Adipurush vs modi: మరో వంద జన్మలేత్తినా రాముడిలా ఎవరూ పాలించలేరు! తమ్ముళ్లూ.. రాముడితో ఆయనను పోల్చకండి ప్లీజ్!

తెలంగాణ బీజేపీ ట్విట్టర్‌ ఓ వీడియోను రిలీజ్ చేసింది. దాని ప్రకారం సీఎం కేసీఆర్ రావణుడు.. మోదీ ఏమో రాముడు.. హైదరాబాద్‌లో అమిత్‌ షా టూర్‌ వేళ ఈ వీడియోని సోషల్‌ మీడియాలో పోస్ట్ చేసింది. ఇది అసలుసిసలైన హిందువులకు, రాముడి భక్తులకు కాస్త అతిగా అనిపించింది.

  • Written By:
  • Publish Date - June 14, 2023 / 12:18 PM IST

Adipurush vs modi: రాముడు దేవుడు. అయితే దేవుడిని కూడా తమ రాజకీయాల కోసం వాడుకునే ప్రబుద్ధులు ఉన్నారు..! వాళ్లనే మనం బీజేపీ నేతలని అంటుంటాం.! నిజమైన భక్తులు తామేనంటూ చెప్పుకునే బీజేపీ లీడర్లు నిజంగా రాముడి మార్గంలో ప్రయాణిస్తున్నారా..?
ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్’ సినిమాకు బీజేపీ ఎక్కడలేని ప్రచారం కల్పిస్తోంది. ‘ఆదిపురుష్’ థియేటర్లను కాషాయమయం చేసెయ్యడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయంటే, బీజేపీ ఈ సినిమాని ఎలా ట్రీట్ చేస్తోందో అర్థం చేసుకోవచ్చు. బీజేపీ వీరాభిమానులు కొందరు ఆదిపురుష్ సినిమా టికెట్లను రూ.10వేలు చొప్పున కొనేసి పేదలకు పంచుతున్నామని ప్రకటిస్తున్నారు. పనిలో పనిగా తెలంగాణ బీజేపీ ట్విట్టర్‌ ఓ వీడియోను రిలీజ్ చేసింది. దాని ప్రకారం సీఎం కేసీఆర్ రావణుడు.. మోదీ ఏమో రాముడు.. హైదరాబాద్‌లో అమిత్‌ షా టూర్‌ వేళ ఈ వీడియోని సోషల్‌ మీడియాలో పోస్ట్ చేసింది. ఇది అసలుసిసలైన హిందువులకు, రాముడి భక్తులకు కాస్త అతిగా అనిపించింది. లేకపోతే మోదీ రాముడేంటి..? ఆయనది రామరాజ్యం ఏంటి..? విడ్డూరం కాకపోతే అసలు రామరాజ్యానికి, మోదీ రాజ్యానికి ఉన్న తేడాలు చూడండి.
ప్రజాస్వామ్యం ఎక్కడ?
మోదీ అధికారంలోకి రాగానే రామరాజ్యం వచ్చేసిందని చాలా మంది నోటికి వచ్చిన కూతలు కూశారు. అసలు రామరాజ్యం అనే మాట వినడమే కానీ దాని సంగతి తెలిసిన వాళ్లు చాలా తక్కువ. రామరాజ్యం అంటే ఆదర్శ రాజ్యం. రాముడు వేలాది ఏళ్ల కిందట ఈ నేలను పాలించాడని, ఓ రాజుగా తనదైన శైలిలో పాలించి ప్రజల మెప్పు పొందాడని, పాలకులందరికీ ఆదర్శంగా నిలిచాడని పురాణాలు చెబుతాయి. అందుకే ఎప్పుడో త్రేతాయుగం నాటి రామరాజ్యాన్ని ఇప్పటికీ ఆదర్శ రాజ్యంగా చెబుతారు. రాముడు ఆ కాలంలోనే ప్రజాస్వామ్యబద్దంగా పాలించాడని పురాణాలు చెబుతున్నాయి. రాజ్యం అభివృద్ది విషయంలో కానీ.. ప్రజల మంచి కోసం కానీ తీసుకునే నిర్ణయాల్లో రాముడు అందరితోనూ చర్చించేవాడు. పెద్దల సలహాలు కూడా పాటించేవాడు. అటు ప్రజలను పిలిచి మరీ మాట్లాడేవాడు. మరి మోదీ ఏం చేస్తున్నారు..? ఆయన తీసుకున్న నిర్ణయాలు చాలా వరకు ప్రజలు వ్యతిరేకించారు. నోట్ల రద్దు విషయంలో ఆర్థికవేత్తల మాటలను పట్టించుకోకుండా డిసిషన్ తీసుకున్నారు. రైతు చట్టాల విషయంలోనూ అన్నదాతలు ఏడాది పాటు ప్రాణాలు కోల్పోయి మరీ పోరాడి నల్లచట్టాలను రద్దు చేసేలా చేసుకున్నారు. తీవ్ర ప్రజావ్యతిరేకత ఉన్నా పెట్రో, సిలిండర్ విషయంలో బాదుతూనే ఉన్నారు మోదీ. ఇక రామరాజ్యం ఎక్కడున్నట్టు..?
హింస.. అహింస
రామరాజ్యంలో హింసకు స్థానం ఉండేది కాదు. రాముడు అయోధ్య రాజధానిగా పాలించాడు. ‘అయోధ్య’ అంటే యుద్ధం లేని ప్రాంతం అని అర్థం. నూటికి నూరు శాతం ప్రశాంతంగా ఉండే ప్రాంతం అని అర్థం. మన బీజేపీ నేతలు అయోధ్య చుట్టూనే వివాదాలు రేపారు. రామ జన్మభూమి చుట్టూ జరిగిన అల్లర్లలో చాలా మంది హిందువులు, ఇతర మతస్తుల ప్రాణాలు కోల్పోయారు. ఇంత హింస సృష్టించడానికి అనేక కారణాలు ఉన్నా.. అందులో ఇతర మతస్తుల పాత్ర కూడా ఉన్నా అసలు బీజం పడింది మాత్రం బీజేపీతోనే. అధికారం కోసం సాక్ష్యాత్తు రాముడు పుట్టిన ఊరిపైనే హింసకు పాల్పడ్డారు.
నిజం.. అబద్ధం
సత్యం, ధర్మం మీద నడిచిన రాజ్యమే రామరాజ్యం. ఈ రెండే రామరాజ్యానికి మూలాధారాలుగా నిలిచాయి. ప్రజలు సత్యాన్నే మాట్లాడారు, ధర్మాన్ని ఆచరించారు. అన్నిటిలోనూ ఇతరులకు ఆదర్శంగా ఉన్న రాముడు పాలనలోనూ ఆదర్శంగా నిలిచాడు. ఇప్పుడు మన మోదీ రాజ్యానికి వద్దాం. ఇక్కడ సత్యం గురించి మాట్లాడుకుని టైమ్ వేస్ట్. నోరు తెరిస్తే అబద్ధాలాడే నేతలే కనిస్తారు. రాజకీయాల్లో అది కామన్. అందుకే ప్రజలు కూడా తమ నేతలు నిజాలే మాట్లాడాలని కోరుకోవడం ఎప్పుడో ఆపేశారు. ఎంత భారీ సైజు అబద్ధం చెబితే అంత తెలివైన వాడన్నమాట. ఇటు బీజేపీ లీడర్ల నొళ్లలో నిత్యం నానే పదం ధర్మం. ఆఖరికి ఆ పదాన్ని కూడా భ్రష్టు పట్టించారు. ధర్మం అంటే హిందువుల కోసమే పాలించడమనే అర్థం వచ్చేలా వ్యాఖ్యలు చేస్తుంటారు. అసలు రాముడు చూపించిన ధర్మ మార్గం ఎప్పుడో పక్కకు పోయింది. ఇప్పుడు వినిపిస్తున్న, కనిపిస్తున్న ధర్మం అదో కపట నాటకం.
శాంతి..అశాంతి..
ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకున్న ఓ ప్రేమమూర్తి రాముడు. ఆయన శాంతినే కోరుకున్నాడు. అందుకే ప్రజలందరూ శాంతియుతంగా, సంతృప్తిగా ఉండేవారు. ఇక్కడ మాత్రం సీన్ రివర్స్‌..! ప్రజల్లో అసంతృప్తి అగ్ని జ్వాలలా ఎగిసిపడుతుంది. అటు శాంతి గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. నిత్యం మర్డర్లు, అత్యాచారాలు, దోపిడీలు.. ఇలా క్రైమ్‌కి అడ్డాగా దేశంలో మారిన ప్రాంతాలు ఎన్నో. రాజు సరైనవాడు అయితే ప్రజలు కూడా అలానే ఉంటారు. ఇక్కడ దేశాన్ని ఏలుతున్న పెద్దపెద్ద నేతలే అతిపెద్ద హింసాకాండల్లో కీలక పాత్ర పోషించారన్న ఆరోపణలున్నాయి. అవి ఆరోపణలే కావొచ్చు.. అబద్దాలు కూడా కావొచ్చు. కానీ, ప్రజల్లో వర్గాలు, ప్రాంతాలు, మతాల మధ్య కుంపటి పెట్టిన పార్టీగా బీజేపీ కాంగ్రెస్‌తో సమానంగానే నిలుస్తుంది. ఇన్ని తేడాలున్న రామరాజ్యానికి.. మోదీరాజ్యానికి పోలిక పెట్టడం అతిపెద్ద నేరం! నిజానికి రామరాజ్యం ఇండియాలో రాదు. అది రాముడితోనే సాధ్యం. ఇదంతా రాముడి పేరు వాడుకుని రాజకీయ లబ్ది పొందాలనుకునే వారి నాటకం..!