పవన్ కల్యాణ్ ఎక్కడ..? ఈ ప్రశ్న వేస్తున్నది ప్రతిపక్షాలు కాదు… జనసేన (Janasena) నాయకులు, కార్యకర్తలే… ఆ మధ్య కొంత ఫైరైన పవన్ (Pawan Kalyan) మళ్లీ ఎందుకు సైలెంటయ్యారు..? ఇది వ్యూహమా…లేక తనను తాను ఎక్కువ ఊహించుకోవడమా…?
ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు కేవలం ఏడాది సమయం మాత్రమే ఉంది. ఇప్పటికే అధికార వైసీపీ (YCP), ప్రతిపక్ష టీడీపీ(TDP)లు వార్ మోడ్‌లోకి వెళ్లిపోయాయి. చావోరేవో తేల్చుకునేందుకు సిద్ధమై ప్రజాక్షేత్రంలోకి దూకాయి. నేతలంతా ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. అయితే జనసేనాని మాత్రం ఇంకా సీన్‌లోకి ఎంటర్ కాలేదు. ఇదే జనసేన నేతలకు అర్థం కాని ప్రశ్న…
అధికార వైసీపీ 175కి 175సీట్లు అన్న నినాదంతో ముందుకెళుతోంది. అన్ని రావని ఆ పార్టీకి తెలిసినా ఎలాగైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలని గట్టిగా ప్రయత్నిస్తోంది. జగన్ ఎప్పటికప్పుడు సర్వేలు చేయిస్తున్నారు. నేతలను జనంలో ఉండాలని వెంటాడుతున్నారు. చంద్రబాబు (Chandrababu) కూడా ఎన్నికల వ్యూహాలపైనే ఉన్నారు. అప్పుడప్పుడు జిల్లాలు తిరుగుతున్నారు. లోకేశ్ (Lokesh) కూడా పాదయాత్ర పేరుతో జనంలోనే ఉన్నారు. ఇంత జరుగుతున్నా పవన్ మాత్రం తనకేం పట్టనట్లు సైలెంట్‌గా ఉన్నారు. ఏపీలో అధికార వైసీపీపై కొంత వ్యతిరేకత ఉందన్నది వాస్తవం. దాన్ని క్యాష్ చేసుకోవడానికి టీడీపీ పోటీపడుతోంది. కానీ జనసేన మాత్రం అలాంటి పనే చేయడం లేదు. ఆ ఎన్నికలు తనకు సంబంధం లేని వ్యవహారం అన్నట్లుంది జనసేనాని తీరు.
ఎన్నికల కోసం పవన్ ఆ మధ్య వారాహి (Varahi) వాహనాన్ని కూడా డిజైన్ చేయించారు. దానికి పూజలు కూడా చేశారు. ఆ వాహనం ఏపీలో ఎలా తిరుగుతుందో చూస్తామని వైసీపీ నేతలు అంటే… తిరిగి చూపుతామని సవాల్ చేశారు జనసేనాని. కానీ ఇంతవరకు ఏపీలో వారాహి తిరిగింది లేదు. జనం చూసిందీ లేదు. ఎన్నికల వేడి రగులుతున్న సమయంలో జనంలో ఉంటూ పార్టీకి ఊపు తీసుకురావాల్సిన పవన్ సైలెంట్‌గా ఉన్నారు. గతంతో పోల్చితే తమ గ్రాఫ్ ఎంతో కొంత పెరిగిందని జనసేన చెబుతోంది. కానీ గ్రాఫ్ పెరిగితే సీట్లు రావు. ఊపు వస్తేనే గెలుపు దక్కుతుంది. ఇది పవన్‌కు అర్థమైందా లేదా అన్నదే ప్రశ్న. పార్టీకి ఊపు రావాలంటే తాను జనంలోకి రావాలి.. జనంలో తిరగాలి… జనంతో నడవాలి…జనం తనతో నడిచేలా చేయగలగాలి.
