Chandrababu Naidu: స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో చంద్రబాబు రిమాండ్, అరెస్టుపై కోర్టులో వాదనలు ముగిశాయి. ఇరు పక్షాల వాదనల అనంతరం జడ్జి కోర్టు తీర్పు రిజర్వులో పెట్టారు. మరికొద్దిసేపట్లో తీర్పు వెలువడనుంది. చంద్రబాబుకు బెయిలా.. జైలా అంటూ సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కోర్టు పరిసరాల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. కోర్టు వద్ద భారీగా బలగాలు మోహరించాయి. కోర్టు చుట్టుపక్కల భారీగా భద్రత ఏర్పాటు చేశారు. విజయవాడ సీపీ కాంతి రాణా భద్రతా ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు.
రూ.271 కోట్ల స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో ప్రధాన సూత్రధాని చంద్రబాబే అంటే ఏపీ సీఐడీ అయనను అరెస్టు చేసింది. శుక్రవారం రాత్రి ఆయనను అదుపులోకి తీసుకోగా, శనివారం ఉదయం ఆయనను అరెస్టు చేసినట్లు ప్రకటించారు. దీన్ని సవాలు చేస్తూ విజయవాడలోని ఏసీబీ కోర్టులో చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు లాయర్ సిద్ధార్థ్ లూత్రా వాదనలు వనిపించారు. సీఐడీ తరఫున ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. ఏడున్నర గంటలకుపైగా ఇరుపక్షాల వాదనాలు కొనసాగాయి. మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు వాదనలు కొనసాగాయి. అనంతరం తీర్పును వాయిదావేస్తూ జడ్జి నిర్ణయం తీసుకున్నారు. దీంతో తీర్పు కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
కేసుకు సంబంధించి చంద్రబాబుపై సెక్షన్ 409 పెట్టడం సరికాదని, ఈ సెక్షన్ పెట్టాలంటే సరైన సాక్ష్యం చూపాలని లూత్రా వాదించారు. రిమాండ్ రిపోర్టును తిరస్కరించాలంటూ ఆయన కోర్టును కోరారు. కేసులో చంద్రబాబు పాత్రపై ఆధారాలున్నాయా..? ఎఫ్‌ఆర్‌లో ఆయన పేరు ఎందుకు లేదు..? వంటి ప్రశ్నల్ని కోర్టు సీఐడీ లాయర్‌ను ప్రశ్నించింది. చంద్రబాబు కూడా స్వయంగా తన వాదనలు వినిపించారు. తనకు, ఈ కేసుకు ఎలాంటి సంబంధం లేదని ఆయన కోర్టులో చెప్పారు. రాజకీయ కక్షతోనే తనపై కేసు పెట్టారని ఆయన కోర్టు దృష్టికి తెచ్చారు. బాబు వాదనల్ని సీఐడీ న్యాయవాదులు ఖండించారు. ఈ కేసులో చంద్రబాబు పాత్రపై ఆధారాలున్నాయని, తమకు రిమాండ్ ఇస్తేనే కేసు విచారణలో అసలు విషయాలు తెలుస్తాయని ప్రభుత్వ లాయర్లు వాదించారు. ఇరుపక్షాల వాదనలు ముగియడంతో.. తీర్పు రిజర్వులో ఉంచారు జడ్జి. మరికొద్దిసేపట్లోనే తీర్పు వెలువడే అవకాశం ఉంది.