KCR Vs Etela: కేసీఆర్ మీద ఈటల.. కేటీఆర్‌పై బండి.. అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ భారీ ప్లాన్..!

ఒకట్రెండు రోజుల్లో ఈ లిస్ట్‌ రిలీజ్ చేయబోతోంది. తొలి జాబితాలో గజ్వేల్‌లో సీఎం కేసీఆర్‌పై హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటలను పోటీకి దింపాలని నిర్ణయించింది. కేసీఆర్ గజ్వేల్‌లోనూ పోటీ చేస్తుండడంతో వచ్చే ఎన్నికల్లో అక్కడి నుంచి పోటీ చేసేందుకు ఈటల ఆసక్తితో ఉన్నారు.

  • Written By:
  • Publish Date - September 1, 2023 / 01:49 PM IST

KCR Vs Etela: తెలంగాణలో ఎన్నికల యుద్ధం తారస్థాయికి చేరింది. అభ్యర్థుల జాబితా విడుదల చేసిన చేసిన కేసీఆర్‌.. రాజకీయ మంటలను రగిలిస్తే.. ఆ మంటలకు మరింత ఆజ్యం పోసేందుకు బీజేపీ, కాంగ్రెస్ సిద్ధం అవుతున్నాయి. బీఆర్ఎస్‌కు దీటుగా.. కేసీఆర్‌కు మైండ్‌ బ్లాంక్ అయ్యేలా అభ్యర్థుల జాబితా సిద్ధం చేసే పనిలో ఉన్నాయి రెండు పార్టీలు. ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక కోసం దరఖాస్తు ప్రక్రియ మొదలుపెట్టగా.. ఫస్ట్ లిస్ట్‌పై బీజేపీ దాదాపు ఓ క్లారిటీకి వచ్చేసింది. తొలిజాబితా విడుదల చేసేందుకు బీజేపీ సిద్ధం అయింది. ఇటీవలే పార్టీకి చెందిన కీలక నేతలతో మొదటి జాబితాను రూపొందించుకుంది. బీఆర్ఎస్‌కు చెందిన కీలక నాయకులు పోటీ చేయబోయే నియోజకవర్గాల్లో.. తమ అభ్యర్థులు ఎవరు అనేది ప్రకటించేందుకు బీజేపీ రెడీ అయింది. దాదాపు 35 మందితో తొలి జాబితాను ఇప్పటికే సిద్ధం చేసింది. ఒకట్రెండు రోజుల్లో ఈ లిస్ట్‌ రిలీజ్ చేయబోతోంది.

తొలి జాబితాలో గజ్వేల్‌లో సీఎం కేసీఆర్‌పై హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటలను పోటీకి దింపాలని నిర్ణయించింది. కేసీఆర్ గజ్వేల్‌లోనూ పోటీ చేస్తుండడంతో వచ్చే ఎన్నికల్లో అక్కడి నుంచి పోటీ చేసేందుకు ఈటల ఆసక్తితో ఉన్నారు. ఇక అటు బీఆర్ఎస్ మంత్రులు, కీలక నాయకులు పోటీ చేయబోయే నియోజకవర్గాల్లో కూడా బలమైన అభ్యర్థులను పోటికి దింపాలని బీజేపీ భావిస్తోంది. ఎన్నికల్లో వారు ఓడినా, తిరిగి ఎంపీలుగా అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. మంత్రి కేటీఆర్‌కు ప్రత్యర్థిగా బీజేపీ నుంచి బండి సంజయ్‌ను పోటీకి దించబోతున్నారు. బీజేపీ నుంచి ఎంపీలుగా ఉన్న నలుగురు.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. కేసీఆర్‌ పోటీ చేయబోయే మరో నియోజకవర్గం కామారెడ్డి నుంచి నిజామాబాద్ ఎంపీ అరవింద్‌ను పోటీకి దించాలని బీజేపీ భావిస్తోంది.

సిరిసిల్లలో కేటీఆర్‌పై బండి సంజయ్, సిద్దిపేటలో హరీష్ రావుపై బూర నరసయ్య గౌడ్, రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో సబితా ఇంద్రారెడ్డిపై కొండా విశ్వేశ్వర్ రెడ్డి పోటీ చేయబోతున్నారు. కరీంనగర్‌లో మంత్రి గంగుల కమలాకర్‌పై గుజ్జుల రామకృష్ణారెడ్డి, మహబూబ్‌నగర్‌లో శ్రీనివాస్ గౌడ్‌పై డీకే అరుణ పోటీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. నిర్మల్‌లో ఇంద్రకరణ్ రెడ్డిపై మహేశ్వర్ రెడ్డి, అంబర్‌పేట్‌ నుంచి కిషన్ రెడ్డి, మునుగోడు నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, దుబ్బాక నుంచి రఘునందన్ రావు పేర్లు మొదటి జాబితాలో ఉన్నట్లు సమాచారం. కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాపై ఒక క్లారిటీ వచ్చిన తర్వాత బీజేపీ తమ అభ్యర్థుల లిస్టును ప్రకటించాలని నిర్ణయించుకుందనే ప్రచారం జరుగుతోంది.