Kavitha: రేపు కవిత అరెస్ట్? విచారణకు రావాలని ఈడీ నోటీసులు

కవితకు ఈడీ నోటీసులు జారీ చేయడం, 10న అరెస్టుకు రావాలని ఆదేశించడంతో ఆమెను అరెస్టు చేయబోతున్నారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి.

  • Written By:
  • Updated On - March 8, 2023 / 09:15 AM IST

ఢిల్లీ లిక్కర్ కేసులో ఊహించినట్లే పరిణామాలు వేగంగా మారుతున్నాయి. నెక్స్ట్ అరెస్ట్ కవితదే అని వారం రోజులుగా మీడియాలో కథనాలు వస్తున్నాయి. రామచంద్ర పిళ్లై కూడా అరెస్ట్ కావడంతో కవిత అరెస్టు ఖాయమని అందరూ భావిస్తున్నారు. ఇప్పుడు అందుకు తగ్గట్టుగానే కవితకు ఈడీ నోటీసులు జారీ చేసింది. రేపు విచారణకు రావాలని ఆదేశించింది. విచారణ అనంతరం కవితను అరెస్టు చేస్తారని అనుకుంటున్నారు.

 

ఢిల్లీ లిక్కర్ కేసు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ కేసులో పలువురు తెలుగు వ్యక్తులు అరెస్ట్ అయ్యారు. శరత్ చంద్రా రెడ్డి, మాగుంట రాఘవ రెడ్డి, ఆడిటర్ బుచ్చిబాబు, వ్యాపారవేత్త రామచంద్ర పిళ్లై తదితరులు ఈ కేసులో అరెస్ట్ అయిన వారిలో ఉన్నారు. ఈ కేసులో వినిపిస్తున్న మరో ప్రముఖ పేరు కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత. ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపొందించడం మొదలు దాన్ని అమలు చేసే వరకూ సౌత్ గ్రూప్ కీలక పాత్ర పోషించిందనేది సీబీఐ, ఈడీ చెప్తున్న మాట. సౌత్ గ్రూపులో మాగుంట ఫ్యామిలీతో పాటు కవిత, శరత్ చంద్రా రెడ్డి పాత్రధారులని దర్యాప్తు సంస్థలు తేల్చాయి.

 

సౌత్ గ్రూపులో పాత్రధారులుగా ఉన్న వాళ్లు తాము లబ్ది పొందడం ద్వారా వచ్చిన మొత్తంలో వంద కోట్ల రూపాయలను ఆప్ నేతలకు అందేలా చూశారని దర్యాప్తు సంస్థలు తేల్చాయి. ఇందుకు బినోయ్ బాబు, ఆడిటర్ బుచ్చిబాబు, వ్యాపారవేత్త రామచంద్ర పిళ్లై తదితరులు సహకరించినట్లు గుర్తించాయి. ముఖ్యంగా రామచంద్ర పిళ్లై అకౌంట్ల నుంచి నగదు పలువురు వ్యక్తులకు ట్రాన్స్ ఫర్ అయినట్లు నిర్ధారించాయి. అందుకే తాజాగా రామచంద్ర పిళ్లైని అదుపులోకి తీసుకుంది ఈడీ. ఈడీ విచారణలో తాను ఎమ్మెల్సీ కవిత బినామీయేనని, ఆమె చెప్పినట్లే తాను నడుచుకున్నానని రామచంద్ర పిళ్లై అంగీకరించినట్లు ఛార్జ్ షీటులో పేర్కొంది. దీంతో కవిత చుట్టూ ఉచ్చు బిగుస్తోంది.

 

రామచంద్ర పిళ్లై ఛార్జ్ షీటులో పదేపదే కవిత పేరు వచ్చింది. పిళ్లై అప్రూవర్ గా మారారని తెలుస్తోంది. దీంతో కవిత అరెస్ట్ ఖాయమని అర్థమవుతోంది. ఇప్పుడు కవితకు ఈడీ నోటీసులు జారీ చేయడం, రేపు విచారణకు రావాలని ఆదేశించడంతో ఆమెను అరెస్టు చేయబోతున్నారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. మరి రేపు విచారణ తర్వాత ఏం జరుగుతుందనేది వేచి చూడాలి.