ఈ రాహుల్‌కు ఏమైంది…?
ఈ నగరానికి ఏమైంది అన్న యాడ్ గుర్తుకు వస్తుందా…? రాహుల్‌గాంధీ వ్యవహరిస్తున్న తీరు చూస్తే పక్కాగా ఇదే అనుమానం వస్తుంది. ఆయన ఎందుకు ఇలా చేస్తున్నారోనని భూతద్దం పెట్టి వెతికినా ఆన్సర్ దొరకదేమో…!
రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్లారు. కేంబ్రిడ్జిలో ప్రసంగించారు. అందులో తప్పేం లేదు. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఓ జాతీయపార్టీ ముఖ్యనేతగా ఆయన అక్కడ ప్రసంగించడం చాలా గర్వించాల్సిన విషయం. కానీ దేశం కాని దేశంలో…అదీ వందల ఏళ్లు మనల్ని వంచించి, విభజించి పాలించిన దేశంలో మన దేశ పరువు తీయడం మాత్రం ఇబ్బందికరంగా అనిపిస్తోంది.
కాంగ్రెస్, బీజేపీల మధ్య రాజకీయవైరం ఉంది. కానీ ఆ వైరాన్ని విదేశీ గడ్డపై రాహుల్ ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చిందన్నది అర్థం కాని ప్రశ్న. దేశంలో ప్రజాస్వామ్యానికి ముప్పు ఏర్పడిందని అమెరికా, యూరోప్‌లు జోక్యం చేసుకోవాలన్నట్లు రాహుల్ మాట్లాడారు. భారత పార్లమెంట్‌లోని లోక్‌సభలో మైకులు పనిచేస్తాయి కానీ తరచుగా మొరాయిస్తాయని ఆయన వ్యాఖ్యానించారు. దానర్థం మైకులు పనిచేయవని కాదు… తమ పార్టీకి మాట్లాడటానికి అవకాశం ఇవ్వడం లేదన్నది ఆయన ఆక్రోశం. అలాగే చైనా సైన్యం భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చినా తనకు ప్రశ్నించే అవకాశం ఇవ్వలేదన్నారు. రాహుల్ మాటలను చూస్తే మన దేశంలో అసలు ప్రజాస్వామ్యమే లేదన్నట్లు చెప్పకనే చెప్పినట్లైంది.
అధికార, విపక్షాల మధ్య సహజంగా జరిగే పరిణామాలను ఏదో జరిగిపోతోందన్నట్లు రాహుల్ ఎక్కడో మాట్లాడటమేంటి…? మనలో మనకే సఖ్యత లేదని చాటి చెప్పడమేంటి…? చైనా గురించి మాట్లాడటానికి అవకాశం ఇవ్వలేదని చెప్పడం ద్వారా దేశ భద్రత విషయంలోనూ రెండు పార్టీల మధ్య ఏకాభిప్రాయం లేదని చెప్పకనే చెప్పారా…? దేశం కంటే రాజకీయమే ముఖ్యమని చెప్పదలుచుకున్నారా….? చైనా బెదిరింపులు విదేశాంగ మంత్రికి అర్థం కాలేదన్న రాహుల్ మాటలకు అర్థమేంటో ఆయనే చెప్పాలి. రాహుల్‌కు నిజంగా ఆ అంశంపై బాధ ఉంటే దాన్ని మన గడ్డపైనే వెళ్లగక్కొచ్చు కదా…? పరాయి గడ్డపై చేస్తే వారేం చేస్తారు…?
రాహుల్ ఇప్పుడు మాట్లాడిన బ్రిటన్ కానీ, ప్రజాస్వామ్య పరిరక్షణకు జోక్యం చేసుకోవాలన్న అమెరికా కానీ మనకంటే పెద్ద ప్రజాస్వామ్య దేశాలా…? పోనీ ఈ దేశాలకు చెందిన ప్రతిపక్ష నేతలెవరైనా వస్తే తమవారి గురించి నెగెటివ్‌గా మాట్లాడతారా…? పోనీ మాట్లాడినా ఈ స్థాయిలో దేశం పరువు తీస్తారా…? అధికార బీజేపీ తనకు అవకాశం ఇవ్వడం లేదని రాహుల్ బాధపడొచ్చు. బీజేపీ చేస్తోంది తప్పే కావచ్చు. కానీ దాన్ని పరాయిగడ్డపై ప్రస్తావించాల్సిన పనిలేదు కదా..? మన ఇంట్లో మనకు, మనకు ఎన్ని ఉన్నా బయట అంతా ఒకటిగా కనిపించాలి కదా…?
రాహుల్ భారత్ జోడో యాత్ర పేరుతో దేశమంతా తిరిగారు. పలుచోట్ల సభలు, సమావేశాలు నిర్వహించారు. తాను చెప్పదలుచుకున్నది చెప్పారు. జనం వాటిని నమ్మాలి. మన జనానికి కాకుండా బయటివారికి చెప్పాల్సిన పనిలేదు కదా…! జనం నిజమని నమ్మితే ఓట్లేస్తారు… దేశాన్ని సుదీర్ఘకాలం పాలించిన కాంగ్రెస్‌నే పక్కన పెట్టేశారు. అలాంటిది తమకు నచ్చపోతే బీజేపీని పక్కకు నెట్టరా…? జనం మెచ్చకపోతే మోడీ అయినా ఇంకొకరైనా ఇంటికి వెళ్లాల్సిందే. మన జనం దగ్గర మార్కులు వేయించుకోవాల్సిన రాహుల్… పరాయిగడ్డపై బీజేపీకి నెగెటివ్ మార్కులు వేయించాలని చూసి తానే నెగెటివ్ అయిపోతున్నారేమో ఓసారి ఆలోచిస్తే మంచిది.
(KK)