Political Parties : వ్యూహకర్తలు నిజంగా గెలిపిస్తారా..?

ఎన్నికల్లో పార్టీలను గెలిపించేది ప్రజలా.. వ్యూహకర్తలా..? వ్యూహకర్తలే పార్టీలను గెలిపించేస్తే ఇక ప్రజల అభిప్రాయానికి విలువ ఎక్కడ.? దేశంలో ఇప్పుడు వ్యూహకర్తల సీజన్‌ నడుస్తోంది. వందేళ్ల చరిత్ర ఉన్న పార్టీలు, 40 ఏళ్ల చరిత్ర ఉన్న పార్టీలు, చివరికి 10 ఏళ్ల హిస్టరీ ఉన్న పార్టీలు.. ఆ పార్టీ.. ఈ పార్టీ అని లేదు.. అందరూ గెలుపు కోసం స్ట్రాటజిస్టుల వెంట పడ్డారు.

 

 

ఎన్నికల్లో పార్టీలను గెలిపించేది ప్రజలా.. వ్యూహకర్తలా..? వ్యూహకర్తలే పార్టీలను గెలిపించేస్తే ఇక ప్రజల అభిప్రాయానికి విలువ ఎక్కడ.? దేశంలో ఇప్పుడు వ్యూహకర్తల సీజన్‌ నడుస్తోంది. వందేళ్ల చరిత్ర ఉన్న పార్టీలు, 40 ఏళ్ల చరిత్ర ఉన్న పార్టీలు, చివరికి 10 ఏళ్ల హిస్టరీ ఉన్న పార్టీలు.. ఆ పార్టీ.. ఈ పార్టీ అని లేదు.. అందరూ గెలుపు కోసం స్ట్రాటజిస్టుల వెంట పడ్డారు. ఒక వ్యూహకర్తను పెట్టేసుకుంటే చాలు.. అతనే మన పార్టీని గెలిపించేస్తాడు అనే మాయలో ఉన్నట్లున్నాయి పార్టీలు. ప్రశాంత్‌ కిషోర్‌, రాబిన్‌ శర్మ, సునీల్‌ కనుగోలు, రిషి రాజ్‌ సింగ్‌.. ఇలా రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి. వ్యూహకర్తలే ప్రజల అభిప్రాయాన్ని మార్చేయగలిగితే.. ఓడిపోయే పార్టీని గెలిపించడం.. గెలిచే పార్టీని ఓడించడం చేయగలిగితే.. ప్రజాస్వామ్యంలో ప్రజల అభిప్రాయానికి, ఓటరు మనోగతానికి విలువెక్కడుంది. వ్యూహకర్త చెప్పింది విని.. వ్యూహకర్త చేసిన ప్రచారానికి పడిపోయి.. జనం తమ అభిప్రాయాలను మార్చేసుకుని పార్టీని గెలిపించేస్తారా? ప్రజలకు వారికంటూ ఒక అభిప్రాయం ఉండదా?

ఓటు కేవలం ఒక అంశాన్ని చూసి మాత్రమే వేయరు. ఎవరి అభిప్రాయం వాళ్లకుంటుంది. కొందరు అభివృద్ధిని చూస్తున్నారు. ఇంకొందరు నాయకుడి వ్యవహారశైలిని చూస్తున్నారు. మరికొందరు తమకు అందుతున్న సంక్షేమ పథకాలను గుర్తు పెట్టుకుంటారు. ఇంకా పాలనలో అవినీతిని వ్యతిరేకిస్తూ ఓటేసేవాళ్ళూ ఉంటారు. ఒక ఓటరు ఓటేయడానికి వాళ్ల వాళ్ల వ్యక్తిగత అభిప్రాయాలు, సామాజిక అంశాలు ఇలా ఎన్నో పరిగణలోకి తీసుకుని తమకు నచ్చిన వారిని ఎన్నుకుంటారు. అయితే వ్యూహకర్తలు చేసేది ఏంటంటే.. శాస్త్రీయ దృక్పథంతో ప్రచారం చేయడం, విభిన్నంగా పార్టీ ప్రచార శైలిని జనంలోకి తీసుకెళ్లడం, ప్రజల నాడిని గుర్తించడం, అందుకు అనుగుణంగా పార్టీల మేనిఫెస్టోలు, హామీలు తయారు చేస్తారు. గెలుపు దిశగా వెళ్తున్న పార్టీని ఒక శాతం మెరుగుపడేటట్టు కూడా చేయగలుగుతారు. అంతే తప్ప పార్టీల విజయావకాశాలను తారుమారు చేయలేరు. ప్రజల అభిప్రాయాన్ని.. తమ స్ట్రాటజీలతో ఒక్కసారిగా మార్చేయలేరు.

