Vladimir Putin: రష్యాలో అంతర్యుద్ధం తప్పదా..? అసలు సంక్షోభమంతా ముందుందా ?

రానురాను పరిస్థితులెందుకో పుతిన్‌కు వ్యతిరేకంగా మారుతున్నట్టు కనిపిస్తున్నాయి. ఉక్రెయిన్‌పై దురాక్రమణ తర్వాత పశ్చిమ దేశాల ఆగ్రహానికి గురైన పుతిన్‌కు ప్రస్తుతం సొంత దేశంలోనే వ్యతిరేకత పెరుగుతోంది.

  • Written By:
  • Publish Date - June 26, 2023 / 09:49 AM IST

Vladimir Putin: రష్యా అంటే పుతిన్.. పుతిన్ అంటేనే రష్యా.. రెండు దశాబ్దాలకు పైగా రష్యాలో ఆయన ఆడిందే ఆట.. పాటిందే పాట. 2000 సంవత్సరంలో అధికారంలోకి వచ్చినపట్టి నుంచి రష్యా రాజకీయం మొత్తం ఆయన కనుసన్నల్లోనే జరుగుతోంది. దేశానికి శాశ్వత అధ్యక్షుడిగా ఉండేందుకు రాజ్యాంగాన్ని కూడా మార్చేసిన చరిత్ర ఆయనది. పుతిన్ విధానాలను ఎవరైనా ప్రశ్నించినా.. వ్యతిరేకించినా.. వాళ్లు ఏదేశంలో తలదాచుకున్నా.. వాళ్లు శవాలుగా మారిపోతారు. ఇది పుతిన్ పాలనలో బహిరంగంగా కనిపిస్తున్న సత్యం. కానీ రానురాను పరిస్థితులెందుకో పుతిన్‌కు వ్యతిరేకంగా మారుతున్నట్టు కనిపిస్తున్నాయి. ఉక్రెయిన్‌పై దురాక్రమణ తర్వాత పశ్చిమ దేశాల ఆగ్రహానికి గురైన పుతిన్‌కు ప్రస్తుతం సొంత దేశంలోనే వ్యతిరేకత పెరుగుతోంది.
వాగ్నర్ ప్రిగోజిన్ తిరుగుబాటు దేనికి సంకేతం ?
చిన్నతనంలో చిల్లర దొంగతనాలు చేసి జైలుకెళ్లొచ్చిన వ్యక్తి ప్రిగోజిన్. ఆ తర్వాత కాలంలో రష్యాలో రెస్టారెంట్లను ఏర్పాటు చేసి ధనికుడిగా మారాడు. పుతిన్‌కు స్వయంగా వండి వార్చాడు. పుతిన్ ఆదేశాలతోనే వాగ్నర్ గ్రూపు బాధ్యతలు తీసుకున్నాడు. అలాంటిది తను పుతిన్‌పైనే తిరుగుబాటు చేస్తారని ఎవరైనా ఊహించగలరా..? వాగ్నర్ గ్రూప్ అనే కిరాయి సైనికుల ముఠా పుట్టుకకు, ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఆ కిరాయి సైనికులు సృష్టిస్తున్న అరాచకాలకు పరోక్షంగా కారణమైన పుతిన్‌పైనే ప్రిగోజిన్ ఎందుకు తిరుగుబాటు చేయాల్సి వచ్చింది..? బెలారస్ అధ్యక్షుడి జోక్యంతో ప్రిగోజిన్.. మాస్కోపై దండయాత్రను విరమించుకుని.. ప్రస్తుతానికి శాంతించవచ్చు. కానీ పుతిన్ ఆధ్వర్యంలో రష్యా భవిష్యత్తు మాత్రం అంతర్యుద్ధానికి దారితీసే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
పుతిన్‌కు ముందున్నదంతా ముసళ్ల పండగేనా ?
వాగ్నర్ అధినేత ప్రిగోజిన్ తిరుగుబాటు చేసిన తర్వాత రష్యాలో కొన్ని ఆసక్తికర దృశ్యాలు కనిపించాయి. ప్రిగోజిన్‌తో కలిసి రోస్తోవ్ వైపుగా కదులుతున్న ఆయన కిరాయి సైన్యాన్ని చూసి రష్యన్లు ఎగిరి గంతేశారు. చీర్స్ చెబుతూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. కిరాయి మూకలు దేశంపై తిరుగుబాటు చేస్తే ఏ దేశంలోనైనా ఇలాంటి స్పందన రాదు. దేశాధ్యక్షుడు పుతిన్‌పై ఎంత వ్యతిరేకత ఉన్నా.. కిరాయి మూకలకు ఎవరూ మద్దతు పలకరు. కానీ రోస్తోవ్‌లో చాలా మంది ప్రిగోజన్ చేసిన తిరుగుబాటును స్వాగతించారు. పుతిన్ పీడ విరగడైంది అన్నట్టు ప్రిజోజిన్‌కు విక్టరీ సింబల్ చూపించారు. సాటి రష్యన్లు ఎందుకిలా చేశారు..? రష్యాతో పాటు ప్రపంచంలోనే శక్తివంత నేతగా అధికారాన్ని చలాయిస్తున్న వ్లాదిమిర్ పుతిన్‌కు గట్టుకాలం రాబోతోంది అనడానికి ఇదే సంకేతమా ?
ప్రిగోజిన్‌కు పుతిన్‌తో ఎందుకు చెడింది..?
వాస్తవానికి పుతిన్ గీత గీస్తే దాన్ని దాటే రకం కాదు ప్రిగోజిన్. పుతిన్ కోసం, ఆయన ప్రయోజనాల కోసం ఎంతకైనా తెగించే మనిషి ప్రిగోజిన్. సూడాన్ సహా అనేక ఆఫ్రికా దేశాల్లో సహజవనరులను దోచి, పుతిన్ కోసం వాటిని రష్యా తరలిస్తోంది వాగ్నర్ గ్రూప్. 2014 ముందు వరకు ఇలాంటి ఒక కిరాయి సైనికుల ముఠా రష్యా నుంచి పని చేస్తుందని ఎవరికీ తెలయదు. ఉక్రెయిన్‌లో భాగంగా ఉండే క్రిమియాపై రష్యా దురాక్రమణకు దిగితే, రష్యా సైన్యానికి అన్ని రకాలుగా అండదండలుగా ఉండి ఆ ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేసింది వాగ్నర్ గ్రూప్. అప్పటి నుంచే ప్రిగోజిన్ వ్యవహారాలు బయటకు రావడం మొదలు పెట్టాయి. పుతిన్‌కు షాడోగా వ్యవహరిస్తున్న ప్రిగోజిన్, గతేడాది రష్యా.. ఉక్రెయిన్‌పై దురాక్రమణకు దిగడంలోనూ కీలక పాత్ర పోషించారు. ఒకప్పుడు ఐదు వేల సైన్యం మాత్రమే వాగ్నర్ గ్రూప్ పరిధిలో ఉండేది. మాజీ సైనికులను, మాజీ ఖైదీలను, యుద్ధాన్ని ఆశ్వాదించే కరుడుగట్టిన నేరస్తులను సైనికులుగా రిక్రూట్ చేసుకున్న ప్రిగోజిన్.. తన ప్రైవేట్ సైనిక బలాన్ని 50 వేలకు పెంచుకున్నారు. ఉక్రెయిన్‌లో కీలక నగరాలను రష్యా ఆక్రమించుకోవడంలో ఈ సైన్యమే ముందుంది. అయితే యుద్ధం సవ్యంగా సాగడం లేదని, రష్యా సైన్యం క్షేత్రస్థాయిలో ఉక్రెయిన్ సైన్యాన్ని సరిగా నిలువరించలేకపోతోందని ప్రిగోజిన్ ఎప్పటి నుంచో ఆరోపిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా రష్యా రక్షణశాఖ మంత్రిపై ఆయన మాటలు ఎక్కుపెట్టారు. ఆయన ఆధ్వర్యంలో రష్యా సైనికులు రోగ్స్‌గా తయారయ్యారని ఆరోపిస్తున్నారు. అంతేకాదు.. ఉక్రెయిన్ దళాలు వాగ్నర్ సైన్యంపై దాడులు చేస్తున్నా రష్యా సైనికులు వాటిని నిలువరించలేకపోయారన్నది ఆయన ప్రధాన ఆరోపణ. రష్యా డిఫెన్స్ మినిస్టర్‌తో పాటు సైనిక నాయకత్వాన్ని మార్చితే తప్ప ఉక్రెయిన్ పై పూర్తి స్థాయి విజయం సాధించలేమని ప్రిగోజిన్ నమ్ముతున్నారు. పుతిన్ కూడా చేతగాని స్థితిలో ఉన్నారని భావిస్తున్న ప్రిగోజిన్ చివరకు తిరుగుబాటు మొదలుపెట్టారు. ప్రత్యర్థుల రక్తాన్ని కళ్ల చూడటానికి అలవాటు పడిపోయిన వాగ్నర్ సైన్యం అవసరమైతే సొంత దేశంపైనా తిరుగుబాటు చేసే స్థాయికి ఎదిగిపోయారు. అందుకే పుతిన్ కూడా దీన్ని నమ్మక ద్రోహంగా చెప్పుకుంటున్నారు
రానున్న రోజుల్లో ఏం జరగబోతోంది..?
తాత్కాలికంగా మాస్కోపై దండయాత్రను ప్రిగోజిన్ విరమించుకున్నా ఆయన తదుపరి వ్యూహాలు ఎలా ఉంటాయన్నది ఎవరికీ అంతుపట్టడం లేదు. వాగ్నర్ గ్రూప్ పరిధిలో ఉన్న కిరాయి సైన్యానికి విధివిధానాలు అంటూ ఏమీ లేవు. ప్రిగోజన్ ఆదేశిస్తే చాలు.. వాళ్లు ఎంతకైనా తెగిస్తారు. ఉక్రెయిన్‌తో సుధీర్ఘంగా యుద్ధాన్ని కొనసాగిస్తున్న పుతిన్ ముందు అన్నీ ముళ్లదారులే ఉన్నాయి. పూర్తిస్థాయిలో ఉక్రెయిన్‌ను ఆక్రమించుకోవాలన్న పుతిన్ వ్యూహలు ఇప్పటికీ అమలు కాలేదు. పశ్చిమ దేశాల మద్దతుతో జెలెన్‍‌స్కీ గట్టిగానే ఫైట్ చేస్తున్నారు. పుతిన్ ఉక్రెయిన్‌పై మొదలు పెట్టిన యుద్ధం చివరకు రష్యా భవిష్యత్తుకే ప్రమాదకరంగా మారినా ఆశ్చర్యపడాల్సింది ఉండదు. 16 నెలలుగా కొనసాగుతున్న యుద్ధం పుతిన్ ఇమేజ్‌ను ఇప్పటికే దారుణంగా దెబ్బతీసింది. వేలాది మంది సైనికులు ఇప్పటికే పుతిన్ యుద్ధకాంక్షకు బలైపోయారు. ఇంతకాలం పుతిన్‌కు వ్యతిరేకంగా నోరెత్తని ప్రజలు, నేతలు కూడా ఒక్కొక్కరుగా నిరసన గళం వినిపిస్తున్నారు. ఉక్రయిన్‌తో యుద్ధాన్ని కొనసాగిస్తూ.. వాగ్నర్ గ్రూప్‌ నుంచి ఎదురయ్యే సవాళ్లను తప్పించుకోవడం పుతిన్‌కు కత్తిమీదసామే. ప్రిగోజిన్ ఏం చేయబోతున్నారు అన్నది కూడా పుతిన్ భవిష్యత్తును నిర్ణయించబోతోంది. తిరుగుబాటు ప్రభావం ప్రస్తుతానికి లేకపోయి ఉండొచ్చు. కానీ భవిష్యత్తు పరిణామాలు మాత్రం తీవ్రంగానే ఉండబోతున్నాయి.