PM MODI: ఇప్పుడు ఎక్కడ చూసినా “ముందస్తు” ముచ్చటే వినిపిస్తోంది. షెడ్యూల్ ప్రకారమైతే వచ్చే ఏడాది మేలో లోక్‌సభకు సార్వత్రిక ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే ఆ సమయానికి మూడు నెలల ముందే (ఫిబ్రవరిలోనే) పోల్స్ నగారా మోగించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందట. ఈ ఏడాది డిసెంబర్‌లో తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు, జనవరిలో మిజోరం రాష్ట్రానికి అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ఆ వెంటనే జమ్ము కశ్మీర్ ఎన్నికలు జరగనున్నాయి. ఇవి పూర్తి కాగానే సార్వత్రిక ఎన్నికలకు వెళ్లాలని మోడీ సేన యోచిస్తోందట. ఇందులో భాగంగా డిసెంబరులోనే లోక్‌సభను రద్దు చేసే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది.
ఇవీ సిగ్నల్స్..
ముందస్తు ఎన్నికలకు సంబంధించిన సిగ్నల్స్ ఇచ్చేలా ఉన్న పలు ఘటనలను ఇప్పుడు ఒకసారి పరిశీలిద్దాం..
* “ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలి” అని కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం సందర్భంగా బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ప్రధాని మోడీ సూచించారు.
* కేంద్రం ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉన్నట్టు తనకు సమాచారం ఉందని బిహార్ సీఎం నితీశ్‌కుమార్ గతనెలలో పాట్నాలో జరిగిన విపక్షాల భేటీలో చెప్పారు.
* రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ జనవరికల్లా పూర్తి కావాలని పశ్చిమ బెంగాల్ సీఎం మమతాబెనర్జీ అధికారులను ఆదేశించారు. ముందస్తు ఎన్నికలపై సమాచారం ఉండటం వల్లనే ఆమె ఈ ఆర్డర్స్ ఇచ్చి ఉంటారని తెలుస్తోంది.
“ఇండియా”కు ఇంకా టైం ఇవ్వొద్దని..
స్వయంగా ప్రధాని మోడీ ప్రచారం చేసినా కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ గెలవలేకపోయింది. అంతకుముందు హిమాచల్ ప్రదేశ్‌లో కూడా అలాగే జరిగింది. ఈ రెండు రాష్ట్రాల్లో గెలుపుతో కాంగ్రెస్‌లో జోష్ పెరిగింది. విపక్ష కూటమి “ఇండియా” బలోపేతం దిశగా ఇప్పుడు కాంగ్రెస్ చకచకా పావులు కదుపుతోంది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మమతా బెనర్జీలాంటి వాళ్లతోనూ చెయ్యి కలిపి ముందుకు సాగుతోంది. ఈ పరిణామాలు బీజేపీ జాతీయ నాయకత్వానికి ఆందోళన కలిగిస్తున్నాయి. అందుకే ఇటీవల బెంగళూరులో ఇండియా కూటమి రెండో సమావేశం జరుగుతుంటే.. అదే రోజు ఢిల్లీలో ప్రధాని మోడీ ఎన్డీఏ పార్టీల ఎంపీలతో సమావేశమయ్యారు. లోక్‌సభలో అసలు ప్రాతినిధ్యమే లేని 18 పార్టీల నేతలను కూడా దీనికి పిలవడం అధికార బీజేపీపై ఉన్న ఒత్తిడికి నిదర్శనం. ఇంకా ఎక్కువ టైం ఇస్తే “ఇండియా” కూటమి మరింత స్ట్రాంగ్ అవుతుందనే కలవరంలో మోడీ సర్కారు ఉంది. పరిస్థితులు పూర్తిగా చేయిదాటక ముందే.. ముందస్తు ఎన్నికలకు వెళ్లడం మంచిదనే ఉద్దేశంతో బీజేపీ జాతీయ నాయకత్వంలోని కొందరు ఉన్నారట. జనవరిలో మకర సంక్రాంతికి అయోధ్య రామాలయాన్ని ప్రారంభించిన వెంటనే ఎన్నికల నగారా మోగిస్తే బాగుంటుందని భావిస్తున్నారట. త్వరలో అసెంబ్లీ పోల్స్ జరిగే ఐదు రాష్ట్రాల్లోనూ బీజేపీ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయంటూ వెలువడుతున్న అంచనాలు కూడా మోడీ సేనను ముందస్తు దిశగా అడుగులు వేసేలా చేస్తున్నాయని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.