Etela Rajender: బీజేపీలోకి వెళ్లబోయే 22మంది నేతలు ఎవరు..?

దాదాపు 22మంది నేతలు తమతో టచ్‌లో ఉన్నారని.. ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా సంచలనంగా మారాయి. అందులో కొందరు అమిత్ షా పర్యటనలో చేరుతారని.. ఇంకొందరు ఇతర ఢిల్లీ పెద్దల సమక్షంలో చేరుతారని చెప్పారు.

  • Written By:
  • Publish Date - August 18, 2023 / 06:59 PM IST

Etela Rajender: తెలంగాణలో త్వరలో అమిత్ షా పర్యటించబోతున్నారు. ఆయన టూర్‌కు ముందే.. రాజకీయాల్లో బిగ్ సౌండ్‌ వచ్చేలా కమలం పార్టీ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. వేర్వేరు పార్టీలకు చెందిన కీలక నేతలను చేర్చుకోవాలని బీజేపీ చూస్తోంది. అమిత్‌ షా ఈనెల 27న ఖమ్మంలో పర్యటించనున్నారు. ఆయన రాకకు ముందే బీజేపీ భారీ యాక్షన్ ప్లాన్‌కు తెరదీసింది.

దాదాపు 22మంది నేతలు తమతో టచ్‌లో ఉన్నారని.. ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా సంచలనంగా మారాయి. అందులో కొందరు అమిత్ షా పర్యటనలో చేరుతారని.. ఇంకొందరు ఇతర ఢిల్లీ పెద్దల సమక్షంలో చేరుతారని చెప్పారు. మరికొందరితో సంప్రదింపులు జరుపుతున్నట్లుగా వివరించారు. ఈటల చేసిన వ్యాఖ్యలు రాజకీయ ప్రకంపనలు రేపుతున్నాయి. దీంతో ఆ 22మంది ఎవరు అన్న దానిపై కొత్త చర్చ మొదలైంది. అదే నిజం అయితే.. కర్ణాటక ఎన్నికల తర్వాత డీలా పడిన కాషాయ పార్టీకి ఈ చేరికలు భారీ బూస్టింగ్ ఇవ్వడం ఖాయం. ఐతే ఇన్నిరోజులు బీజేపీ చేరికల కమిటీ సైలెంట్‌గా ఉందని భావించారు. ఐతే ఆ అంచనాలను ఈటల వ్యాఖ్యలు తలకిందులు చేశాయి. చాపకింద నీరుగా ఆ కమిటీ జాయినింగ్స్ పై సీక్రెట్ ఆపరేషన్ మొదలు పెట్టిందని తెలుస్తోంది. నేతల పేర్లను ఏ మాత్రం రివీల్ చేయకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది.

ఇప్పటికే సినీ నటి జయసుధ, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్, మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డి, మాజీ డీసీసీబీ చైర్మన్ లక్ష్మా రెడ్డి, జహీరాబాద్ నియోజకవర్గానికి చెందిన మాజీ డీసీసీబీ చైర్మన్ జైపాల్ రెడ్డి, చెన్నూరు మాజీ ఎమ్మెల్యే సంజీవరావుతో పాటు బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి, ఆమె భర్త మాజీ మున్సిపల్ చైర్మన్ రాజేశ్వర్ కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. వారితో పాటు ఇంకొందరు నేతలను కూడా పార్టీలోకి చేర్చుకునేందుకు ప్రయత్నాలను బీజేపీ ముమ్మరం చేసింది. వాళ్లే కాకుండా మరో 22 మంది నేతలు తమతో టచ్‌లో ఉన్నారని చెప్పడం చర్చనీయాంశమైంది. ఐతే ఆ 22మంది ఎవరనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యేతో పాటు, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే ఒకరు కాషాయతీర్థం పుచ్చుకుంటారని సమాచారం. అయితే పేర్లు లీక్ అయితే ప్రత్యర్థి పార్టీలు జాగ్రత్త పడుతాయని భావించి.. పేర్లు రివీల్ చేయకుండా పార్టీ రహస్యంగా పని కానిచ్చేస్తోందని తెలుస్తోంది.