Assembly Elections: ఎన్నికలంటేనే కోట్లల్లో ఖర్చు. ఎంత డబ్బు ఖర్చు పెడితే అంత గెలిచే అవకాశాలుంటాయని అభ్యర్థుల నమ్మకం. అందుకే అక్రమంగా డబ్బు తెచ్చి ఖర్చుపెడుతుంటారు. అయితే, ఈ డబ్బు ప్రవాహాన్ని అడ్డుకునేందుకు ఎన్నికల సంఘం ప్రయత్నిస్తూనే ఉంటుంది. పోలీసుల ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించి, ఎన్నికల కోసం తరలించే డబ్బును స్వాధీనం చేసుకుంటూ ఉంటారు. అలా ఇప్పుడు కోట్ల రూపాయల డబ్బు తనిఖీల్లో పట్టుడింది. ఒకటీ.. రెండూ.. కాదు.. ఏకంగా రూ.1760 కోట్ల డబ్బు, మద్యం, డ్రగ్స్ వంటి వాటిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
LOCAL BOI NANI: నాని అరెస్ట్..? విశాఖ ప్రమాదం వెనక యూట్యూబర్ నాని.. అసలేం జరిగింది..?
ప్రస్తుతం ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో ఓటర్లకు ప్రలోభాలకు గురి చేయకుండా ఎన్నికల సంఘం పకడ్బందీ చర్యలు చేపట్టింది. ఆయా రాష్ట్రాల అధికారులు, పోలీసుల సమన్వయంతో విస్తృతంగా తనిఖీలు చేపడుతోంది. ఈ తనిఖీల్లో భారీగా అక్రమ నగదు, మద్యం, బంగారం వంటివి పట్టుబడ్డాయి. ఇప్పటివరకు మొత్తం రూ.1760 కోట్ల విలువైన అక్రమ నగదు, మద్యం, మాదక ద్రవ్యాలు, బహుమతులు, ఇతరత్రా సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. అక్టోబరు 9న ఎన్నికల తేదీలు ప్రకటించినప్పటి తనిఖీలు నిర్వహించారు. అప్పటినుంచి ఈ మొత్తాన్ని సీజ్ చేసినట్లు తెలిపింది. 2018లో ఈ రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి.
అప్పుడు స్వాధీనం చేసుకున్న దాంతో పోలిస్తే, ఇప్పుడు స్వాధీనం చేసుకున్న వాటి విలువ ఏడు రెట్లని పేర్కొంది. గత ఎన్నికల్లో రూ.239.15 కోట్లు పట్టుబడ్డాయి. ఈసారి రూ.1760 కోట్లు స్వాధీనం చేసుకున్నారుు. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే.. తెలంగాణలోనే అత్యధికంగా దాదాపు రూ.659 కోట్ల మేర స్వాధీనం చేసుకున్నట్లు వివరించింది. ఆ తర్వాత రాజస్థాన్‌లో రూ.650.7 కోట్లు, మధ్యప్రదేశ్‌లో రూ.323.7 కోట్లు, ఛత్తీస్‌గఢ్‌లో రూ.76.9 కోట్లు సీజ్ చేశారు. మిజోరంలో మాత్రం ఎలాంటి నగదు దొరకలేదు. కానీ రూ.29.82 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నామని పేర్కొంది. తాజా ఎన్నికల షెడ్యూల్‌లో భాగంగా ఇప్పటికే ఛత్తీస్‌గఢ్, మిజోరం, మధ్యప్రదేశ్‌లో పోలింగ్ ముగిసింది. ఈ నెల 25న రాజస్థాన్‌లో, 30న తెలంగాణలో ఎన్నికలు జరగాల్సి ఉంది.
ALLU ARJUN: ఏపీ సీఎం జగన్‌కు స్టైలిష్ స్టార్ ఝలక్..!
తెలంగాణలో సీజ్ చేసిన నగదు మొత్తంలో రూ.225.23 కోట్ల నగదు రూపంలో ఉండగా, రూ.86.82 కోట్ల విలువైన మద్యం, రూ.103.74 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలు, రూ.191.02 కోట్ల విలువైన బంగారం, వెండి, ఆభరణాలు, రూ.52.41 కోట్ల విలువైన ఉచితంగా పంపిణీ చేసేందుకు సిద్ధం చేసిన వస్తువులు ఉన్నాయి. ఎన్నికలకు ఇంకా గడువు ఉండటంతో స్వాధీనం చేసుకునే నగదు ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.