TELANGANA: తెలంగాణలో ఎన్నికల పోరు మరింత వేడెక్కబోతుంది. రాష్ట్రంలో ఇప్పటికే ఎలక్షన్ ఫీవర్ కనిపిస్తుండగా.. ఎలక్షన్ కమిషన్ అధికారుల రాకతో రాష్ట్రం పూర్తిగా ఎన్నికల మూడ్‌లోకి వెళ్లబోతుంది. అక్టోబర్ 3, మంగళవారం నుంచి మూడు రోజులపాటు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు తెలంగాణలో పర్యటించబోతున్నారు. తెలంగాణలోని వివిధ విభాగాల అధికారులతో చర్చించిన అనంతరం ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఒక్కసారి షెడ్యూల్ విడుదలైతే అన్ని రాజకీయ పార్టీలు, నేతలు పూర్తిగా ఎన్నికల ప్రచారంలోకి దిగుతారు.
ఇప్పటికే తెలంగాణలోని మంత్రులు రాష్ట్రమంతా పర్యటిస్తున్నారు. తమ పరిధిలోని ప్రాంతాల్లో పాగా వేసి ఎన్నికల కోసం సిద్ధమవుతున్నారు. అటు కాంగ్రెస్, మరోవైపు బీజేపీ కూడా వ్యూహ రచనలో నిమగ్నమై ఉంది. సీఎం కేసీఆర్ స్వల్ప అనారోగ్యంతో ఉండటంతో ప్రస్తుతం ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే, మంత్రులు కేటీఆర్, హరీష్ రావు మాత్రం తెలంగాణవ్యాప్తంగా వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తూ పార్టీని జనంలోకి తీసుకెళ్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా హెలికాప్టర్‌తో సుడిగాలి పర్యటనలతో పార్టీలో జోష్ తెస్తున్నారు. మరోవైపు కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా పొలిటికల్ టూర్లు వేస్తున్నారు. తన పార్లమెంట్ నియోజకవర్గమైన నిజామాబాద్‌లో కవిత పర్యటిస్తున్నారు. అలాగే బీఆర్ఎస్‌కు పట్టుందని భావిస్తున్న సింగరేణి బెల్ట్‌ను కవర్ చేస్తున్నారు.
నియోజకవర్గాల్లోనే నేతలు
ఎన్నికల సమయం కావడంతో ఎప్పుడూ లేనిది ఎమ్మెల్యేలు, మంత్రులంతా సొంత నియోజకవర్గంలోనే ఉంటున్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల నుంచి స్థానిక సమస్యలు తెలుసుకుంటూ, కొన్నింటిని పరిష్కరిస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే మిగతా హామీల్ని నెరవేరుస్తామని, సమస్యల్ని పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు. ఎప్పుడూ హైదరాబాద్‌లోనే ఉండే నేతలు.. ఈసారి మాత్రం సిటీ వంక పెద్దగా కన్నెత్తి చూడటం లేదు. పార్టీ పెద్దల నుంచి వచ్చిన సూచనలతో నియోజకవర్గానికే పరిమితమయ్యారు. నేతల బుజ్జగింపులు, పర్యటనలతో హడావిడి చేస్తున్నారు.
కాంగ్రెస్, బీజేపీ కూడా సిద్దం
అధికార బీఆర్ఎస్ ఇప్పటికే తమ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా విడుదల చేసింది. కాంగ్రెస్, బీజేపీ కూడా త్వరలోనే లిస్టు రెడీ చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే కొంతమంది ఎంపిక పూర్తైనప్పటికీ.. తమ పార్టీలో చేరికలుంటాయే ఆశతో కాంగ్రెస్ జాబితా విడుదలు ఆలస్యం చేస్తోంది. సర్వేల ఆధారంగా కూడా కాంగ్రెస్ టిక్కెట్లు కేటాయించబోతుంది. మరోవైపు బీజేపీలో ఎవరు పార్టీలో ఉంటారో.. ఎవరు వీడుతారో తెలియని పరిస్థితి. దీంతో ఈ పార్టీ కూడా లిస్టు ఇంకా ప్రకటించలేదు. ఈ నెల రెండవ వారంలో జాబితా విడుదల చేయాలని బిజెపి భావిస్తోంది. ఆదివారం మహబూబ్ నగర్‌లో రూ.1350 కోట్ల ప్రాజెక్టులకు ప్రధాని మోడీ శంకుస్థాపన చేయడం ఆ పార్టీకి కొంత ఊరటనిచ్చింది. పసుపు బోర్డ్ ఏర్పాటు, రూ.900కోట్లతో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు వంటివి ఆ పార్టీకి కలిసొచ్చే అంశాలు. అయితే, కొందరు నేతలు బీజేపీని వీడబోతున్నారనే ప్రచారం ఆ పార్టీలో కలవరం రేపుతోంది. ఇక కాంగ్రెస్ మాత్రం ఇతర పార్టీల చేరికతో జోష్‌లోనే ఉంది. బీఆర్ఎస్‌కు పోటీ ఇవ్వబోయేది కాంగ్రెస్సే.
తెలంగాణపై మోదీ ఫోకస్..
ఆదివారమే తెలంగాణలో పర్యటించిన ప్రధాని మోదీ.. రెండు రోజుల వ్యవధిలోనే మరోసారి తెలంగాణలో పర్యటించబోతున్నారు. మంగళవారం నిజామాబాద్‌లో మోదీ పర్యటిస్తారు. నిజామాబాద్ రైతుల డిమాండ్ అయిన.. పసుపు బోర్డ్ ఏర్పాటుతో ఇక్కడి రైతులు, ప్రజల్లో బీజేపీ, మోదీపై సానుకూలత పెరిగింది. అందుకే మోదీ సభను ధన్యవాద సభగా పిలుస్తున్నారు. మొదట దీనికి ఇందూరు జనగర్జన పేరు పెట్టారు. నిజామాబాద్‌లో మోదీ రెండు గంటలపాటు పర్యటిస్తారు. తెలంగాణలో రూ.6 వేల కోట్లతో ఎన్టీపీసీ నిర్మించిన 800 మెగావాట్ల విద్యుత్తు ప్రాజెక్టును ఇందూర్ వేదికగా ప్రధాని మోదీ జాతికి అంకితం చేస్తారు. పలు పవర్, హెల్త్, రైల్వే ప్రాజక్టులకు మోదీ శంకుస్థాపన చేస్తారు.1369కోట్లతో నిర్మించిన హెల్త్ సెంటర్స్‌కు మోదీ భూమిపూజ చేస్తారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారు. మోదీ తర్వాత వారం రోజుల్లోనే అమిత్ షా కూడా తెలంగాణలో పర్యటిస్తారు. దీంతో వరుస పర్యటనల ద్వారా పార్టీలో జోష్ నింపాలని బీజేపీ భావిస్తోంది.