Donald Trump: డొనాల్డ్ ట్రంప్‌ అరెస్ట్ ఖాయమా..? అరెస్ట్ చేస్తే ఏమవుతుంది ?

నేరారోపణలు ఎదుర్కొన్నా.. నేరం చేసినా... చివరకు జైల్లో ఉన్నా సరే.. అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయవచ్చు, ప్రచారంలో పాల్గొనవచ్చు. పాలన కూడా చేయవచ్చు. సో ఈకేసులను అడ్డంపెట్టుకుని ట్రంప్ మరింత దూకుడుగా వెళ్తారేమో చూడాలి.

  • Written By:
  • Publish Date - March 31, 2023 / 03:59 PM IST

మరోసారి అమెరికా అధ్యక్ష బరిలో నిలిచి శ్వేతసౌధంలోకి రీ ఎంట్రీ ఇద్దామనుకుంటున్న మాజీ అధ్యక్షుడు రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. అధ్యక్ష ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే మిగిలి ఉన్న సమయంలో అనధికార ఆర్థిక లావాదేవీల వ్యవహారాలు ఆయన మెడకు చుట్టుకుంటున్నాయి. మాజీ అడల్ట్ స్టార్‌తో ఆయనకున్న సంబంధాలు , వాటిని కప్పిపుచ్చేందుకు ట్రంప్ చెల్లించిన ముడుపులు ఇప్పుడు అమెరికా పాలిటిక్స్ ‌ను షేక్ చేస్తున్నాయి. అమెరికా చరిత్రలో క్రిమినల్ చార్జెస్ ఎదుర్కొంటున్న మాజీ అధ్యక్షుడిగా ట్రంప్ నిలిచారు.
ఇంతకీ ట్రంప్ చేసిన తప్పేంటి ?
అమెరికా మాజీ అధ్యక్షుడిగా , బిజినెస్‌మెన్ గా మాత్రమే ట్రంప్ ప్రపంచానికి తెలుసు. కానీ ఆయనలో బయటకు కనిపించని షేడ్స్ చాలా ఉన్నాయి. 2006లో ట్రంప్‌ తనతో ఇల్లీగల్ ఎఫైర్ పెట్టుకున్నారని ఆరోపిస్తూ… 2016లో మాజీ అడల్ట్ స్టార్ స్టోమీ డానిల్స్ సంచలన ప్రకటన చేశారు. అంతేకాదు ట్రంప్‌ ఎఫైర్‌కు సంబంధించిన ఆధారాలను మీడియాకు అమ్మకానికి కూడా పెట్టారు. అయితే ఆమె నోరు మూయించేందుకు ట్రంప్ లాయర్ లక్షా 30 వేల డాలర్లను ఆమెకు చెల్లించారు. అయితే ఇందులో ఎలాంటి చట్ట వ్యతిరేక కార్యక్రమం లేదు. ఇందులో అమెరికా చట్టాల ప్రకారం ట్రంప్ ను తప్పుపట్టడానికి కూడా ఏమీలేదు. అయినా ట్రంప్ చిక్కుల్లో ఇరుక్కున్నారు. అదే అసలు కథ.
ట్రంప్ చేసిన నేరం ఇదే !
అడల్ట్ స్టార్ ‌కు లాయర్ చెల్లించిన డబ్బులను ట్రంప్ తిరిగిన ఆయనకు ఇచ్చేశారు. వీటిని లీగర్ ఛార్జీల కింద చూపించారు. న్యూయార్క్ చట్టాల ప్రకారం అదే క్రిమినల్ అఫెన్స్ గా మారింది. పైగా అడల్ట్ స్టార్ డానిల్స్ తో ఉన్న శారీరక సంబంధాన్ని కప్పి పుచ్చి ఓటర్లను మభ్యపెట్టారని ఆయనకు వ్యతిరేకంగా అభియోగాలు నమోదయ్యాయి. నేరం చేయడం కంటే నేరాన్ని కప్పిపుచ్చుకునేందుకు చేసే ఇతర నేరాలను అమెరికన్ న్యాయస్థానాలు చాలా సీరియస్ గా తీసుకుంటున్నాయి. రికార్డులను తారుమారు చేయడానికి సంబంధించి ఈ తరహా ఆర్థిక నేరాలను ట్రంప్ 30కి పైగా ఎదుర్కొంటున్నారు.
ట్రంప్‌కు బేడీలు వేస్తారా ?
ట్రంప్‌పై ఎలాంటి అభియోగాలు మోపారన్నది ప్రస్తుతానికి బయట ప్రపంచానికి తెలియదు. ట్రంప్ పై ఆరోపణల్లో వాస్తవాలు తేల్చేందుకు ఇప్పటికే గ్రాండ్ జ్యూరీని ఏర్పాటు చేశారు. ట్రంప్ స్వయంగా విచారణకు హాజరైతే ఏం జరుగుతుందన్నదే ప్రస్తుతానికి ఉత్కంఠగా మారింది. ట్రంప్ మాజీ అధ్యక్షుడు పైగా వ్యాపారవేత్త..అందుకే ఆయన మద్దతుదారుల నుంచి శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా న్యూయార్క్ పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకవేళ ఆయన విచారణకు హాజరైతే.. అన్ని రూల్స్ పాటిస్తారు. ఆయన ఫింగర్ ప్రింట్స్ నమోదు చేస్తారు. కేసు విచారణకు వచ్చినట్టు ఫోటో కూడా తీసుకుంటారు
ట్రంప్‌ ఎన్నికల్లో పోటీ చేయొచ్చా ?
ట్రంప్ పై ఇన్ని రకాల ఆరోపణలు ఉన్నా… మరోసారి యూఎస్ ప్రెసిడెంట్ గా మారాలన్న ఆయన ఆశలు మాత్రం సజీవంగానే ఉంటాయి. ఎందుకంటే నేరారోపణలు ఎదుర్కొన్నా.. నేరం చేసినా… చివరకు జైల్లో ఉన్నా సరే.. అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయవచ్చు, ప్రచారంలో పాల్గొనవచ్చు. పాలన కూడా చేయవచ్చు. సో ఈకేసులను అడ్డంపెట్టుకుని ట్రంప్ మరింత దూకుడుగా వెళ్తారేమో చూడాలి.