Vizag Steel Plant: స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై తగ్గేదే లే..! తేల్చేసిన కేంద్ర ప్రభుత్వం!!

స్టీల్ ప్లాంట్ ను దక్కించుకుంటామంటూ బీఆర్ఎస్ రంగంలోకి దిగడం, వెంటనే ప్లాంట్ ను ప్రైవేటీకరించే ఉద్దేశం తమకు లేదని కేంద్ర మంత్రి చెప్పడం, ఆ ఘనత తమదేనని బీఆర్ఎస్ సంబరాలు చేసుకోవడం, ఆ వెంటనే మంత్రి మాట మార్చడం.. చకచకా జరిగిపోయాయి.

  • Written By:
  • Publish Date - April 14, 2023 / 04:27 PM IST

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై రెండ్రోజులుగా రచ్చ నడుస్తోంది. స్టీల్ ప్లాంట్ ను దక్కించుకుంటామంటూ బీఆర్ఎస్ రంగంలోకి దిగడం, వెంటనే ప్లాంట్ ను ప్రైవేటీకరించే ఉద్దేశం తమకు లేదని కేంద్ర మంత్రి చెప్పడం, ఆ ఘనత తమదేనని బీఆర్ఎస్ సంబరాలు చేసుకోవడం, ఆ వెంటనే మంత్రి మాట మార్చడం.. చకచకా జరిగిపోయాయి. ఇంతకూ స్టీల్ ప్లాంట్ పై కేంద్రం వైఖరేంటి.. ప్రైవేటీకరణపై ముందుకు వెళ్తుందా.. లేకుంటే వెనక్కు తగ్గిందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే వీటికి ఫుల్ స్టాప్ చెప్తూ కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.

రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ – RINLను ప్రైవేటీకరించే ప్రక్రియ కొనసాగుతోందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. RINL విశాఖ స్టీల్ ప్లాంట్ మాతృ సంస్థ. ప్రైవేటీకరించట్లేదంటూ వస్తున్న వార్తలు అవాస్తవమని, ఆ ప్రక్రియ కొనసాగుతోందని కేంద్ర ఉక్కు శాఖ తేల్చి చెప్పింది. కేంద్ర ప్రభుత్వ మద్దతుతో ప్రైవేటీకరణ ప్రక్రియ నడుస్తోందని తెలిపింది. RINLను బలోపేతం చేయడమనే ప్రక్రియ పెద్ద సవాల్ గా మారిందనేది ఉక్కు శాఖ చెప్పిన వివరణ. దీంతో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యవహారం మళ్ళీ మొదటికొచ్చింది.

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగ సంస్థ. ఇది తీవ్ర ఆర్థిక నష్టాల్లో ఉందని, దీన్ని నడపడం సాధ్యం కాదనేది కేంద్ర ప్రభుత్వం చెప్తున్న మాట. అందుకే మిగిలిన ప్రభుత్వరంగ సంస్థలలాగే దీన్ని కూడా అమ్మేయాలనే నిర్ణయానికి వచ్చింది. అప్పటి నుంది దీనిపై అనేక ఆందోళనలు, ఉద్యమాలు జరుగుతున్నాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్మికులు రోజూ ఆందోళన చేస్తున్నారు. అయితే పట్టించుకునే నాథుడే లేరు. ఏపీలోని పార్టీలన్నీ కేంద్రంలోని బీజేపీకి అనుకూలంగా ఉండేవే. కాబట్టి కార్మికులకు మద్దతు కూడా కరువైంది. ఇదే అదనుగా కేంద్రం దీనిపై వెనక్కు తగ్గట్లేదు.

 

అయితే కేసీఆర్ ఎప్పుడైతే స్టీల్ ప్లాంట్ అంశాన్ని లేవనెత్తారో అప్పటి నుంచి ఇది మళ్లీ వార్తల్లో నిలిచింది. ప్రైవేటీకరించకుండా అడ్డుకుంటామని, అవసరమైతే సింగరేణి ద్వారా బిడ్ వేసి దక్కించుకుంటామన్ని బీఆర్ఎస్ వెల్లడించింది. దీంతో మళ్లీ ఆశలు చిగురించాయి. అయితే అదే జరిగితే క్రెడిట్ అంతా బీఆర్ఎస్ కు వెళ్తుందనుకున్నారో ఏమో.. వెంటనే ప్రైవేటీకరణ ఆలోచన లేదన్నారు. ఆ క్రెడిట్ ను కూడా బీఆర్ఎస్ కొట్టేయడంతో కేంద్రం మళ్లీ పునరాలోచనలో పడ్డట్టు అర్థమవుతోంది. అందుకే ప్రైవేటీకరణపై ముందుకే తప్ప వెనక్కు వెళ్లే ప్రసక్తే లేదని తేల్చేసింది. మరి ఇప్పుడు స్టీల్ ప్లాంట్ అంశంలో ఏ పార్టీ వైఖరి ఎలా ఉంటుందో చూడాలి.