తెలంగాణలో బీఆర్‌ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రాజెక్ట్.. కాళేశ్వరం. ఈ ప్రాజెక్ట్‌పై ప్రతిపక్షాలు ఎన్ని ఆరోపణలు చేసినా పనులు మాత్రం ఆపలేదు అప్పటి ప్రభుత్వం. కానీ తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత.. కాళేశ్వరంలో భారీ అవినీతి జరిగిందని.. దీనిపై విచారణ జరిపేందుకు ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటు చేసింది కొత్త ప్రభుత్వం. ఇప్పటికే ఈ కమిషన్.. క్షేత్రస్థాయికి వెళ్లి దర్యాప్తు చేసి.. కీలక ఆధారాలను సేకరించింది. ఇప్పుడు మరింత లోతుగా దర్యాప్తు చేస్తోంది. ఇందులో భాగంగా.. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగమైన పలువురు ఐఏఎస్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారులను విచారించింది. ఈ క్రమంలోనే ప్రస్తుత తెలంగాణ ఫైనాన్స్ కమిషన్ మెంబర్ స్మితా సబర్వాల్‌ను విచారించింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నీటిపారుదల శాఖ ఇంఛార్జి కార్యదర్శిగానే కాకుండా.. ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో కీలకంగా వ్యవహరించారు స్మితా సబర్వాల్. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కార్యాలయంలో అదనపు కార్యదర్శిగా విధులు నిర్వర్తించారు.
సీఎంవో నుంచి నీటిపారుదల శాఖకు సంబంధించిన పనులను ఆమె పర్యవేక్షించారు. స్మితా సబర్వాల్ విచారణకు హాజరుకావటం ఇప్పుడు సర్వత్రా ప్రాధాన్యత సంతరించుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభం నుంచి ఇప్పటి వరకు నీటిపారుదల, ఆర్థిక శాఖలలో విధులు నిర్వహించిన అధికారుల నుంచి ప్రాజెక్టు పలు అంశాలపై వివరణ తీసుకుంది కమిషన్. అయితే కమిషన్ అడిగిన ప్రతీ ప్రశ్నకు దాదాపుగా నాకు తెలియదు అనే సమాధానాన్నే స్మితా సబర్వాల్ చెప్పినట్టు సమాచారం. గత ప్రభుత్వంలో తాను మొత్తం 7 శాఖలు పర్యవేక్షించానని.. తన ఉద్యోగానికి కూడా పరిధిలు ఉన్నాయంటూ చెప్పారు స్మిత. ప్రతీ విషయం సీఎం ఆదేశంతో.. ఆయన సంతకాలు పెట్టాకే ఫైల్ మూవ్ చేశామని చెప్పారు. స్మితా సబర్వాల్‌లో పాటు మరి కొందరు అధికారులను కూడా కమిషన్ ప్రశ్నించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే బయటికి వచ్చే అవకాశం ఉంది.