DK Shivakumar: డీకే వస్తున్నాడు.. తెలంగాణలో గెలుపే లక్ష్యంగా సాగుతున్న కాంగ్రెస్.. కర్ణాటక వ్యూహం అమలు..!

ఇటీవలి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ విజయం సాధించడం వెనుక డీకే వ్యూహాలు ఎన్నో ఉన్నాయి. పోల్ మేనేజ్‌మెంట్, మీడియా మేనేజ్‌మెంట్, పార్టీ అంతర్గత వ్యవహారాలు చక్కదిద్దడం వంటి అనేక అంశాల్లో డీకేకు మంచి పట్టుంది. ఎన్నికల వ్యూహాల్ని అమలుచేయగల నేర్పరి.

  • Written By:
  • Publish Date - June 16, 2023 / 05:09 PM IST

DK Shivakumar: తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జిగా డీకే శివకుమార్ రాబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం కర్ణాటక పీసీసీ అధ్యక్షుడిగానే కాకుండా, ఉప ముఖ్యమంత్రిగా ఉన్న డీకే.. ఇకపై తెలంగాణ కాంగ్రెస్ బాధ్యతలు కూడా చూసుకోబోతున్నారు. ఇటీవలి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ విజయం సాధించడం వెనుక డీకే వ్యూహాలు ఎన్నో ఉన్నాయి. పోల్ మేనేజ్‌మెంట్, మీడియా మేనేజ్‌మెంట్, పార్టీ అంతర్గత వ్యవహారాలు చక్కదిద్దడం వంటి అనేక అంశాల్లో డీకేకు మంచి పట్టుంది. ఎన్నికల వ్యూహాల్ని అమలుచేయగల నేర్పరి. ఆయన పనితనాన్ని గుర్తించిన కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ బాధ్యతల్ని ఆయనకు అప్పగించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. పార్టీని డీకే ముందుండి నడిపిస్తే.. ఇతర వ్యవహారాల్ని పార్టీ ప్రధాన కార్యదర్శి, సీనియర్ నేత ప్రియాంకా గాంధీ చూసుకుంటారు. ఈ నిర్ణయాలతో తెలంగాణపై కాంగ్రెస్ గట్టి ఫోకస్ చేసినట్లే కనిపిస్తోంది.
గెలుపే లక్ష్యంగా
ఈ ఏడాది తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. అందుకే ఎలాగైనా ఇక్కడ గెలిచి, అధికారం దక్కించుకోవాలని కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకుంది. బీజేపీ బలహీన పడటం, బీఆర్ఎస్‌పై ప్రజల్లో వ్యతిరేకత పెరగడం కూడా కలిసొచ్చే అంశాలే. అందుకే తెలంగాణ విషయంలో అధిష్టానం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంది. పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ కూడా తెలంగాణ విషయంలో పట్టుదలగా ఉన్నారు. త్వరలో రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ ఇక్కడ పర్యటించబోతున్నారు. వరుస కార్యక్రమాలతో ప్రజలకు దగ్గరయ్యేందుకు పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. నేతలంతా జనాల మధ్యే ఉంటున్నారు.
కర్ణాటక వ్యూహాలు
కర్ణాటకలో కాంగ్రెస్ విజయం సాధించడం వెనుక డీకే వ్యూహాలు చాలా కీలకం. అందుకే వాటిని తెలంగాణలో అమలు చేయబోతున్నారు. మరోవైపు కర్ణాటక మాదిరి ప్రజాకర్షక పథకాల్ని కూడా ప్రవేశపెట్టబోతున్నారు. ఈ దిశగా కసరత్తులు జరుగుతున్నాయి. రైతు రుణమాఫీ, ఉచిత గృహ విద్యుత్, నిరుద్యోగ భృతి, మహిళలకు ఆర్థిక సాయం వంటి పథకాల్ని తెలంగాణలోనూ ప్రకటించే అవకాశం ఉంది. ఈ పథకాల అమలుతోపాటు వివిధా పార్టీల నేతల్ని కాంగ్రెస్‌లో చేర్చుకునే అంశంపై కూడా డీకే పక్కా ప్రణాళికతో ఉన్నారని తెలుస్తోంది. ఆయన సూచనల మేరకే తెలంగాణలో నేతలు దూకుడుగా పని చేస్తున్నారు. మరి డీకే వ్యూహాలు ఇక్కడ ఏ మేరకు పనిచేస్తాయో చూడాలి.