పవన్ తీరు చూస్తుంటే తనను తాను ఎక్కువ ఊహించుకుంటున్నారా అన్న అనుమానాలు రేగుతున్నాయి. తాను జనంలో తిరగకపోయినా ఓట్లు పడతాయనుకుంటున్నారేమో అంటున్నారు విశ్లేషకులు. జనం నమ్మకపోతే నాయకుడు కాలేరు. వారు ఓట్లేయాలంటే వారితో ఉండాలి. 2019లో ఏం జరిగిందో పవన్‌కు బాగా తెలుసు… ఇలాగైతే మరోసారి అలాంటి పరిస్థితులే తలెత్తవా అన్నది ఓ సామాన్య జనసేన కార్యకర్త ఆవేదన. రోడ్లు పట్టుకుని ఓట్లకోసం తిరుగుతున్న నేతలకే దిక్కులేదు. అలాంటిది మనం బయటకు రాకపోతే ఓట్లు పడతాయా అన్నదానికి పవన్ సమాధానం వెతుక్కోవాలి. ఎన్నికలకు ఓ ఆరునెలల ముందు జనంలోకి వస్తే ఉపయోగం ఉండదు. సినిమా క్రేజ్ ఓట్లు కురిపించదన్న నిజం పవన్‌కు 2019లోనే అర్థమయ్యేలా చేశారు జనం. ఇప్పుడు కూడా చివర్లో వచ్చి హడావుడి చేస్తే ఎలాంటి ఉపయోగం ఉండబోదని జనసేన నేతలు చెబుతున్నారు. పవన్‌కు సినిమాలు ముఖ్యమే కావచ్చు కానీ ఎన్నికలు అంతకంటే ముఖ్యమా కాదా అన్నది ఆయనే తేల్చుకోవాలి.
ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలనివ్వబోమంటూ పదేపదే ప్రకటనలు చేస్తున్న జనసేనాని పొత్తులపైనా క్లారిటీ ఇవ్వలేదు. టీడీపీతో పొత్తు గ్యారెంటీ అంటూ ప్రచారం జరిగింది… కానీ దానిపై మాత్రం ఆయన స్పష్టత ఇవ్వలేదు. మంచో చెడో…పొత్తు ఉందనో లేదనో చెబితే పార్టీ నేతలకు, కార్యకర్తలకు ఓ క్లారిటీ వస్తుంది. కానీ పవన్ మాత్రం మౌనంగా ఉంటున్నారు. పోనీ టీడీపీతో పొత్తు కుదిరిందనుకున్నా ఎక్కువ సీట్లు దక్కించుకోవాలంటే జనంలో తనకున్న పలుకుబడిని చూపించాలి కదా…? పొత్తు లేదనుకుంటే కొన్ని సీట్లైనా నెగ్గి తన పార్టీ సత్తా చాటాలి కదా…? కనీసం తానైనా నెగ్గాలి కదా…? మరి పవన్ ఎందుకు చిచ్చుబుడ్డిలా చెలరేగి వెంటనే ఎందుకు తుస్సుమంటున్నారన్నది సస్పెన్సే…
టీడీపీ, వైసీపీలకు బలమైన నేతలున్నారు… గ్రామగ్రామాన కార్యకర్తలున్నాయి. ఆర్థిక బలం, అంగ బలం ఉంది. కానీ జనసేనకు అవేం లేవు… అన్నిచోట్లా పోటీ చేయడానికి నేతలే లేరు. టికెట్ ఇస్తే గెలిచే నేతలు ఎందరో వేళ్లతో కూడా లెక్కపెట్టనక్కరలేదు. అలాంటప్పుడు కనీసం కొన్ని సీట్లైనా గెలవాలంటే ఎంత కసరత్తు చేయాలి…? మరి ఇవన్నీ పవన్‌కు తెలియవా…? లేక తెలిసే వేరే వ్యూహముందా..? ఆ మౌనం వెనక అర్థముంటే పర్లేదు… కానీ అది అర్థం లేనిదైతే ప్రజలకు ఏమీ అర్థం కాదని పవన్ అర్థం చేసుకోవాలి.