ఒక్క టర్మ్ అధికారంలో ఉండే చాలు.. మునిమనవళ్లకు కూడా సరిపోయేంత ఆస్తులు సంపాదించుకునే రోజులు ఇవి. ఇప్పుడే కాదు.. చాలా ఏళ్లుగా భారత రాజకీయ వ్యవస్థలో కనిపిస్తున్న సీన్ ఇదే. కానీ.. భారత ఆర్థిక మంత్రిగా, పదేళ్లు ప్రధానిగా పని చేసినా.. మాజీ ప్రధాని, దివంగత నేత మన్మోహన్ సింగ్ సంపాదించుకున్న ఆస్తులు.. ఇప్పుడు ప్రతీ ఒక్కరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. దశాబ్దాల పాటు ప్రభుత్వ ఉద్యోగిగా, ఆర్థిక మంత్రిగా, పదేళ్లు ప్రధానిగా ఉన్నా.. మన్మోహన్ సింగ్ చాలా సింపుల్ జీవితం గడిపారు. ఒక మారుతి 800 కారు, ఢిల్లీ, చండీఘర్‌లలో రెండు అపార్ట్‌మెంట్లు, స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియాలో డిపాజిట్లు.
ఇవే ఆయన సంపాదించుకున్న ఆస్తిపాస్తులు. నిజాయతీకి, నిబద్ధతకు మన్మోహన్ నిలువెత్తు ప్రతిరూపమని ఆయనతో ప్రయాణం చేసిన రాజకీయ నేతలు రచయితలు చెప్తున్న మాట. మన్మోహన్ సింగ్ తన రాజకీయ జీవితంమొత్తం దాదాపు రాజ్యసభ సభ్యుడిగానే పని చేశారు. దాదాపు 33 ఏళ్లు పెద్దల సభ నుంచి ఎంపీగా దేశానికి సేవలందించారు. 1999లో ఒకే ఒక్కసారి మన్మోహన్ సింగ్ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేశారు. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ అంటేనే డబ్బుతో కూడుకున్న వ్యవహారం. దీంతో కుష్వంత్ సింగ్ అనే రైటర్ దగ్గర రెండు లక్షలు అప్పుగా తీసుకున్నారు మన్మోహన్ సింగ్. కానీ ఆ ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన మరుసటి రోజే కుష్వంత్ సింగ్ ఇంటికి వెళ్లారట మన్మోహన్ సింగ్. తాను అప్పుగా తీసుకున్న రెండు లక్షలు వెంటనే ఆయనుకు ఇచ్చేశారట. ఎన్నికల్లో ఆ డబ్బు వాడలేదని చెప్పారట. ఈ విషయాన్ని కుష్వంత్ సింగ్ ఓ పుస్తకంలో రాశారు. ఇలాంటి మనుషులు చాలా అరుదుగా ఉంటారిన మన్మోహన్ సింగ్‌ను ఆకాశానికెత్తారు.