ఇందిరాగాంధీ, ఎన్టీ రామారావు, జయలలిత, కరుణానిధి, ఎంజీ రామచంద్రన్‌, జ్యోతిబసు లాంటి నేతలు.. ఏ వ్యూహకర్తలపై ఆధారపడి రాజకీయం చేసి.. ఎన్నికల్లో గెలిచారు? పార్టీల్లో అగ్రనేతలకు రాజకీయ భౌగోళిక స్వరూపంపై పూర్తిగా పట్టు ఉంటుంది. ఏ జిల్లాలో ప్రజలు ఎలా ఉంటారు? అక్కడ సామాజిక అంశాలు ఏంటి? స్థానిక అంశాలు ఏంటి? దేనికి ఎలాంటి పరిష్కారం చూపించాలి? అన్న అంశాలపై ఒకప్పుడు లీడర్లకు పట్టుండేది. ఇప్పటి నాయకులు రెండు నెలల ముందు పార్టీ టికెట్లు తీసుకుని.. ఆదరా బాదరాగా ప్రచారం చేసి గెలిచి.. ఆ తరువాత ఐదేళ్లు కాంట్రాక్టులు, వ్యాపారాలు చేసుకునే ప్లాన్‌లో ఉన్నారు. వారికి తెలిసింది గోరంత.. తెలియాల్సింది కొండంత. కానీ ఇలా వచ్చి అలా టికెట్ పట్టేసి నేతలైపోతున్నారు చాలామంది. ప్రజల సమస్యలు కానీ, సామాజిక అంశాలపై కానీ ఎలాంటి అవగాహన లేకపోవడంతోనే.. స్ట్రాటజిస్టులపై ఆధారపడి ఇన్‌స్టంట్‌గా ఎన్నికల్లో గెలవాలనే తపనతో ఉన్నారు. కానీ ప్రజలకు ఒక పార్టీని గెలిపించాలి. లేదా ఒక పార్టీని ఓడించాలి అన్న స్థిర నిశ్చయానికి వచ్చేసిన తరువాత.. వాటి వ్యూహకర్తలు మార్చగలుగుతారా? గాల్లో పోయే పేలాల పిండి కృష్ణార్పణం అన్నట్లుగా.. ఫలితాలు వచ్చాక అది తమ ప్రతిభేనని స్ట్రాటజిస్టులు క్లెయిమ్‌ చేసుకుంటారు. ఒక్కొక్క స్ట్రాటజిస్తూ వాళ్ళ విధానాలకు తగినట్లుగా.. నేతలతోనూ పార్టీలతోనే ఆడుకుంటారు. ప్రశాంత్ కిషోర్ లాంటోడు కులాలను ఎలా చీల్చి.. దాని నుంచి ఓట్లు ఎలా రాబట్టాలో చూసుకుంటాడు. జనానికి ఎంత డబ్బులు పంచాలో డిసైడ్ చేస్తాడు. ఇంకో వ్యూహకర్త కోడి కత్తి కేసు, పరస్పర దాడులు ప్లాన్ చేస్తారు.

నిజాయితీగా జనానికి పార్టీ విధానాలు చెప్పే రోజులు ఎప్పుడో పోయాయి. పక్కవాడిని ఎలా డామేజ్ చేయాలి అనే ఒకే ఒక ఫార్ములా మీద ఇప్పుడు వ్యూహకర్తలు పని చేస్తున్నారు. ఎన్నికల్లో తలపడే రెండు పార్టీలకు స్ట్రాటజిస్టులు ఉన్నప్పుడు.. ఏదో పార్టీ ఓడిపోతుంది. ఆ పార్టీని ఆ స్ట్రాటజిస్టు ఓడించాడనీ.. ఈ పార్టీని మరో స్ట్రాటజిస్టు గెలిపించాడని అనుకోవాలా? వ్యూహకర్తలే గెలిపిస్తే.. ప్రజాస్వామ్యానికి, ప్రజాభిప్రాయానికి విలువ లేదా? చాలా బాధాకరమైన విషయం ఏంటంటే.. దశాబ్దాల పాటు రాజకీయం చేసినవాళ్లు, ప్రజా జీవితంలో మమేకమైన వాళ్లు.. రాష్ట్రాల పొలిటికల్‌ జాగ్రఫీ తెలిసినవాళ్లు కూడా చివరికి వ్యూహకర్తల కాళ్లు పట్టుకోవడం. మీరే గెలిపించాలి అంటూ ప్రాధేయపడటం సిగ్గుచేటు. ప్రజాస్వామ్య ప్రక్రియలో, ఎన్నికల రణరంగంలో ప్రజాభిప్రాయాన్ని మించింది లేదు. ఓటరు తాను ఏది మంచి అనుకుంటాడో దాన్ని అమలు చేస్తాడు. దానికి తిరుగులేదు. ప్రజాభిప్రాయాన్ని నూటికి నూరు శాతం వ్యూహకర్తలు ఎప్పటికీ మార్చలేరు. వాళ్లు చేయగలిగేది విస్తృతమైన, విభిన్నమైన ప్రచారంతో ఒక్క శాతం తేడా మాత్రమే చూపించగలుగుతారు.