Kodali Nani : గుడివాడలో కొడాలి నానిని కొట్టే దమ్ముందా..?

గుడివాడలో కొడాలి నాని కమ్మ సామాజిక వర్గం ఓట్లతోనే గెలుస్తున్నారనుకుంటే పొరపాటే. నానిని ఓడించాలంటే కమ్మ ఓట్లకు కాపులో, యాదవులో తోడవ్వాలి. అయితే స్థానిక పరిస్థితులను గమనిస్తే అది అసాధ్యం.

  • Written By:
  • Updated On - April 17, 2023 / 02:33 PM IST

తెలుగుదేశం పార్టీలో రాజకీయం నేర్చుకుని ఎదిగిన కొడాలి నాని ఇప్పుడు వైసీపీలో ఉన్నారు. గుడివాడను కంచుకోటగా మార్చుకున్నారు. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీ రామారావు పోటీ చేసిన నియోజకవర్గం ఇది. ఆ తర్వాత కొడాలి నానికి తిరుగులేని నియోజకవర్గంగా మారిపోయింది. వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు నాని. ఏం మాయ చేస్తారో కానీ ఏ పార్టీలో ఉన్నా గెలుపు మాత్రం నానిదే. ఇప్పట్లో కొడాలి నానిని కొట్టే మొనగాడెవడైనా ఉన్నారా.. అంటే ఏదైనా అద్భుతం జరిగితే తప్ప సమీప భవిష్యత్తులో కనిపించట్లేదు.

కొడాలి నాని తిట్లకు పెట్టింది పేరు. ప్రత్యర్థులను, ముఖ్యంగా టీడీపీని అమ్మనా బూతులు తిడుతుంటారు. ఇది వైసీపీ వాళ్లకు సెలబ్రేషన్ మూడ్ తీసుకొస్తుంది. టీడీపీ వాళ్లకు మాత్రం ఒళ్లు మండేలా చేస్తుంది. నాని దొరికితే చంపేద్దామా అన్నంత కసి టీడీపీ నాయకుల్లో కనిపిస్తుంటుంది. కానీ నానితో పెట్టుకుంటే ఆయన మరింత రెచ్చిపోవడం ఖాయం. టీడీపీ వాళ్లు ఒకటంటే నాని రెండు కాదు.. మూడంటారు. కాబట్టి నానిని పెట్టుకుని గెలవడం అంత ఈజీ కాదు. ప్రతిదానికీ నాని దగ్గర సమాధానం ఉంటుంది. అందుకే ఆయనతో ఎవరూ అంత ఈజీగా పెట్టుకోరు.

పూరి జగన్నాథ్ సినిమాల్లో హీరోలందరూ పోకిరీలే ఉంటారు. కానీ వాళ్లకుండే మాస్ ఇమేజ్ మామూలుగా ఉండదు. గుడివాడలో నాని కూడా అంతే. నాని తిట్టే తిట్లు చూసి అందరికీ నాని పైన కోపం రావచ్చు. కానీ ఆయనో మాస్ లీడర్. ఆయన్ను దగ్గర నుంచి చూసిన వాళ్లంతా హీరోను చూసిన ఫీలింగ్ తో మురిసి పోతుంటారు. అందుకే నాని గుడివాడలో తిరుగులేని విజయాలు సాధిస్తున్నారు. పైగా బయట నానిని తిట్టే వాళ్లంతా గుడివాడ ఓటర్లు కాదు. గుడివాడ ఈక్వేషన్లు వేరు. నాని లెక్కలు వేరు.

గుడివాడలో కొడాలి నాని కమ్మ సామాజిక వర్గం ఓట్లతోనే గెలుస్తున్నారనుకుంటే పొరపాటే. అక్కడ 30వేల కాపు ఓట్లు, మరో 30 వేల యాదవుల ఓట్లు ఉన్నాయి. కమ్మ సామాజిక వర్గం తర్వాత ఎక్కువ ఓట్లు వీళ్లవే. నాని తిట్టే తిట్లకు కమ్మ ఓటర్లు దూరమైనా వీళ్లు మాత్రం ఆయనకు సపోర్టుగా నిలుస్తున్నారు. అందుకే ఆయనకు గెలుపు ఈజీ అవుతోంది. నానిని ఓడించాలంటే కమ్మ ఓట్లకు కాపులో, యాదవులో తోడవ్వాలి. అయితే స్థానిక పరిస్థితులను గమనిస్తే అది అసాధ్యం. అందుకే నానిని ఓడించే మొనగాడు ఇప్పట్లో లేడనే చెప్పొచ్చు.