Etela Rajender: బీజేపీలో ఈటల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారిందా అనే ప్రచారం జరుగుతున్న వేళ.. లోక్‌సభ ఎన్నికలు ముంచుకు రాబోతున్నాయ్. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో.. లోక్‌సభ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న పట్టు మీదున్న ఈటల.. ఏ చిన్న పొరపాటు కూడా జరగకుండా జాగ్రత్తలు పడుతున్నారు. హుజురాబాద్, గజ్వేల్‌లో పోటీ చేసిన ఈటల.. రెండు చోట్లా ఓడిపోయారు. ఈ ఓటమి తర్వాత బీజేపీలో ఆయనకు ప్రాధాన్యం తగ్గిందనే ప్రచారం జరుగుతోంది. బీజేపీ అగ్రనేతల దగ్గర ఆయన పలుకుబడి బాగా తగ్గిపోయిందనే టాక్ వినిపిస్తోంది. దీంతో రాజేందర్ పార్టీ మారే ఆలోచనలో ఉన్నారని.. కాంగ్రెస్‌లో చేరే చాన్స్ ఉందని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది.
GUNTUR KARAM: ఆ పాటని కుర్చీ మడత పెట్టి తిట్టేస్తున్న ఫ్యాన్స్
ఐతే ఈ ప్రచారాన్ని ఈటల ఖండించారు. కాంగ్రెస్‌లోకి పోయేది లేదని.. అదంతా తప్పుడు ప్రచారం అని.. తానంటే ఇష్టం లేని వారు పుట్టించిన టాక్ అని.. హస్తం పార్టీపై ఘాటు విమర్శలు చేశారు కూడా! ఇదంతా ఎలా ఉన్నా.. లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసేందుకు ఈటల సిద్ధం అవుతున్నారు. ఈ మధ్య అమిత్ షా తెలంగాణకు వచ్చినప్పుడు.. తన మనసులో మాట బయటపెట్టారు కూడా! వచ్చే ఎన్నికల్లో తాను మల్కాజ్‌గిరి నుంచి పోటీ చేస్తున్నట్లు ఈటల ప్రకటించారు. ఐతే ఈ అనౌన్స్‌మెంట్ కమలం పార్టీలో ప్రకంపనలు క్రియేట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయ్. నిజానికి ఈటల.. కరీంనగర్ టికెట్ అడిగే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జరిగింది. ఒక సమయంలో అడిగారు కూడా! ఐతే సిట్టింగ్‌లకే సీట్లు అనే షా ప్రకటనతో సీన్ మళ్లీ మొదటికి వచ్చింది. ఐతే మెదక్ నుంచి పోటీ చేయాలని ఈటలకు సూచించినా.. ఆయన అంగీకరించలేదు. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావిస్తున్న కేసీఆర్.. మెదక్ నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయ్. అదే జరిగితే.. తనకు మళ్లీ కష్టం అవుతుందని ఈటలకు తెలుసు.
దీంతో మల్కాజ్‌గిరి నుంచి పోటీ చేయబోతున్నట్లు ఈటల ప్రకటించారనే టాక్ వినిపిస్తోంది. ఇదే కొత్త చర్చకు కారణం అవుతోంది. మల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గ బీజేపీ నేతలు.. ఈటలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ఈటల నుంచి మాత్రమే మల్కాజ్‌గిరి ప్రకటన వచ్చింది. అధిష్టానం నుంచి ఎలాంటి అనౌన్స్‌మెంట్ లేదు. దీంతో ఆయనకు టికెట్ ఇస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఈటలకు టికెట్ ఇస్తే బీజేపీ నేతల నుంచి గొడవ.. ఇవ్వకపోతే ఈటల పార్టీ మారే అవకాశం ఉందనే ప్రచారం.. ఎలా చూసినా బీజేపీలో కొత్త రచ్చ మొదలుకావడం ఖాయంగా కనిపిస్తోంది.