Etela Rajender: లోక్‌సభ బరిలో ఈటల రాజేందర్.. ఆ స్థానం నుంచే పోటీ..?

గత అసెంబ్లీ ఎన్నికల్లో రెండు చోట్లా పోటీ చేసి ఓడిపోయారు. సిట్టింగ్ హుజురాబాద్ స్థానంతోపాటు, కేసీఆర్‌పై గజ్వేల్ నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. అప్పటినుంచి ఏ పదవీ లేకుండా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నారు.

  • Written By:
  • Publish Date - February 19, 2024 / 06:58 PM IST

Etela Rajender: సీనియర్ పొలిటీషియన్, బీజేపీ నేత ఈటల రాజేందర్ రాబోయే లోక్‌సభ ఎన్నికల బరిలో నిలిచేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆయన మల్కాజ్‌గిరి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆ‍యన బీజేపీలో తన ప్రయత్నాలు సాగిస్తున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన ఈటలను ఆ పార్టీ తొలగించింది. అనంతరం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, బీజేపీ తరఫున హుజురాబాద్ నుంచి బరిలో నిలిచి గెలిచారు. అయితే, గత అసెంబ్లీ ఎన్నికల్లో రెండు చోట్లా పోటీ చేసి ఓడిపోయారు. సిట్టింగ్ హుజురాబాద్ స్థానంతోపాటు, కేసీఆర్‌పై గజ్వేల్ నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు.

ALI YSRCP: అలీకి వైసీపీ టిక్కెట్.. పోటీ చేసేది ఎక్కడ..?

అప్పటినుంచి ఏ పదవీ లేకుండా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నారు. నిజానికి ఆయన కరీంనగర్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయాలనుకున్నారు. కానీ, అక్కడ సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ ఉండటంతో టిక్కెట్ దక్కదని పార్టీ తేల్చేసింది. దీంతో మల్కాజ్‌గిరి స్థానం నుంచి పోటీ చేయాలని ఈటల భావిస్తున్నారు. ఈ అంశంపై ఈటల తన నిర్ణయాన్ని కూడా బయటపెట్టారు. అయితే, ఈ విషయంలో అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని చెబుతున్నారు. మరోవైపు మల్కాజిగిరి నుంచి ఎక్కువ మంది నేతలు బీజేపీ తరఫున టిక్కెట్ ఆశిస్తున్నారు. ఈటల రాజేందర్‌తోపాటు, బీజేపీ జాతీయ కార్యదర్శి మురళీధర్ రావు కూడా మల్కాజ్‌గిరి టిక్కెట్ ఆశిస్తున్నారు. తనకున్న జాతీయస్థాయి అనుభవం, పార్టీతో తనకున్న విధేయత వంటి అంశాలు పరిగణలోకి తీసుకొని తనకు అవకాశం ఇవ్వాలని మురళీధర్ రావు అడుగుతున్నారు.

వీరితోపాటు మాజీ ఎంపీ సురేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, బిజెపి రాష్ట్ర నేత కూన శ్రీశైలం గౌడ్, కొంపల్లి మోహన్ రెడ్డి, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అధినేత కొమరయ్య, మేడ్చల్ జిల్లా ఉపాధ్యక్షుడు హరీష్ రెడ్డి, రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు మల్లారెడ్డి, రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి, బీజేపీ అధికారి ప్రతినిధి తుళ్ళ వీరేంద్ర గౌడ్ వంటి నేతలు కూడా ఈ సీటును ఆశిస్తున్నారు. దీంతో ఈ సీటు ఎవరికి ఇవ్వాలి అనే విషయంలో నిర్ణయం తీసుకునే అధికారం బీజేపీ అధిష్టానానికి అప్పగించినట్లు తెలుస్తోంది. ఇంత పోటీలో మాజీ మంత్రి ఈటలకు ఛాన్స్ దొరుకుతుందా లేదా అనేది ప్రస్తుతం కీలకంగా మారింది. మరోవైపు ఆయన పార్టీ మారబోతున్నారు అంటూ జరుగుతున్న ప్రచారం కూడా ఈటలకు ఇబ్బందిగా మారింది. ఆయన కాంగ్రెస్‌లో చేరుతారని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది.