తెలంగాణ ప్రభుత్వానికి, గవర్నర్ కు మధ్య పంచాయితీ ఇప్పట్లో తెగేలా లేదు. ప్రతిరోజూ ఏదో ఒక ఇష్యూపైన రాజ్ భవన్ (Raj Bhavan), ప్రగతి భవన్ (Pragathi Bhavan)మధ్య పంచాయితీ నడుస్తూనే ఉంది. మొదట్లో గవర్నర్ తమిళిసైకి (Tamilisai Saoundararajan), ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) కు మధ్య సత్సంబంధాలే ఉండేవి. ఆ తర్వాత ఏమైందో ఏమోకానీ ఇద్దరి మధ్య చెడింది. దాని ప్రభావం పాలనపై పడుతోంది. ప్రభుత్వం ఆమోదించిన బిల్లులను గవర్నర్ ఆమోదించకుండా తొక్కిపెట్టేస్తున్నారని బీఆర్ఎస్ (BRS) నేతలు ఆరోపిస్తున్నారు. తాజాగా ఇదే అంశంపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన తెలంగాణ ప్రభుత్వం.
గవర్నర్ తమిళిసై బీజేపీ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారనేది బీఆర్ఎస్ నేతల ఆరోపణ. ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించిన బిల్లులను సైతం గవర్నర్ ఆమోదించట్లేదనేది వాళ్లు చెప్తున్న మాట. గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో కౌశిక్ రెడ్డి (Kasushik Reddy) నియామకాన్ని తమిళిసై అడ్డుకున్నారు. అక్కడ మొదలైన పంచాయితీ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. తాజాగా బడ్జెట్ సమావేశాలను గవర్నర్ ప్రసంగం లేకుండానే కానిచ్చేయాలని కేసీఆర్ ప్రభుత్వం భావించింది. అయితే ఇది హైకోర్టు వరకూ వెళ్లడంతో ఇద్దరి మధ్య సయోధ్య కుదిరింది. దీంతో ప్రగతి భవన్, రాజ్ భవన్ మధ్య గ్యాప్ తొలగినట్లేనని అందరూ భావించారు. అయితే ఇప్పుడీ వ్యవహారం మళ్లీ మొదటికొచ్చినట్లు అర్థమవుతోంది.
గవర్నమెంట్ ఆమోదించిన 10 బిల్లులను గవర్నర్ తమిళిసై ఆమోదించకుండా పెండింగులో పెట్టారని.. దీని వల్ల రాజ్యాంగ ప్రతిష్టంభన ఏర్పడుతోందని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. ఆలస్యం చేసే హక్కు కానీ, వాయిదా వేసే హక్కు కానీ గవర్నర్ కు లేదని స్పష్టం చేసింది. అందుకే న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేసింది. గతేడాది సెప్టెంబర్ లో ఆమోదించిన బిల్లులు కూడా ఇంకా ఆమోదానికి నోచుకోలేదని.. దీని వల్ల ముఖ్యమైన అంశాలు కూడా ముందుకు కదలట్లేదని ప్రభుత్వం చెప్తోంది.
ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ పై గవర్నర్ స్పందించారు. చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి (Chief Secretary) ని కోట్ చేస్తూ తమిళిసై ట్వీట్ చేశారు. ఢిల్లీ కంటే రాజ్ భవన్ చాలా దగ్గరుందని సెటైర్ వేశారు. చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టాక ఒక్కసారి కూడా ఆమె రాజ్ భవన్ రాలేదని, కనీసం ఫోన్లో కూడా మాట్లాడలేదని ఆమె ట్వీట్ చేశారు. దీనికి చీఫ్ సెక్రటరీని ట్యాగ్ చేశారు. సుప్రీంకోర్టుకు వెళ్లడం కంటే తనను కలిసి మాట్లాడితే సమస్యకు పరిష్కారం దొరికేదన్నట్టుగా తమిళిసై అభిప్రాయపడుతున్నారు. ఇదే విషయాన్ని ఆమె రీట్వీట్ చేస్తూ.. ఢిల్లీ కంటే రాజ్ భవన్ దగ్గరుందని మరోసారి గుర్తు చేశారు. మరి గవర్నర్ ట్వీట్ పై చీఫ్ సెక్రటరీ స్పందిస్తారా.. శాంతికుమారి వెళ్లి గవర్నర్ ను కలుస్తారా.. లేదా.. అనేది చూడాలి.