Telangana Elections: తెలంగాణలో షెడ్యూల్ ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ మేరకు ఎన్నికల సంఘం చకచకా ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. జమిలి ఎన్నికలకు అవకాశం లేదని తేలడంతో ఎన్నికల సంఘం అసెంబ్లీ ఎలక్షన్స్‌కు రంగం సిద్ధం చేస్తోంది. తాజా సమాచారం ప్రకారం నవంబర్ లేదా డిసెంబర్‌లో తెలంగాణ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించేందుకు కేంద్రం ఎన్నికల సంఘం అధికారులు వచ్చే నెలలో తెలంగాణలో పర్యటించబోతున్నారు.
వచ్చే నెల 3 నుంచి మూడు రోజులపాటు రాజీవ్ కుమార్‌తో పాటు కేంద్ర ఈసీ బృందం తెలంగాణలో పర్యటించనుంది. అదే రోజు జాతీయ పార్టీలు, గుర్తింపు పొందిన రాష్ట్ర పార్టీలతో ఎన్నికల సంఘం భేటీ అవుతుంది. అక్టోబర్ 4న జిల్లాల కలెక్టర్లు, సీపీలు, ఎస్పీలతో సమావేశం నిర్వహిస్తుంది. అక్టోబర్ 5న చీఫ్ సెక్రటరీ, డీజీపీలతో సమావేశం తరువాత ఎన్నికల సంఘం ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తారు. ఈ సమావేశంలో ఎన్నికల నిర్వహణ తీరుతెన్నులు, శాంతి భద్రతలు, ఇతర ఏర్పాట్ల గురించి సమీక్ష జరుపుతారు. ఈవీఎంల నిర్వహణపై ఈసీఐఎల్ అధికారులతో ఈసీ బృందం భేటీ కానుంది. ఈ భేటీల తర్వాత అక్టోబర్ 6న తెలంగాణ ఎన్నికలపై నివేదిక ఇవ్వనుంది. ఈ నివేదిక ఆధారంగా ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం ఉన్న అంచనా ప్రకారం.. అక్టోబర్ రెండో వారంలో తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ వెలువడొచ్చని తెలుస్తోంది. అక్టోబర్‌లో షెడ్యూల్ విడుదలైతే.. నవంబర్ చివర్లో లేదా డిసెంబర్‌లో ఎన్నికలు జరగొచ్చు.
కేంద్రం జమిలి ఎన్నికలకు సిద్ధమవుతోందన్న ప్రచారం నేపథ్యంలో తెలంగాణ ఎన్నికలు వాయిదా పడతాయని అందరూ భావించారు. మంత్రి కేటీఆర్ కూడా ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. దీంతో ఈసీ కూడా తన కార్యకలాపాల్ని కాస్త నెమ్మదించింది. అయితే, జమిలి ఎన్నికల నిర్వహణకు అవకాశం లేదని తేలడంతో కేంద్ర ఎన్నికల సంఘం మళ్లీ యాక్టివ్ అయింది. తెలంగాణలో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు నిర్వహించాలని డిసైడైంది. మరో నాలుగు రాష్ట్రాల్లో కూడా ఈ ఏడాది చివరిలోపు అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ఒకేసారి విడుదలవుతాయా.. లేదా అనేది తెలియాలి. తెలంగాణలో రాజకీయ పార్టీలు మాత్రం ఎన్నికలకు సిద్ధమయ్యాయి. బీఆర్ఎస్ ఇప్పటికే అభ్యర్థుల్ని ప్రకటించగా, బీజేపీ, కాంగ్రెస్ త్వరలోనే జాబితా ప్రకటించేందుకు రెడీ అవుతున్నాయి.