందీగా అమలు చేసిందంటే… అసాధ్యమనుకున్న గెలుపు కాంగ్రెస్ చేయిజారి కమలానికి చిక్కింది. జాట్లను కాంగ్రెస్ తనవైపు తిప్పుకుంది. దీంతో బీజేపీ జాట్‌షాహీ అంటే జాట్ల ఆధిపత్యం అనే పదాన్ని బాగా జనంలోకి తీసుకెళ్లింది. దీంతో జాట్‌ఏతర వర్గాలన్నీ ఏకమయ్యాయి. ఇది బీజేపీకి కలిసి వచ్చింది. ఇక కాంగ్రెస్ జాట్ అభ్యర్థుల్ని నిలబెట్టిన చోట బీజేపీ అదే వర్గానికి చెందిన పలువురిని ఇండిపెండెంట్లుగా రేసులోకి దించింది. దీంతో ఓట్లు చీలిపోయి కాంగ్రెస్‌ను ముంచేశాయి. చాలాచోట్ల బీజేపీ అభ్యర్థుల మెజారిటీ తక్కువగా ఉండటం దీనికి కారణం. దీంతో పాటు కాంగ్రెస్‌ను ఆప్ ముంచింది. కాంగ్రెస్‌కు, బీజేపీకి మధ్య ఓట్లు కేవలం ఒకశాతం కంటే తక్కువే. ఆప్‌ ఏకంగా 1.8శాతం ఓట్లు సాధించింది. అంటే ప్రతిపక్షాల ఓట్లు చీలిపోయాయి. అదే ఆప్‌తో పొత్తుపెట్టుకుని ఉంటే కాంగ్రెస్‌ ఖచ్చితంగా విజయం సాధించేదే… అసలు ఆప్‌ కాంగ్రెస్‌తో కలవకుండా కమలం కూడా వ్యూహాత్మకంగా వ్యవహరించింది. కేజ్రీవాల్‌కు బెయిల్‌ వచ్చేలా చేసి కాంగ్రెస్‌ కొంపముంచింది కమలం.

ఓ రాజకీయ పార్టీ ఎలా వ్యవహరించకూడదో హర్యానాలో కాంగ్రెస్ అలా వ్యవహరించింది. ప్రభుత్వంపై వ్యతిరేకతే ప్రతిపక్షాలకు ఓట్లు కురిపిస్తుందనుకుంటే అది భ్రమే. ఎదుటివారి బలహీనతపై గెలవాలనుకుంది తప్ప సొంతబలంతో విజయం సాధించాలని అనుకోలేదు. తన బలానికి ఎదుటువారి బలహీనత తోడవ్వాలన్న సూత్రాన్ని మర్చిపోయింది. ప్రజలు బీజేపీపై వ్యతిరేకతతో తనకు ఓటేయాలని అనుకుంటే ఎలా…? బీజేపీకి ప్రత్యామ్నాయం తామే అని చెబుతోంది కాంగ్రెస్. ఈసారి ఎన్నికల్లో గెలిచేది మేమే అని ఓడిన ప్రతిసారీ చెప్పుకుంటూ పోతోంది. రాష్ట్రాల్లో గెలవకపోతే దేశాన్ని ఎలా గెలుస్తారో కాంగ్రెస్ నేతలకైనా అర్థమవుతుందో లేదో అర్థం కావడం లేదు. దేశంలో బీజేపీ ప్రభ తగ్గుతోందని స్పష్టంగా అర్థమవుతోంది. మరి దాన్ని కాంగ్రెస్ క్యాష్ చేసుకోలేకపోతే రాహుల్ ను ప్రధాని పీఠంపై కూర్చోపెట్టగలదా…? స్వీయ తప్పిదాలతో బీజేపీని గెలిపిస్తూ పోతే ఎలా…? పరిస్థితి ఇలాగే ఉంటే మోడీని నాలుగోసారి కూడా కాంగ్రెస్సే గెలిపించదా…? ఇప్పటికైనా కాంగ్రెస్ ఆత్మవిమర్శ చేసుకుంటందా లేక ఎప్పట్లానే దులిపేసుకుని మరో ఎన్నికల్లో ఓటమి కోసం ఎదురు చూస్తుందా…? రేపు మహారాష్ట్రలోనూ గెలిచే అవకాశాల్ని ఇలాగే చేతులారా వృథా చేసుకుంటుందా…?