Telangana Elections : అహంకారమే అసలు సమస్య.. అస్సలు భరించలేమంటున్న జనం

తెలంగాణ (Telangana Elections) లో ఎన్నికల సమయంలో ఏ పల్లెకు వెళ్ళినా ఒకటే చర్చ నడుస్తోంది. గత తొమ్మిదిన్నరేళ్లలో తెలంగాణలో అసలు అభివృద్ధి ఏమీ జరగలేదని ఎవరూ అనలేరు. హైదరాబాద్ లో ఎక్కువగా.. గ్రామీణ ప్రాంతాల్లో కాస్త తక్కువగా అయినా.. ఎంతో కొంత డెవలప్ మెంట్ జరిగిన మాట వాస్తవం.

తెలంగాణ (Telangana Elections) లో ఎన్నికల సమయంలో ఏ పల్లెకు వెళ్ళినా ఒకటే చర్చ నడుస్తోంది. గత తొమ్మిదిన్నరేళ్లలో తెలంగాణలో అసలు అభివృద్ధి ఏమీ జరగలేదని ఎవరూ అనలేరు. హైదరాబాద్ లో ఎక్కువగా.. గ్రామీణ ప్రాంతాల్లో కాస్త తక్కువగా అయినా.. ఎంతో కొంత డెవలప్ మెంట్ జరిగిన మాట వాస్తవం. కానీ తెలంగాణ సమాజం జీర్ణించుకోలేని విషయం ఏంటంటే.. KCR కుటుంబం అహంకార ధోరణి. మొదటి నుంచి తెలంగాణ సమాజం పెత్తందారీ, భూస్వామ్య, నిజాం వ్యవస్థపై పోరాడిన సమాజం. అహంకార ధోరణిని ఇక్కడి జనం అస్సలు భరించలేదు. కానీ KCR ఆయన కుటుంబ సభ్యులు.. ఈ 10 ఏళ్లలో ప్రదర్శించిందే అది. అదే ఇప్పుడు తెలంగాణ ప్రజలకు మింగుడు పడటం లేదు. ఏ పల్లెకి వెళ్లినా.. పట్టణాలకు వెళ్ళి ప్రశ్నించినా జనం అందరిలోనూ ఇదే అభిప్రాయం కనిపిస్తోంది. వినిపిస్తోంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో కేసీఆర్ రాజరికపాలన అమలు చేశారన్నదే అందరి వాదన.

KCR సెక్రటేరియట్ కి రారు, ఫామ్ హౌస్ లోనే ఉంటారు.. ఎవర్నీ కలవరు.. ప్రజల సంగతేమో గానీ.. కనీసం ఎమ్మెల్యేలకే దిక్కులేదు. గతంలో ముఖ్యమంత్రి సెక్రటేరియట్ లో కనీసం రెండు గంటలు జనం అర్జీలు తీసుకోవడానికి టైమ్ కేటాయించేవారు. కానీ కేసీఆర్ వచ్చాక అలాంటి ఛాన్సే లేదు. పైగా కాబోయే ముఖ్యమంత్రిగా తన కుమారుడిని ప్రొజెక్ట్ చేసుకుంటారు. కుటుంబ సభ్యులందరికీ పదవులు ఇచ్చారు. విపరీతమైన అధికార దుర్వినియోగం.. ఆయన పెట్టిన జాతీయ పార్టీకి.. జనం సొమ్ముతో టూర్లు.. జనం సొమ్ముతోనే సభలు నిర్వహిస్తారు. ఆయన ఎవరికి చెబితే వాళ్ళకే పదవులు వస్తాయి. BRS పార్టీని మహారాష్ట్రలో అభివృద్ధి చేయడానికి తెలంగాణ ప్రభుత్వం సొమ్ముతో సలహాదారులను కూడా నియమించుకున్నారు. అంటే నేను ఏం చేసినా చెల్లుబాటు అవుతుందన్న ధీమా కనిపిస్తుంది.

రాష్ట్రంలో నిజాయతీగా పనిచేసే సివిల్స్, ఇతర అధికారులకు ఇబ్బందులు తప్పలేదు. ఆకునూరి మురళి, VK సింగ్, RS ప్రవీణ్ కుమార్ లాంటి అధికారులు తమ ఉద్యోగాలకు రాజీనామాలు చేయాల్సి వచ్చింది. ప్రముఖ జర్నలిస్టు రాజ్ దీప్ సర్దేశాయ్ చెప్పినట్లు… KCR కి మందులు ఇచ్చేవారు.. మందు పోసేవాడు.. భోజనం పెట్టే వాడిని రాజ్యసభ ఎంపీలు చేశాడు. కుటుంబంలో ప్రతి ఒక్కరి మీద అవినీతి ఆరోపణలు న్నాయి. వివిధ కంపెనీలకు వాటాలు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో షేర్లు, రియల్ ఎస్టేట్ సంస్థలతో చట్టా పట్టాలు వేసుకొని తిరుగుతారు. లిక్కర్ సిండికేట్ కేసులో కవితను అరెస్టు చేస్తే.. అది తెలంగాణ మహిళలను అవమానించినట్టే అంటారు. అంటే కవిత అవినీతికి పాల్పడితే తెలంగాణ మహిళలు అవినీతికి పాల్పడినట్లేనా? అసలు మద్యాన్ని నిషేధిస్తే మొట్టమొదట సంతోషించేది మహిళలే.. కానీ అలాంటి లిక్కర్ ను ప్రోత్సహించే కేసుల్లో ఇరుక్కున్న కవితకు తెలంగాణ మహిళలు ఎందుకు వత్తాసు పలకాలి. ఇదే ప్రశ్న జనంలో తిరుగుతోంది.

ప్రతిపక్ష నేతలు ఆరోపించినట్టు.. ధరణి లాంటి పోర్టల్ ను అడ్డం పెట్టుకొని సొంతంగా వేల కోట్ల ఆస్తులు కూడబెట్టడం.. సొంత ఛానల్స్, పత్రికలు.. వేల ఎకరాల సామ్రాజ్యం ఏర్పడ్డాయే తప్ప.. జనానికి ఒరిగిందేమీ లేదన్న చర్చ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతోంది.
KCR ఎలాంటి అహంకారం ప్రదర్శిస్తారో.. ఆ పార్టీకి చెందిన మంత్రులు, నాయకులు కూడా జనంపై అలాంటి అహంకార ధోరణే ప్రదర్శించారు. బాధితులు, లబ్దిదారులు.. కింది స్థాయి ఉద్యోగులపై చేయి చేసుకోవడం.. నోటికొచ్చినట్టు తిట్టడం లాంటి సంఘటనలు ఎన్నో జరిగాయి. ఆ పార్టీ ఎంపీలే చెబుతుంటారు.. తమ నాయకుడు.. ముఖ్యమంత్రిని ప్రత్యక్షంగా చూడటానికి.. కలుసుకోడానికి.. ఏడాది.. రెండేళ్ళు పట్టిందని.. తెలంగాణలో దొరలు, గడీల పాలనలో సరిగ్గా ఇలాంటి ధోరణే ఉండేదన్న విమర్శలున్నాయి. ఈ అహంకార ధోరణిని జనం జీర్ణించుకోలేకపోతున్నారు. రేపటి ఎన్నికల్లో BRS వ్యతిరేక ఫలితాన్ని చూడాల్సి వస్తే మాత్రం.. అందుకు ప్రధాన కారణం KCR అహంకార ధోరణే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు, ప్రతిపక్ష నేతలు.