DK Shivakumar: కర్ణాటక డిప్యుటీ సీఎం డీకే శివకుమార్ తెలంగాణ కాంగ్రెస్ తలరాత మారుస్తారా..? రాష్ట్రంలో పార్టీకి అధికారాన్ని సంపాదించి పెట్టగలరా..? అవుననే గట్టిగా నమ్ముతోంది కాంగ్రెస్ హైకమాండ్. ఎప్పట్నుంచో ఊహించినట్లుగానే తెలంగాణ ఎన్నికల్లో ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించబోతోంది..
డీకే శివకుమార్.. కాంగ్రెస్ సౌత్ లక్కీ మస్కట్.. తన వ్యూహాలు, ఎత్తుగడలతో కర్ణాటకలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకువచ్చిన నేత. జవసత్వాలు కోల్పోయి ఐసీయూలో ఉన్న కాంగ్రెస్‌కు కొత్త ఊపిరిలూదిన విజయమది. సార్వత్రిక ఎన్నికల వేళ కాంగ్రెస్ తలెత్తుకుని తిరగగలుగుతున్నా, ఇండియా ఫ్రంట్ అంటూ ప్రతిపక్షాలను ఏకం చేసే ప్రయత్నాలు చేస్తున్నా అంతా ఆ విజయం ఫలితమే. కర్ణాటక విజయంతో డీకే శివకుమార్ పేరు మరోసారి దేశమంతా మార్మోగిపోయింది. ఇంతటి ఘన విజయాన్ని అందించిన డీకే శివకుమార్‌ను తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ ఉపయోగించుకోవాలన్న నిర్ణయం ఎవరికీ ఆశ్చర్యాన్ని కలిగించడం లేదు. అయితే ఆయనకు ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తారన్నది ఇప్పుడు ఆసక్తి రేపుతోంది.
కేసీఆర్‌ను కొట్టడం అంత ఈజీ కాదు..!
తెలంగాణలో కేసీఆర్‌ను ఎదుర్కోవడం అంత ఈజీ కాదు. రాజకీయ చాణక్యుడు కేసీఆర్. ఎప్పుడే అస్త్రాన్ని ఎలా సంధించాలో తెలిసిన వాడు. అలాంటి కేసీఆర్‌ను తెలంగాణ కాంగ్రెస్ ఒక్కటీ ఎదుర్కోలేదని కాంగ్రెస్ హైకమాండ్‌కు బాగా తెలుసు. అందుకే ఎన్నికల వ్యూహాలపై డీకే శివకుమార్ సలహాలు తీసుకోవాలని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి సూచించింది. అభ్యర్థుల ప్రకటన నుంచి ప్రజాకర్షక హామీల వరకు అన్నింటిలోనూ డీకే పాత్ర ఉండేలా చూడాలన్నది పార్టీ ఆలోచన.
తెలంగాణలో కర్ణాటక మోడల్
కర్ణాటక ఎన్నికల్లో విజయానికి కారణం ఒకటి ప్రభుత్వంపై వ్యతిరేకత అయితే మరొకటి ఆకర్షణీయ పథకాలు. తెలంగాణలో కూడా అలాంటి పథకాలను ప్రకటించాలని కాంగ్రెస్ భావిస్తోంది. దీంతో పాటు అభ్యర్థుల ఎన్నిక విషయంలో కర్ణాటకలో కొత్త తరహా వ్యూహాన్ని అనుసరించారు. పేరు కంటే సర్వేలకే ప్రాధాన్యం ఇచ్చారు. ఎప్పటికప్పడు సర్వేలు చేయించారు. డేటాను మధించారు. ప్రతి ఓటరును చేరుకున్నారు. కర్ణాటక వ్యూహంతోనే తెలంగాణలోనూ ముందుకెళ్లాలన్నది ఆ పార్టీ ఆలోచన.
హైకమాండ్ అధికారికంగా చెప్పేదాకా..!
ఇప్పటికే రేవంత్ రెడ్డి డీకేతో నిరంతరం టచ్‌లో ఉంటున్నారు. డీకే ప్రాధాన్యాన్ని గుర్తించిన పలువురు నేతలు ఆయనతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు. పార్టీ వ్యూహాలపై ఆరా తీస్తున్నారు. ఆయన సలహాలు తీసుకుంటున్నారు. అయితే డీకే అధికారికంగా మాత్రం ఇంకా రంగంలోకి దిగలేదు. పార్టీ తనను తెలంగాణ ఎన్నికల వ్యూహాల్లో పాలుపంచుకోమని అధికారికంగా చెప్పేవరకు వేచి చూడాలని భావిస్తున్నారు. అయితే తెరవెనుక మాత్రం ఆయన మంత్రాంగం కొనసాగుతోంది. వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె షర్మిల పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసేలా కథ నడిపింది ఆయనే. ఢిల్లీలో పార్టీ పెద్దలతో షర్మిలకు మీటింగ్ అరేంజ్ చేశారు.
ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు..?
2014 నుంచి తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. 9 ఏళ్ల కాలంలో సహజంగా ఉండే ప్రభుత్వ వ్యతిరేకతను క్యాష్ చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. 2014లో రాష్ట్రం విడిపోక ముందు కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంది. రాష్ట్రం ఇచ్చినా తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ను గెలిపించలేదు. రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్‌కే ఓటేశారు. రెండోసారీ అదే పరిస్థితి. కానీ ఈసారి మాత్రం కచ్చితంగా గెలిచి తీరాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇటీవలి వరకు రాష్ట్రంలో పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా ఇటీవల కాస్త పుంజుకున్నట్లు కనిపిస్తోంది. ఇన్నాళ్లు మేమే పోటీ అన్న బీజేపీ రేసులో వెనకబడి పోయింది. దీంతో ఎలాగైనా అధికారాన్ని సాధించాలన్న తపనలో ఉంది కాంగ్రెస్. త్వరలోనే డీకేను అధికారికంగా తెలంగాణ వ్యవహారాల్లో భాగం చేసే అవకాశం కనిపిస్తోంది.