Etala Rajender : అయోమయంలో ఈటల రాజేందర్ .. ఎటు పోవాలి.. ? ఏం చేయాలి.. ?

ఈటల రాజేందర్. నిన్న మొన్నటిదాకా ఆయన సంచలనం.. ఏం చేస్తారు? అడుగులు ఎటువైపు పడుతున్నాయంటూ ఎప్పటికప్పుడు ఆరాలు తీసేవి రాజకీయ వర్గాలు పార్టీ మారినా ఏ మాత్రం పట్టు తగ్గకుండా రాజకీయం చేశారు. కానీ.. ఇప్పుడు సీన్‌ సితారైంది. రేపు ఎటు తెలియని అయోమయం లో పడ్డారు.

 

ఈటల రాజేందర్. నిన్న మొన్నటిదాకా ఆయన సంచలనం.. ఏం చేస్తారు? అడుగులు ఎటువైపు పడుతున్నాయంటూ ఎప్పటికప్పుడు ఆరాలు తీసేవి రాజకీయ వర్గాలు పార్టీ మారినా ఏ మాత్రం పట్టు తగ్గకుండా రాజకీయం చేశారు. కానీ.. ఇప్పుడు సీన్‌ సితారైంది. రేపు ఎటు తెలియని అయోమయం లో పడ్డారు.

ఈటల రాజేందర్. ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సీనియర్ లీడర్‌ ఆయన. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని హుజురాబాద్ నుంచి నాలుగు సాధారణ, మూడు ఉప ఎన్నికల్లో విజయం సాధించారాయన. బీఆర్‌ఎస్‌ నుంచి బీజేపీలో చేరి పార్టీ పరంగా కీలక పదవి దక్కించుకున్నారు. ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా హుజూరాబాద్‌తోపాటు కేసీఆర్‌ మీద గజ్వేల్‌లోనూ పోటీ చేసి రెండు చోట్లా ఓడిపోయారు ఈటల. దీంతో ఆయన రాజకీయ భవిష్యత్‌పై ఆసక్తికరమైన చర్చ మొదలైంది. రాజకీయాల్లో హత్యలుండవు.. ఆత్మహత్యలే ఉంటాయని పదే పదే అనుచరులతో అంటుంటారట ఈటల. ఆ డైలాగ్‌ ఇప్పుడు సరిగ్గా ఆయనకే సరిపోతుందా అన్న మాటలు కూడా వినిపిస్తున్నాయి.

మంత్రిగా ఉన్నప్పుడైనా, బీజేపీలో చేరిన తర్వాత అయినా హుజురాబాద్ దాటిన సందర్భాలు చాలా తక్కువ. ఈసారి నియోజకవర్గంలో అనూహ్యంగా కాంగ్రెస్ పుంజుకోవడం తనకు ప్లస్‌ అవుతుందని వేసిన అంచనాలు కూడా తప్పినట్టు తెలిసింది. తన అడ్డా అయిన హుజూరాబాద్‌ లోనే గట్టి పోటీ ఉందని తెలిసినా.. ఓవర్‌ కాన్ఫిడెన్స్‌తో ఆ సంగతి పట్టించుకోకుండా.. గజ్వేల్‌ లో కూడా పోటీ చేయడంతో ఎక్కడా పూర్తి సమయం కేటాయించలేక రెంటికి చెడ్డ రేవడిలా మారిపోయారని అంటున్నారు. దీంతో ప్రస్తుతం పార్టీలోనూ దాదాపు ఒంటరయ్యారట ఆయన. ప్రచార కమిటీ చైర్మన్‌గా ఉండటం, ఆశించిన ఫలితాలు రాకపోవడంతో పార్టీలో కూడా ఈటల గ్రాఫ్ తగ్గిందనే ప్రచారం మొదలైంది. ఓటమి తర్వాత జిల్లాలో ఆయన పెద్దగా సహకారం లభించడం లేదన్న టాక్‌ వినిపిస్తోంది. మరోవైపు ఎంపీ బండి సంజయ్‌కి తిరిగి పార్టీ తెలంగాణ పగ్గాలు అప్పగిస్తారన్న వార్తలు కూడా కలవర పెడుతున్నాయట.

వీటి నుంచి బయటపడటానికే.. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి తాను పోటీ చేస్తాననే సంకేతాలు ఇస్తున్నట్టు తెలిసింది. తాను ఎంపీ టికెట్ రేసులో ఉంటే బండికి చెక్‌ పెట్టినట్టవుతుందని భావిస్తున్నారట రాజేందర్‌. అయితే సంజయ్‌ అనుచరులు మాత్రం పార్టీ అధ్యక్ష పదవి కంటే కరీంనగర్ ఎంపీ సీట్ ముఖ్యమని ఆయన మీద వత్తిడి చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఎన్నికలకు ముందు అధ్యక్ష పదవి మారడానికి కారణమైన వారిలో ఈటల కూడా ఉండటంతో ఎట్టి పరిస్థితుల్లో కరీంనగర్‌ ఎంపీ సీట్లో ఆయన ఉనికిని సహించేది లేదంటున్నారట. బండిని కాదని టికెట్ ఇస్తే పార్టీ క్యాడర్‌ నుంచి ఆశించిన సహకారం ఉండదని అంతర్గత సమావేశాల్లో తేల్చి చెప్పడంతో సెకండ్ థాట్‌లో ఉన్నారట మాజీ మంత్రి. అయితే కరీంనగర్ లేదంటే జహీరాబాద్ ఎంపీ సీట్ అడగాలని అనుకుంటున్నట్టు తెలిసింది.

ఆ సీట్ పరిధిలో ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్స్‌లో బీజేపీకి మంచి ఓటింగ్ లభించిందని లెక్కలేసుకుంటున్నారట ఆయన. మొత్తంగా పోటీ చేసిన రెండు స్థానాల్లో ఓటమి, పార్టీలో సీనియర్ల నుంచి సహాయ నిరాకరణ, బీజేపీతో తప్ప సంఘ్ పరివార్‌తో సంబంధాలు లేకపోవడం రాజేందర్‌కు మైనస్‌ అవుతాయని అంచనా వేస్తున్నాయి రాజకీయ వర్గాలు. అలా చూసుకుంటే పార్టీలో ఆయన సుప్త చేతనావస్థకు చేరుతారనే ప్రచారం జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో ఎంపీ టిక్కెట్‌ ఇస్తారా? ఒకవేళ తెచ్చుకున్నా.. పరిస్థితులు సహకరిస్తాయా అన్న అనుమానాలు మాత్రం అలాగే ఉన్నాయి.